Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సబ్బు కలం..
జై జవాన్ జై జవాన్ అంటుంటే
నావళ్ళు పులకరించినట్లుంది
భరతమాత పలుకరించినట్లుంది .
ఎండనకా , వాననకా
రేయనకా , పగలనకా
సరిహద్దును కాపుకాస్తూ
మంచు కొండల్లో
మండుటెండల్లో సైతం
పండు వెన్నెల్లా భావించి
శత్రువు గుండెల్లో నిదురిస్తున్నావు.
కుటుంబానికే దూరంగా ఉన్నావు
దేశ రక్షణకై త్యాగం చేస్తున్నావు
నీ దేహాన్నే దేశానికి
రక్షణ కవచం చేశావు .
తుపాకీ తూటాల వర్షం మధ్యన
ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుని
దేశ ఉనికి కోసం ప్రాణాన్నే
పణంగా పెట్టే నిన్ను చూస్తే
దేశభక్తి తో మా రక్తం మరుగక మానదు .
ప్రకృతి విపత్తు వచ్చినా
మత కల్లోలం రేగినా
మాకు నీ సాయం ఖాయం
నీవే లేకుంటే మా స్వాతంత్ర్యం మాయం
జీవితాన్ని గడ్డిపోచగా భావించి
త్యాగాలనే దిన చర్యగా జీవించే
మన సైనికులను చూసి
మనమేం నేర్చాం ?
స్వార్థమే జీవిత పరమార్థంగా
స్వలాభమే స్వాతంత్ర్య ఫలంగా
భావిస్తూ బ్రతికేస్తున్నాం
దేశం ఏమన్నా కానీ,
ఈ వ్యవస్థకు ఏ అవస్థైనా రానీ
చిన్ని నా బొజ్జకూ శ్రీరామ రక్ష
అని అనుకుంటున్నాం
కానీ మనం అందరిలో
సేవాభావాన్ని కలిగిద్దాం
దేశభక్తిని రగిలిద్దాం
దేశం పట్ల బాధ్యత కలిగిద్దాం .
నేతల్లారా, దేశ భావి నిర్ణేతల్లారా
జనంపై ప్రేమను పెంచుకోండి
అధికారం పై ప్రేమను తుంచుకోండి
ఉదాహరణలు ఇవ్వకుండా
మీరే ఓ ఉదాహరణలా నిలవండి
మీ పేర్లు శిలాఫలకాలపై కాక
ప్రజల మనో ఫలకాలపై లిఖించండి .
చట్ట సభలలోని ప్రతి ఒక్కరూ
ఓ! సైనికుడి పాత్ర పోషించి
ఈ దేశాన్ని సమస్యల
సుడిగుండం నుంచి కాపాడండి .
జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని బ్రతికించండి .
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
సేల్ : 9573996828