Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను శ్రామికున్ని
అవని అణువణువున దాగిన
కణశక్తి భాంఢాగారాన్ని
తొలిజామున దిగ్గునలేచి
నడిచే అగ్గిగోళాన్ని
చైతన్యదీపాన్ని!
నేను శ్రామికున్ని
ఘర్మజలం నిండిన
మహా సముద్రాన్ని
అణచివేయ తలపెట్టకు
ఆకాశమంతెత్తు ఎగసే
సుడుల సునామీని!
నేను శ్రామికున్ని
మట్టిలో మాణిక్యాల్ని మూటగట్టి
మానవలోకినికందించే
విశ్రమించని నావికున్ని!
నేను శ్రామికున్ని
సమ్మె సైరన్ లో
సింహనాదాన్ని
ప్రశ్నించే గొంతుకను
అణచివేయాలని చూడకు
నేనొక అగ్నిపర్వతాన్ని
కోటిగొంతుకలతో
మండేలావానై బ్రద్దలౌతాను!
నేను శ్రామికున్ని
సవ్యదిశాచర జీవిని
సమయాన్ననుసరించి నడిచే
గంటల గడియారాన్ని
అపసవ్యదిశలో
నన్ను నడిపించాలనిచూస్తే..
నీపాలిటి యమపాశాన్ని!
నేను శ్రామికున్ని
నీ ఇంటిదీపాన్ని
నీవుతినే కంచాన్ని
కంచంలో అన్నాన్ని
నన్ను కాలరాయాలని చూడకు
నీవే నేలరాలగలవు!
నేను శ్రామికున్ని
ప్రగతిఫలాలనందించే
పచ్చటి ఫలవృక్షాన్ని
నారెక్కలను విరవాలని
మోడునుచేయాలని తలవకు
నిలువనీడలేక
మండుటెండల్లో నీవే మాడిపోతావ్
ప్రగతిరథం విరిగి
పైనుండి కిందికి
పదివేలడుగుల లోతున
పాతాళంలోకి పడిపోతావ్ !
నేను శ్రామికుడను
విశ్వజన ప్రేమికుడను!!
ఎద్దుల యాదగిరి
అధ్యక్షులు-తెలంగాణసాహితి
వనపర్తిజిల్లాశాఖ
9963224187