Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి ఎప్పుడు పుట్టిందో అప్పుడే పుట్టాను నేను
రేయనక పగలనక, ఎండనక వాననక, చలిని సైతం లెక్కచేయకుండా వ్యవసాయం చేయడమే తెలిసిన రైతును నేను
పొద్దున్నే ఇంత ముద్ద నోట్లో వేసుకొని తుండుగుడ్డ భుజాన వేసుకుని కుటుంబంతో సహా అహర్నిశలు శ్రమించి మట్టి ని మాణిక్యంగా మార్చే రైతును నేను.
లాభనష్టాల తో గాని రాజకీయాలతో గాని ఎటువంటి సంబంధం లేకుండా నాలుగు గింజలు పండించి ఎదుటి వారి ఆకలి తీర్చే రైతును నేను.
వరుణుడు కరుణించక గింజలు మొలకెత్తక పోయినా, ఎదిగిన పైరు ఎండిపోయినా లేక ప్రకృతి ప్రకోపించి అతివృష్టి తో పంటను నాశనం చేసినా, బాధను దిగమింగుకుని నా ప్రాప్తం ఇంతే అనుకునే రైతును నేను.
నకిలీ విత్తనాలతో మొదటికే మోసం వచ్చినా, ఎరువులు పురుగు మందులు సకాలంలో ప్రభుత్వం అందించక పోయినా ఎవరిని నిందించని రైతును నేను.
ఆరుగాలం శ్రమించి పండించిన
పంటకు గిట్టుబాటు ధర రాక పోయినా వచ్చే ఏడు చూసుకోవచ్చు లే అనుకుంటూ మళ్లీ వ్యవసాయాన్ని కొనసాగించే రైతు నేను.
రైతే రాజు అంటూ నన్ను కీర్తించిన నోటితోనే క్రొత్త వ్యవసాయచట్టాలతో
నన్ను కట్టుబానిసలా మార్చాలని చూస్తుంటే ఊరుకొనే రైతును మాత్రం కాను నేను.
వ్యవసాయాన్ని కార్పరేటుకు కట్టబెడుతూ భరతావనిని ఆకలావనిగా మార్చాలని చూస్తున్న పాలకుల మెడలు వంచే యోధుణ్ని నేను.
- కె.నిర్మలకుమారి
ఖమ్మం
9652395184