Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొండ ముదిరితే ఊసరవెల్లి
రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు
నోటిస్తేనే ఓటు అనే ప్రజలు . . . . .
అన్నీ ఉచితం ,అంతా ఉచితం
అని ప్రలోభపెట్టే నాయకులు
ఇన్ని అవరోధాల మధ్య
ఇంకెక్కడి ప్రజాస్వామ్యం
అంతా అర్థబలం , అంగబలం .
ఈ అర్థ ,అంగ బలాల మధ్య
ఓడిపోతోంది ప్రజాస్వామ్యం
శతాబ్దాలుగా, దశాబ్దాలుగా
ఎవరెట్లన్నా పోనీ
ప్రజాస్వామ్యం మాత్రం ఖూనీ .
ఏమిటీ ఉచితం?ఎందుకీ అనుచితం?
నాయకులారా ! మా ప్రజలను
కష్టపడి బ్రతకనివ్వండి
కష్టపడే బ్రతుకునివ్వండి
శ్రమజీవికే విలువివ్వండి .
అసహాయులకే సాయమివ్వండి
అప్పుడే ఆర్థిక సమానత్వం
అందరికీ కనపడుతుంది.
నోరున్నవాడిదే రాజ్యం
తెలివున్నోడిదే పదవుల భోజ్యం
దేశాభివృద్ధి పూజ్యం
ఈ స్థితి నుండి దేశాన్ని రక్షించాలంటే
ప్రతి మనిషికీ ఉన్న
ఒకే ఒక ఆయుధం!అదే ఓటు!
ఓటుకు నోటుకు చోటే లేకుంటే
అక్కడే అభివృద్ధి ఆరంభం
నోటుకు చోటిస్తే
అప్పుడే పతనం ప్రారంభం .
నక్సలిజం, రౌడీయిజం
ఏ ఇజమైనా, మరే నిజమైనా
పుట్టేది ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడే
ఈ పిచ్చి మొక్కలు
మొలవకుండా,నిలువకుండా
నిలువరించాల్సింది మనమే .
నాయకులకు పదవీ కాంక్ష
మన బ్రతుకులపై లేదు ఆకాంక్ష
అందుకని మమమే మారాలి.
మార్పనేది ఓర్పుతోనే సాధ్యం
మొదలవ్యాలి అది మనతోనే
అప్పుడే చూడగలం జీవన వైవిధ్యం.
ఇలా నేర్పు చూపితేనే
పంచాయతీ నుండి పార్లమెంటు దాకా
చట్ట సభలు గొప్ప నేతలతో నిండేది.
అప్పుడే సామాన్యుడి బ్రతుకు పండేది .
నేతలారా ! మీ పార్టీలు గెలవడం కాదు
ప్రజల మదిలో నిలవడం ముఖ్యం
అప్పుడే అవుతారు ఓ!టంగుటూరిలా !
ఓ ! వావిలాలలా! ఓ! అమరజీవిలా !
నిలిచిపోతారు దేశ చరిత్ర లో . . . . .
-సబ్బు నాగయ్య ప్రజాకవి
ఖమ్మం.
- 9573996828