Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనమిలాగే...!
జఢత్వపు ముసుగుతన్ని
మొద్దు "నిద్దుర" తీస్తుంటే...
వాడు "వేకువ" పొద్దును
ఎగరేసుకు పోతుంటాడు
భయం మాటున దాగి
బతుకు క్షణాల లెక్కిస్తుంటే...
వాడు "భవిత" రాశుల
బాహాటంగా పోగేసుకుంటాడు
అంధ విశ్వాసాల శ్వాషిస్తూ...
బండరాళ్లకు "భజన" చేస్తుంటే...
వాడు మందిర నిర్మాణాలకు
పునాదులు తీస్తుంటాడు
స్వర పేటికల మూసేసి
మౌన ముద్ర వేసుకుంటే
వాడు హక్కుల కుత్తుక కత్తిరించ
కుట్రల కత్తులకు పదునెక్కిస్తాడు
శుసుప్తావస్థ ఊబిలో చిక్కి...
అడుగంటా కూరుకుపోతుంటే...
వాడు చట్టాలు ఏమార్చ
ఎత్తుగడల రచిస్తుంటాడు
కూపస్థ మండూకంలా
అక్కడే కుదురుకుంటే
వాళ్ళు బానిసత్వం కట్టబెట్టి
ఆధిపత్యం చెలాయిస్తుంటాడు
అదిగో... !
ఆ తూరుపు కొండల్లో
ఉద్యమ "పొద్దు" పొడిచింది
ఆ వెలివాడల గుడిసెల్లో
నిరసన "జెండా" ఎగిరింది
ఆ ధిక్కార స్వరాలకు
గుండె "గొంతుక" అరువిద్దాం
ఆ ఎత్తిన పిడికిళ్లకు
నెత్తుటి "సత్తువ" ధారపోద్దాం
ఆ ఎగసిన విప్లవాగ్నులకు
సమిదనొక్కటి ఆహుతిద్దాం
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
Mbl no :9573996828