Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాన్ని గర్వంగా నిలబెట్టిన వెన్నెముక
రైతు నడుం నేడు వంగి నీరసించింది
ఆరుగాలం కష్టించి సత్తువనంతా
చెమటగా మట్టితల్లిగుండెని తడిపి
పండించిన పంటను ఊహించని
ఈదురుగాలులో,వర్షాలో ఊడ్చేస్తే
దక్కినధాన్యమైనా గిట్టుబాటు ధరతో కడుపు నింపుతుందని కలలు కంటూ
కల్లంలో కష్టపడే అన్నదాత కళ్ళల్లో
కనిపించని కన్నీళ్ల నెవరు తుడిచేరు ?
పొట్ట చేతపూని బ్రతకలేక ఊరొదిలి
వలస వచ్చిన కూలీల నెత్తుటి కన్నీటితో
కాంక్రీట్ జనారణ్యపు నాగరీకులకై
కట్టిన బహుళంతస్తులు,ఫ్లైఓవర్ల సోకు
పునాదుల క్రింద కానరాని సమాధులు
కనిపించని వెతల దీన గాథలెన్నెన్నో ?
జీవన పోరాటంలో అసువులు బాసిన
అమాయకపు వ్యధార్థ గాథలెన్నో ?
తొంబై శాతం జనాల నోళ్ళు కొట్టి
కడుపులు మాడ్చి దోచిన
దేశ సంపద పది శాతం
నయా కుబేరుల ఖజానా నింపే
అసమాన అన్యాయ వ్యవస్థలో
హక్కులు హుళక్కని
ఇదేమి న్యాయమని గొంతెత్తి ప్రశ్నిస్తే
జైళ్లు నోళ్ళు తెరిచే దుర్మార్గ
రాచరిక పాలనలో
రాజ్యాంగం పరిహసించబడుతోంది
శ్రమజీవులు పల్లెల్లో కర్షకుడైనా
పట్టణంలో కార్మికుడైనా
నగరంలో బ్రతికే సామాన్యుడైనా
నిశ్చింతగా జీవించగలిగే
సుందర లోకం కావాలి
రోదనలు, పీడనలు లేని
సమతా రాజ్యం కోసం
పిడికిలి బిగించి నినదించాలి
అంతరాలన్నీ సమసిపోయి
అందరం ఒక్కటై ఆనందం పండించే
'నవలోకం' ఆవిష్కరించబడాలి
- డా. కె. దివాకరా చారి,
9391018972