Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్యాయం అధర్మం అక్రమాలను ఎదిరించడం తోటి వారి బాధలను తన బాధలుగా చేసుకుని, తప్పెవరు చేసినా తిప్పికొట్టే తిరుగుబాటు ధోరణి తో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నిత్య చైతన్య శీలి ప్రజాకవి కాళోజీ నారాయణ రావు .కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో 9.09 .1914 వ సంవత్సరంలో జన్మించారు కాళోజి తల్లి రమాబాయి .ఆమె కన్నడ ప్రాంతానికి చెందినవారు. తండ్రి రంగారావు మహారాష్ట్రీయుడు.రంగారావు కుటుంబం వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో ఉన్నత పాఠశాల విద్య వరంగల్, హైదరాబాద్ లో జరిగింది .అనంతరం న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. న్యాయవాద వృత్తిలో కొంతకాలమే ఉన్నారు. 1940 సంవత్సరంలో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.చుట్టూ ఉన్నవారు తెలుగు మాట్లాడే వారైనప్పటికీ ఉన్నత పాఠశాల విద్య ఆంగ్ల మాధ్యమంలో కొనసాగింది. నిజాం పాలనలో ఉర్దూభాషకు ప్రాధాన్యత ఆ రోజుల్లో ఉండేది .కాబట్టి కాళోజీ గారికి హిందీ భాష, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ భాషలతో సన్నిహిత సంబంధం ఉండేది. దాదాపు ఈ భాషలన్నింటిలో రచనలు చేశారు. ఏ భాషలో రచనలు చేసినప్పటికీ ఆయన ప్రజల కష్టాలను, సమస్యలను తెలియజేయడానికి తన కలాన్ని సాధనంగా చేసుకున్నారు. భగత్ సింగ్ ను ఉరి తీసిన సంధర్భంలో తన తొలి కవితను 16 వ సంవత్సరంలో రచించారు. చాలా సున్నిత మనస్కుడైన కాళోజి వ్యక్తి స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. తన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలను చూసి చలించి పోయేవారు. తాను ఏది చెప్పాలనుకున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ప్రజల హృదయాలను కదిలించే విధంగా కవిత్వం చెప్పడం కాళోజీ కవితా లక్షణం. సామాజిక స్పృహతో సంఘాన్ని సంస్కరించే లక్ష్యంతో చెప్పే కవిత్వమే ఉత్తమ కవిత్వం అనిపించుకుంటుంది. కాళోజి తన కవిత్వాన్ని వజ్రాయుధంలా ఎక్కుపెట్టి సంధించారు.. ప్రజలను, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించగలిగిన శక్తి కవిత్వానికి ఉన్నది .కవులు ప్రజా ప్రతినిధులు కాబట్టి కవిత్వాన్ని సమాజ సంక్షేమానికి వినియోగించాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగి నిష్పక్షపాతంగా వ్యవహరించిన వాడే నిజమైన కవి. అలాంటి గుండె ధైర్యం ఉన్న కవి కాళోజీ. ఆయన కవిత్వానికి భయం లేదు. అనంతమైన కాలాన్ని తన కవితల్లో పొందుపరిచారు . భూతకాలాన్ని భవిష్యత్తు కాలాన్ని వర్తమాన కేంద్రం వద్ద నిలిపి తెలుప కలిగినవాడే నిజమైన కవి. కాళోజీ తన కవితలో
నేను ప్రస్తుతాన్ని ఉగతానికి శిఖరాన్ని
వర్తమానాన్ని ఉభావికి ఆధారాన్ని
నేను కథనాన్ని ఉనేను అక్షరాన్ని
నిన్నటి స్వప్నాన్ని ఉరేపటి జ్ఞాపకాన్ని
అంటూ చెప్పారు. కాళోజి దూరదృష్టి కలిగి జాతి ప్రయోజనాలను కాపాడగలిగిన వాడు. కవి కలం ఎంతో శక్తివంతమైనది. అలాంటి శక్తివంతమైన కవిత్వం కాళోజి కలం నుండి జాలువారి సగటు మానవుని గుండెలను తట్టి నిద్ర లేపింది. అతని కవిత్వం ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి దిశానిర్దేశం లేని సమాజానికి కాళోజీ కవిత్వం మార్గదర్శనం చేస్తూ ఒక వేగుచుక్క లా పనిచేస్తుంది. కాళోజి ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షించి రచనలు చేశారు. కవిత్వానికి అందాన్ని అద్దడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు సమస్యలపై స్పందించి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తనదైన శైలిలో సూటిగా చెప్పే నేర్పు కలిగిన వ్యక్తి కాళోజి. కులమతాలకు అతీతంగా ప్రజల బాధల పట్ల సానుభూతి కనబరుస్తూ ప్రజల పక్ష పాతి గా నిర్మొహమాటంగా సమాజంలోని అసమానతలను ఎత్తిచూపి, కూలీల పట్ల, అభాగ్యుల పట్ల, అన్నార్తుల పట్ల, ప్రేమాభిమానాలతో వారి కన్నీళ్లు తుడిచి వారి కష్టాలను తన కవితలో ప్రతిఫలింప చేసి పాఠకులను ఆలోచింప చేస్తారు. పీడితుల పట్ల గుండెల్లో గూడుకట్టుకున్న కారుణ్య రూపమే కాళోజి కలం నుండి కవిత్వమై దర్శనమిచ్చింది. ప్రజల గొడవను తనదిగా చేసుకుని నా గొడవగా కవిత్వీకరించిన ప్రజాకవి. సామాజిక స్థితిగతులను బట్టి పీడితులు గా ఉండే కార్మిక, కర్షక, శ్రామికులు గళమెత్తి గర్జించే ఆత్మస్థైర్యమును నూరిపోసి ఏమిటి? ఎందుకు?అను ప్రశ్నలను సంధించే అస్తిత్వాన్ని పీడిత జన పక్షపాతిగా తన అంతరంగంలోని భావాలకు అక్షర రూపం ఇచ్చారు. కాళోజీ సంవేదనల కొలిమి నుండి కన్నీటి జలపాతాల నుండి, నిరంకుశ సంకెళ్ళ నుండి, పోలీస్ ఉక్కు పిడికిళ్ళ నుండి, ఆకలి మంటల నుండి ,ప్రభుత్వపు పాశవిక దాడుల నుండి, భూస్వాముల పెత్తందారుల కరకు దుశ్చర్యల నుండి, దొరల ఆగడాల నుండి, కాళోజీ కవిత్వం వెలువడింది. తన కలాన్ని ఆయుధంగా చేసుకుని బలమైన కవితా ప్రస్థానాన్ని కొనసాగించిన కాళోజి తెలుగు వారు గర్వించదగిన కవి. ప్రజల జీవితాల్లో మమేకమైన కాళోజీ మాతృభాష పట్ల మమకారాన్ని కలిగి ఉండి, పరభాషా వ్యామోహితులను నిరసించేవారు.
