Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగులపాటి అశ్విని
ఈదులూరు, నల్గొండ జిల్లా
అనగనగా ఓ ఊరిలో అందమైన కాకి కుటుంబం ఉండేది. వాటికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కలిసిమెలిసి ఉండేవి ఆహారంకోసమై ఎటువెళ్ళినా ఈ కాకులు కలిసే వెళ్ళేవి. ఈ అక్కాచెల్లెళ్ళకి పెండ్లీడు వచ్చిందని వాటి అమ్మానాన్న మాట్లాడుకుంటుండగా విన్నారు. చెల్లి కాకి అక్క కాకితో మనం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉన్నాం ఉన్నంతలో సంతోషంగా బ్రతికాం ఇకముందు కూడా ఇలాగే ఉందాం అని చెప్పింది. రెండ్రోజులకే ఈ అక్కాచెల్లెళ్ళకి పెండ్లిచేసి ఎవరి నివాసానికి వాళ్ళని పంపించారు. అక్క కాకికి చెల్లి కాకి అంటే ఇష్టమేలేదు. ఎందుకంటే చెల్లి కాకికి ఉండడానికి ఇళ్లు కూడా లేదు. గుడిసెలో బ్రతుకుతుంది వేసుకోడానికి రెండు జతల బట్టలతో సరైన వసతులు లేక పూట గడవని స్థితిలో బ్రతుకుతుందని తెలిసి వారికి దూరంగా ఉంటుంది పైగా నవ్వుకునేది. అక్క కాకికి రెండంతస్తుల భవనం , నగలు, పట్టుచీరలు, తినడానికి తిండి అన్ని సౌకర్యాలతో ఆనందంగా జీవిస్తుంది. పూట గడవని స్థితిలో ఉన్నా ఏనాడు అక్క కాకి దగ్గర చేయిచాచి ఏదీ అడగలేదు. ఉన్నంతలో సర్దుకుపోయే గుణం చెల్లి కాకిది. ఇదిలా ఉండగా ఓ రోజు భీభత్సమైన వరదలు వచ్చి ఊరిని ముంచెత్తాయి. ఊరిలో ఉన్న గుడిసెలన్నీ మునిగిపోయాయి. అక్కడక్కడా భవనాలు మాత్రమే ఉన్నాయి. ఉన్న గుడిసె కూడా వరదల్లో మునిగిపోయిన దుఃఖంలో కట్టుబట్టలతో పిల్లలతో ఓ చెట్టుపై తలదాచుకుంటారు చెల్లి కాకి కుటుంబం. అంతలో అక్కకాకి సహాయం కోసమై అక్క దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పుకొని ఏడుస్తుండగా, ఇప్పుడే వస్తాను ఇక్కడే వుండమని చెప్పి అక్క కాకి లోపలికి వెళ్ళి అట్లకాడని బాగా కాల్చి చెల్లి కాకికి వాత పెడుతూ మరోసారి ఇటువైపు రాకని చెప్పకనే చెప్తుంది. అక్క చేసిన పనికి చెల్లి కాకి బాధపడుతూ మరోమాట మాట్లాడకుండా వెళ్ళి చెట్టుపైవాలి ఏడుస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా , నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు వారి ఆకలి తీర్చండి స్వామి అని అడుగుతుంది. సరే అక్కడ కనిపిస్తున్న పుట్టలో ఉంది అదంతా నీదేనని చెప్పి మాయమైపోతారు. చెల్లి కాకి ఆహారంకోసమై పుట్టలో చేయి పెట్టగానే అక్కడే పెద్ద భవనం, ఆహారం, బట్టలు, నగలు అన్నీ సిద్దమైపోతాయి. ఎంత తిన్నా తరగని సంపదని ఇచ్చినందుకు శివపార్వతులకు కృతజ్ఞతలు తెలిపి ఆ సంపదని వృథా చేయకుండా కూడు,గూడు లేనివారికి ఆదుకుంటూ రోజు ఆహారం వండి వడ్డించేది. ఇది ఆనోటా ఈనోటా అక్కకాకికి చేరి బాగా కుళ్ళుకునేది. అంతలోనే మరోఆపద వరదరూపంలో ఎదురై అక్కకాకి భవనం కూలిపోయింది. పిల్లలతో కలిసి అన్నదానం దగ్గర ఆహారంకోసం ఎదురు చూస్తూ లైనుకట్టడం చెల్లికాకి చూసి, అక్కకాకి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటుంది. నీకు ఉన్నఫలంగా ఇంతటి ఆస్తి ఎక్కడిదని చెల్లికాకిని అడగగానే జరిగిన విషయం చెప్తుంది. అక్కఃకి ఆశ కలిగి నాకు కూడా వాతపెట్టమని బ్రతిమిలాడుతుంటే చెల్లికాకి వాతపెడుతుంది. అక్కకాకి ఓ చెట్టుపైవాలి ఏడుస్తుంటే జరిగిన విషయం తెలుసుకున్న శివపార్వతులు అక్క కాకికి తగిన బుద్ది చెప్పాలని ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, నాకు నాలుగు అంతస్థుల భవనం, పట్టుచీరలు, నగలు, ఆహారం కావాలని అడుగుతుంది. అదిగో అక్కడ కనిపిస్తున్న పుట్టలో చేయిపెట్టు అది నీకు దక్కుతుందని మాయమైపోతారు. వెంటనే పుట్టలో చేయిపెట్టగా పాము, తేళ్ళు కుట్టి అక్కడే చనిపోతుంది అక్కకాకి. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉంటే చివరికి ఇలాగే జరుగుతుంది.
దురాశ దుఃఖానికి చేటు.