Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. కె. దివాకరా చారి
9391018972
బంగారు తల్లులూ...
ఆకసాన ఇంద్ర ధనుస్సులై
గుండె తోటలో రంగు రంగుల
సీతాకోక చిలుకలుగా ఎగిరే
మన నవ్వుల పువ్వుల
చిట్టి చిన్నారులను గట్టిగా
పొదిమి పట్టుకోండి !
కనిపించని రాకాసి అల
ఏదో ఎగిరెగిరి వస్తోంది
ఎదురైన వాళ్ళ నెల్లా
కనికరం లేకుండా కబలిస్తోంది !
సముద్రాలు, దేశాలు
కొండలు, కోనలు
మిద్దెలు, పూరి గుడిసెలు
తేడా లేమీ లేకుండా
ప్రాణాలను హరిస్తూ
ప్రపంచాన్ని పీనుగుల దిబ్బలుగా
మార్చేస్తున్న ఆ మహమ్మారి నుండి
మన 'అంకురాలను' రక్షించు కుందాం!
మోగని బడి గంటలకు
మూగబోయిన పసిడి కూనలు
ఇంటి గోడల మధ్య బంధీలై
కంప్యూటర్ తెరలవేపు
బిక్క చూపులతో అతుక్కొని
కునారిల్లిపోతూ అసహనంతో
అల్లాడిపోతూ మిగిలిపోతున్నారు !
చెంగు చెంగున ఎగురుతూ
మన చిట్టి లేడి కన్నలు
భుజాన 'చదువులమ్మను' మోస్తూ
వీధులన్నీ రంగు రంగుల పువ్వులై
విరబూయటం చూడక ఎన్నాళ్ళయిందో?
చావుకు వెరవక
అస్త్ర శస్త్రాలతో వైద్యులు,
శాస్త్రజ్ఞులు, రక్షక సిబ్బంది
ఆ పెను సైతానుతో పోరు సల్పుతూ
మనకోసం కోట గోడలై నిలుస్తున్న
ఈ తరుణంలో మనమంతా
జాగరూకులై మరుగున దాగి
ఎదగాల్సిన రేపటి శిశు తరాన్ని
లోకపు విషపు గాలుల నుండి
వైషమ్యాలు, కార్పణ్యాలు,
అమానుషపు చూపులనుండి
కనురెప్పలై కాపాడుకుంటూ
కడుపులో దాచుకుందాం రండి!
ముడుచుకు పోతున్న చిన్ని ఎదలను
పొదిమి ప్రేమతో హత్తుకుందాం రండి !
( నవంబర్ 14 బాలల దినోత్సవం )