Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పురాణ యుగాల్ని నెట్టేసి
చరిత్ర ఘట్టాల్ని తోసేసి
యుగ పురుషుడై నిలిచి
చరిత్రకు మార్గ నిర్దేశం చేసి
భారత చరిత్రనే
తన తలపాగ గా చుట్టుకున్న
ఓ కారణ జన్ముడు
మహోన్నత వ్యక్తి...
దృఢమైన మానసిక
సంకల్ప బలం కలవాడు...
భారతమాతకు నుదుటిబొట్టుగా రాజ్యాంగాన్నిచ్చిన
దళితేంద్రుడు..అంబేద్కర్!!...
అసూయాద్వేషాలు లేనోడు..
వర్గ వర్ణ భేదాలు లేనోడు...
ఆత్మవిశ్వాసమున్నోడు...
అనంత చైతన్యమున్నోడు...
లోతైన చూపు ఉన్నోడు..
లోకాలను తిరిగినోడు...
లొసగులన్నీ తెలిసినోడు...
విశ్వాన్ని జయించినోడు...
విశ్వరూపమై నిలిచినోడు...
జాతి కొరకు..నీతికొరకు
నీడకొరకు నిలువెత్తు నిలిచినోడు!!...
తడబడని అడుగులతో...
ముడి పడని మాటలతో...
చూపులతో మలుపుతిప్పి...
ఎదలోతుల్లో ఉవ్వెత్తున
ఎగసిపడే ఆవేదనను తొలిగించి
వెలుగులెన్నో నింపినోడు!!....
అరమోడ్పు చూపులతో...
సమస్తాన్ని వీక్షించే నేర్పుతో...
కుంగిపోయిన వారిని
చేయూతనిచ్చిన నేర్పరి!!...
విద్యావేతగా...
రాజ్యాంగనేతగా...
మహోన్నతవ్యక్తిగా...
తనజాతి మూలాల్లో
నారు పోసి..నీరుపోసి..
తాను కంచై నిలిచాడు...
ఒరిగిపోతున్న తన
మూలాల వాసులకు ఊతమై...
కుంగిపోతున్న తన
జాతి వాసులకు...
ఊపిరై నిలబడ్డాడు!!...
అతని ఆలోచనల్లో
ఆవేదన వుంది...
ప్రతి క్షణం ఓ వీక్షణం..
సమాజం గుండెలో ఓ నిజకాంతి..
లోలోపల నిశ్శబ్ద రణం...
జగతి గతికి ఓ కొత్త మార్గం...
తనలో మానవత్వపు విలువలు
సమానత్వపు వెలుగులు
నడిచే మార్గాలు!!..
అంతరాత్మలో
ఎన్నెన్నో మార్గాలు!!...
కులవివక్ష..కుటిలనీతి
ఉక్కుపాదాలకింద నలిగిన
దాహార్ధులను దగ్గరికి చేర్చి
అభయహస్తం నొసగిన
నిజమైన దేవుడు..."అంబేద్కర్"!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801