Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కెపి లక్ష్మీ నరసింహ
90106 45470
నేనిప్పుడు
గుండెనిండా ధైర్యాన్ని కూడగట్టుకోవాలి...
నక్క జిత్తుల నాయకుల ప్రసంగాలు
చెవ్విలోకి జొర్రకుండా
ఇంత పత్తిని అడ్డం పెట్టుకోవాలి
లేదంటే
అతడు వాగే సొళ్లంతా
నిజమనుకొని నన్ను నేను అంగడి సరుకు చేసుకోవాల్సిందే
అతడిప్పుడు మాయల ఫకీరు
మాటల వలతో మూట గట్టుకునే పిట్టల దొర...
నేనిప్పుడు
నాకు నేనే సర్ది చెప్పుకోవాలి
గద్ద వేటకొచ్చింది
కోడి పిల్లలా తలదాచుకోకుండా
తల్లి కోడినై ఎగిరి తన్నేలా
నన్ను నేను తయారు చేసుకోవాలి
లేదంటే
అతడు తాగే బ్రాందీలోకి
నన్ను కూడా నంజుకొని తింటాడు
అతడిప్పుడు నాయకుడి పేరు తగిలించుకున్న నటుడు
నటన నైపుణ్యంతో
ఇయ్యని అప్పుకు మిత్తి వసూలు చేసే గూండా...
నేనిప్పుడు
చెర్నకోల పేనడం నేర్చుకోవాలి
సక్కగా గడెం పోని ఎద్దుని ఉరికిచ్చి కొట్టినట్లు
నమ్మిచ్చి ముంచుతున్న
నాయకుడి ఈపు మీద
ఒక్కసారి ఇదిలించాలె
లేదంటే
నన్ను రాజుని చేస్తానని మాటిచ్చి
బానిసను చేస్తున్నడు
నేను నాగలి వడితే
భూతల్లే కొంగుపరిసి స్వాగతిస్తది
అస్సొంటిది
తూర్పు వడితే కొట్టుకపోయే
తాలు గింజస్సొంటి నాయకుడెంత?