Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరుకిరుకు గనుల్లో బొగ్గు తవ్వకాల్లో
ఇంటి బతుకులు బుగ్గై మాసిబారినా
ఇనుప కొలుముల ఎర్రని మంటల్లో
ఇంకిన జీవితాలు మాడి నుసినుసైన
బందిఖానాల ప్యాక్టరీల్లో బరువులు మోసి
బండ బారిన భవిష్యత్తు మగ్గిపోతున్నా
భారీ మిషన్ల మధ్య చెరుకులా నలిగి పిప్పై
బలవంతపు చావులే బలి తీసుకుంటున్నా
కొండల్ని పిండిచేసి రాళ్ళు పగలగొట్టి
కాళ్ళు చేతులిరిగి ఒళ్ళు గుల్లయినా
కంకర రాళ్ళు కాటిక తారుతో రోడ్లేస్తూ
కకావికలుగా ఛిద్రమై హూనమైపోయిన
వంటింటి పోగాల సెగల మధ్యలోనే
వంట్లోని రక్తమంతా పొగచూరి పోతున్నా
వారి నారుమళ్ళు కోతలు కలుపులంటూ
వంచిన నడుమెత్తకుండా పని చేసినా
కర్షకులు కార్మికులు శ్రామికులు మహిళలకు
కష్టాల కడగళ్ళ రోగాల రోదనలే తోడుండేది!
ఉత్పత్తులు పెంచి ప్రగతి బాట పట్టించినా
ఉప్పునీటి కన్నీళ్ళే చివరకు మిగిలేది!
- డా.. కందేపి రాణీప్రసాద్