Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవ్వా!!..
ఈ చెత్తకుండి కాడ
ఏం చేస్తున్నావు??
చెత్తనంతా తోడేస్తున్నావ్!!...
ఏమైనా..పోగొట్టుకున్నావా!!??
పట్టిపట్టి చూస్తున్నావ్!!??..
విలువైన వస్తువేదో
దొరుకుతున్నట్లుగా వెతుకుతున్నావు..
ఆశతో అల్లాడుతున్నావు...
గుండెలకు హత్తుకుంటున్నావు...
చెత్తకుండితోనే
మీ బతుకు ముడిపడివుంది..
ఆ చెత్తను తోడితేనే
మీ కడుపులు నిండేది!!
పిడికెడు మెతుకులకొరకు
ప్రతి చెత్తకుండీని తోడాల్సిందే!..
తినదగ్గదేదో వెతుక్కోవాల్సిందే!!..
రోజంతా వీధులన్నీ తిరిగితిరిగి
అలసిపోయి నిద్రపట్టని రాత్రులుఎన్నో!
మీ మనసులకు ఈచెత్తకుండీలే
నిత్యం అన్నం పెట్టే దేవుళ్ళు!!...
మనుషుల్లో లేని ప్రేమను వాళ్లు
విసిరేసిన చెత్తలోనే చూసుకుంటారు..
అప్పుడప్పుడు పసికందుల్నీ
చూడటం మీకు వింతేమీ కాదు..
ప్రతినిత్యం మీ బ్రతుకులకిదే కర్తవ్యం..
మీ చూపులు బహుదూరం..
మీ ఆశలు..ఊహలు అనంతం
నిప్పుకణికల్లో నిజాన్ని
వెతకడమే మీ ధర్మం!!..
మనుషుల్లో పేద..గొప్ప
మధ్యతరగతి వారంటూ
ఎన్ని భేదాలున్నా...
వీళ్ళందరూ వేసే చెత్త అంతా
ఈ కుండీలోనే కలుస్తూ కులాలు..మతాలకు అతీతంగా ఏకత్వభావనను ప్రోది చేస్తోంది..
ఈ చెత్తకుండీనే..
ఈ చెత్తకుండి..
మీ నిరుపేదలకు హుండీ!..
బస్ స్టాప్ ఆశ్రయాలుగా...
వీధి జీవితాలుగా సాగే
ఎందరెందరో అనాథలను
ఆదుకునే బ్రతుకు జట్కాబండి..!!
పిడికెడు మెతుకులకు నోచుకొని
అభాగ్యులెందరెందరో!!...
వ్యక్తిత్వం చంపుకొని...
అస్తిత్వం వదులుకొని...
బతుకుమీద ఆశ చావక...
అందరి నిర్లక్ష్యానికి గురవుతూ...
నలిగిపోయి విసిగిపోయిన
ప్రతి ప్రాణికీ ఓ అమృతకలశమే
ఈ "చెత్తకుండి"!!...
చెత్తకుండి సాక్షిగా...
దశాబ్దాల స్వాతంత్ర్యమా!!...
ఈ యాచన బ్రతుకులు
ఎన్నాళ్ళు.. ఇంకెన్నేళ్ళూ..?? ఆలోచించండి!!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801