Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుల్లారామాంజనేయులు
కర్నూలు జిల్లా
9491851349
స్వర్ణగిరి రాజ్యం బంగారు గనులకు ప్రసిద్ధి .వర్షాకాలంలో ప్రజలు పొలాలలో వెతకడానికి పోతే వజ్రాలు దొరుకుతాయి. చాలా సంపన్న దేశంగా పేరుప్రఖ్యాతులు పొందింది. మహారాజు అశోకుడు అంటే మిగతా రాజ్యాలకు అజాతశత్రువు .
ఒకప్పుడు ప్రజలు సోమరులుగా ,జూదగాళ్ళుగా, వ్యసన పరులుగా ఉండేవారు. కారణం ఆ దేశ సంపదే. రానురాను దేశంలో ప్రజలు విలాసాలకులోనై దేశం బలహీనపడింది. ఆ సమయంలో ప్రహ్లాదుడనే పండితుడు అనేక గొప్ప రచనలు చేసి ప్రజల దృష్టిని, అలవాట్లను, వ్యక్తిత్వ వికాసాలపైకి దారి మళ్ళించాడు .అంతేకాదు తన దేశ ప్రతిష్టను ఇతర రాజ్యాలలో వెలుగొందేలా చేశాడు .ప్రజలను దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు.
ఆ రచనలను చదివిన అశోకమహారాజు ప్రహ్లాదుడిని, మంత్రులను ,పండితులను, సామంత రాజులను, ప్రజలను సమావేశపరిచి కనకాభిషేకం చేశాడు ."ఇంత జ్ఞానం, పేరు ప్రఖ్యాతలు రావడానికి, గొప్పవాడు కావడానికి ,తనలో ఇంత దేశభక్తి ఉండటానికి,తన కృషి ,పట్టుదలే కారణం" అని ప్రశంసించాడు మహారాజు అశోకుడు.
ఆ మాటలను ఏకీభవిస్తూ సభలో ఉన్నటువంటి పండితులు తమకు తెలిసీ తెలియని విషయాలతో ప్రహ్లాదుడిని పొగడ్తలతో ముంచెత్తారు.
చివరిగా ప్రహ్లాదుడు మాట్లాడుతూ .."నేను ఇంతటి వాడు కావడానికి కారణం అనేక మంది శ్రేయోభిలాషులు, మిత్రులు. "అని వారి గురించి పరిచయం చేయడం మొదలుపెట్టాడు.
"నా దేశం సంపన్న దేశం.కానీ నేను కడు పేదకుటుంబంలో జన్మించాను.చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. తిండికోసం పిడికెడు మెతుకుల కోసం నేను వ్యవసాయ కూలీగా పని చేశాను .పశువుల కాపరిగా ఉన్నాను .కలప కోసే వ్యక్తుల దగ్గర రంపంలాగే కూలిగా పనిచేశాను. ఒకే కమ్మరి దగ్గర తిత్తులూదడానికి సమ్మెట వేయడానికి పనికి కుదిరాను.
నాకు అసలు చదువే రాదు. చిన్నతనంలో నాకోక పెద్ద అవమానం జరిగింది. దాంతో నా మనసు చదువు వైపు మళ్ళింది .నా కన్నా చిన్నవాడైన నాగన్న మహా భారతంలోని పద్యాలు అనర్గళంగా పాడుతున్నాడు. నీకు ఒకటి కూడా పద్యం రాదని నా స్నేహితుడు సత్యం నన్ను అవమాన పరిచాడు. అది చూసి చుట్టూ ఉన్న వారందరూ నవ్వారు.ఆ నవ్వు నాకు మరిచిపోలేని గాయం చేసింది .ఆ గాయం నాలో పట్టుదలను రెచ్చగొట్టింది. పగలంతా కూలిపని చేసి రాత్రిపూట మా ఊరి ఆంజనేయస్వామి ఆలయంలోని ప్రమిద వెలుతురులో చంద్రశేఖరుడు గురువుగారి దగ్గర చదువుకున్నాను.నా చదువుకు కావలసిన వస్తువులు, గ్రంథాలు సమకూర్చినది వెంకటేశ్వర్లు గారు.
నన్ను ఎవరు చేరదీయక అనాథనై అన్నం లేక మాడి మసై సొమ్మసిల్లి పడిపోయిన నన్ను కొడుకులా చేరదీసి అన్నం పెట్టిన రత్నమ్మ గారు. కొంత వయసు వచ్చి కూలి కోసం వెతుకుతున్నప్పుడు నాకు కూలి పని ఇచ్చిన శ్రీరాములుగారు .పశువుల కాపరిగా నన్ను పెట్టుకున్న శంకరు గారు .నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉచితంగా వైద్యం చేసిన వైద్యుడు విశ్వనాథ్ గారు. అక్కున చేర్చుకున్న నా గ్రామ ప్రజలు .నా ఊరు ఎర్రగుడే కారణం .చీకట్లో ఒంటరిగా ఉన్న నన్ను వెలుగులోకి తెచ్చి నా జీవితానికి ఆధారం చేసిన మహానుభావులు వీరంతా. వీరందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నా బిడ్డలకు, నా కొడుకులకు, వీళ్ళ పేర్లు పెట్టుకున్నాను. వారిని మర్చిపోకుండా నా జీవితాంతం గుర్తుండేలా నేను రాసిన, మీరు చదివిన గ్రంథాలను వారికి అంకితం చేశాను. ఇంతకంటే వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. అని అంటుంటే కళ్ళు వెంట కన్నీళ్లు జలజలా కారుతుంటే తూడ్చుకుంటూ వారందర్నీ గుర్తుచేసుకున్నాడు ప్రహ్లాదుడు.
నాకు ఆకలి తెలుసు .ఆ విద్య తెలుసు .అవమానం తెలుసు. నిరుద్యోగం తెలుసు. అక్రమం తెలుసు. అధర్మం తెలుసు. నేను వీటిని జీవితమంతా అనుభవించాను. కాబట్టి ఇవి లేని నా దేశం కావాలని నేను కోరుకున్నాను .నా రచనలలో వాటి మూలాలను వెతికి పరిష్కార మార్గాలు చెప్పాను .
నేను మహాపండితుడను కాను. మామూలు మనిషిని. నేను స్వయంగా అనుభవించిన, నాకళ్ళ ముందు జరిగిన అనేక సంఘటనలను చూసి ఆ తప్పులను మీముందు ఉంచాను. అంతే నేను చేసిన పని. అందుకు మీరు నాకు ఇలా కనకాభిషేకం చేశారు. నాకు చేసిన ఈ సన్మానం మీకే చెందుతుంది" అని తన ప్రసంగాన్ని ముగించాడు ప్రహ్లదుడు.
సభ అంతా అభినందనలతో హోరెత్తి పోయింది. "నిజమే కదా..! చీకట్లో ఒంటరిగా ఉన్న ప్రహ్లాదుడిని చదువు నేర్పించి ఒక జ్ఞాన వెలుగును ముట్టిస్తే తాను వెలుగుతూ మరిన్ని దీపాలను వెలిగించాడు. మనందరిలోను ఆ వెలుగులను ప్రసరింప జేశాడు మహాపండితుడు ప్రహ్లాదుడు" అని అక్కడి ప్రజలంతా జయజయ ధ్వానాలతో కీర్తించారు.