ఏ భాష నీది ఏమి వేషమురా?
ఈ భాష ఈ దేశమెవరి కోసమురా
ఆంగ్లమందు మాట్లాడగల్గగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?
తెలుగు బిడ్డవయ్యు తెలుగు రాదంచును
సిగ్గు లేకను ఇంక చెప్పుడెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?
అంటూ పరభాషా వ్యామోహితుల పట్ల నిరసనను నిర్మొహమాటంగా చెప్పగల ధీశాలి కాళోజీ. చుట్టూ ఉన్న ప్రజల అభిరుచులు ,అలవాట్లు వారి వ్యవహార శైలిని ప్రత్యక్షంగా చూసి సొంతం చేసుకున్న వ్యక్తి, కాబట్టి తన రచనల్లో వారి జీవనాడిని స్థానిక మాండలిక పదములను,పలుకుబళ్ళు మొదలైనవి అప్రయత్నంగానే అతనికి కవితలో ఒదిగి ద్విగుణీకృతమై సహజ సౌందర్యాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ యాస గురించి చెప్పుతూ ఃతెలంగాణ భాషః అనే కవితలో
తెలంగాణ యాసనెపుడు
యీసడించు భాషీయుల
సుహృద్భావన ఎంతని
వర్ణించుట
సిగ్గు చేటు
వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటూ....
అంటూ తెలంగాణ యాసను నొక్కి పెట్టి మన నిత్య జీవితంలో ఆంగ్ల ఆధిపత్యము ఏర్పడిన విధానాన్ని తెలియజేశారు.
కాళోజీ రచనలు 1943 వ సంవత్సరం లో కథలు రచించారు. ఃనా గొడవ కవితా సంపుటిః ఃతుది విజయం మనది నిజంః ఃఆత్మకథః ఃబాపూ! బాపూ!! బాపూ!!!ః మొదలగు ముద్రిత రచనలు, అనువాద రచనలు కాకుండా అముద్రిత రచనలు ఎన్నో ఉన్నాయి. 1956 నుండి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. రాజకీయాలలో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగిన కాళోజీ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులుగా, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా వున్నారు. భారత ప్రభుత్వంచే స్వాతంత్ర సమరయోధులుగా సన్మానం, తామ్రపత్రం అందుకున్నారు. 1992లో భారత ప్రభుత్వ ఉన్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం, గురజాడ అవార్డు, గౌరవ డాక్టరేట్, మొదలగు అనేక పురస్కారాలను అందుకున్నారు.
కాళోజీకి మన,పర అనే భేదం లేకుండా ఉండేవారు. అందరూ నావాళ్లే అనే భావం ఉండేది. అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. అందుకే ఆయనకు దేశమంతా సన్నిహితులే, స్నేహితులు,పరిచయస్థులే. కులమతాలకు అతీతంగా, ప్రాంతాల సిద్ధాంతాలకతీతంగా, ఎంతోమంది సాహిత్య మిత్రులు కూడా ఉన్నారు. ప్రజల గోడును పట్టించుకునే వారే చరిత్రలో నిలుస్తారు అనడానికి నిదర్శనం కాళోజి.
కాలళోజీ అన్న రామేశ్వర్ కూడా షాద్ పేరు తో ఉర్దూ కవిత్వం రాశారు. అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగా ఉండే వారు. చిన్నప్పటినుండి రామేశ్వర్ కాళోజీని బాగా చూసుకునే వారు. అతడు 1996వ సంవత్సరంలో చనిపోయారు. అతడు చనిపోయిన ఆరు సంవత్సరాలకు 13 నవంబర్ 2002 సంవత్సరంలో కాళోజీ కీర్తి శేషులు అయ్యారు. బ్రతికినన్నాళ్లు ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళను ఎల్.వి.ప్రసాద్ నేత్ర చికిత్సాలయానికి, శరీరాన్ని ప్రజల ఉపయోగార్ధం కాకతీయ వైద్య విశ్వవిద్యాలయానికి ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాళోజి.
అంతః ప్రేరణ వల్ల అద్భుతమైన కవిత్వం రాస్తూ జన్మాంతర సంస్కారంతో జాజ్వల్యమాన మైన సామాజిక జీవధారను అద్భుతంగా అక్షరీకరించి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కాళోజీ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులు అయ్యారు.
- పులి జమున
మహబూబ్ నగర్
8500169682