Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల నగారా మోగింది
ప్రచార సందడి చెలరేగింది
రాజకీయం నిద్దుర వీడింది
నేత గణం ఒళ్ళు విరిచింది
ఇంకేం…!
ఎత్తుల కత్తులు మొలుస్తాయి
జిత్తుల పొత్తులు పొడుస్తాయి
బూటక వాగ్దానాలు కురుస్తాయి
సమ్మోహన పథకాలు నర్తిస్తాయి
ప్రచారార్భాటాలు హోరెత్తుతాయి
మద్యం నదులు ఉప్పొంగుతాయి
కరెన్సీ కట్టలు రెపరెపలాడతాయి
విందు వినోదాలు ఊపందుతాయి
కుల సూత్రాలు కదం తొక్కుతాయి
వర్గ సమీకరణలు కవాతు చేస్తాయి
ఓటు బ్యాంకు లెక్కలు తూగుతాయి
ఎన్నికల సమరాంగణంలో ….
స్వార్థ రాజకీయ ఘనానికి
మురికి వాడలు పరిమళ పూదోటలు
పూరి గుడిసెలు "పూజ" మందిరాలు
సామాన్యుడు ఇల "దైవం" చందమే
అందుకే పగటి వేషం కట్టి
రంకు "కీర్తనలు" వల్లిస్తాయి
కుటిల "ప్రదక్షిణలు" చేస్తాయి
కొం(దొం)గ "జపం" ఆచరిస్తాయి
అవసర మొక్కులు మొక్కుతాయి
ఓ "ఓటు" కిరీటదారుడా…!
నమ్మి అధికార పీఠం కట్టబెడితివా ?
కట్టు "బానిసత్వం" నెత్తికెత్తుకున్నట్లే
స్వీయ మరణ శాసనం లిఖించుకున్నట్లే
అందుకే …
ఆ మాయల మరాఠీ ఉచ్చుల చిక్కక
నీ ఓటు అస్త్రం గురుతెరిగి సందించు
(జి.హెచ్. ఎం.సి ఎన్నికల నేపథ్యంలో ఓటరుకో.మాట)
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828