Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉడుత ఆలోచిస్తూ చెట్టుక్రిందున్న ఆ మొక్క చుట్టూ నవగ్రహాలు చుట్టుతున్నట్లు చుట్టసాగింది . ఉడుతకు మతిమరుపు ఎక్కువ, రాత్రి కురిసిన వర్షం వల్ల నెలంతా చదునుగా తేమగా వుంది .కొన్నిక్షణాల తరువాత ఒక నిర్ణయానికి వచ్చింది .మొక్క ప్రక్కనే కాళ్లతో గుంత చెయ్యడం ప్రారంభిస్తుంటే చెట్టుపైనున్నచిట్టిచిలుక "ఉడుత మిత్రమా ... ఏం చేస్తున్నావు " అని అడిగింది
''చిలుక మిత్రమా, రెండురోజులక్రితం జామపండు తినగా మిగిలిన పండు ఇక్కడే ఎక్కడో గుంత తవ్వి దాచాను. నా మతిమరుపు వల్ల ఎక్కడా అని గుర్తుకు రావడంలేదు. ఇక్కడినుండి అక్కడక్కడా గుంత తవ్వి చూస్తాను. అదృష్టం ఉంటే దొరుకుతుంది.''
''రెండురోజుల క్రితం నేను ఇక్కడే చెట్టుకింద ఆడుకొంటూ ఉన్నాను,నీవు ఇక్కడకు రానేలేదు .నీవు వేరే చెట్టు దగ్గర ఎక్కడైనా దాచి ఉంటావు'' అంటూ చిట్టిచిలుక అపద్దం చెప్పింది.
''ఈ చెట్టు కింద అనుకొన్నాను. సరేలే ఎక్కడైనా ఆహారం దొరికితే తింటాను " అంటూ వెళ్తున్న ఉడుత వైపు చూస్తూ ''ఉడత మిత్రమా నా దగ్గర జామపండు ముక్కలున్నాయి నిన్న మా అమ్మ తీసుకొనివచ్చింది'' అంటూ చెట్టుకొమ్మలో దాచిన జామపండు ముక్కలను తెచ్చి ఉడుతకిచ్చింది. ఉడుత ఆ పండు ముక్కలను తిని వెళ్ళిపోయింది.
''నన్ను క్షమించు ఉడుతా, మా అమ్మ అపద్దం చెప్పకూడదని చెప్పింది. ఇంతవరకు అపద్దం చెప్పలేదు. ఆ రోజు నేను ఈ చెట్టు కింద ఆడుకోనేలేదు .మొదటిసారి అపద్దం చెప్పవలసిన వచ్చింది'' బాధగా మనసులో అనుకొంది చిట్టిచిలుక.
ఆ సాయంత్రం తల్లి రాగానే చిట్టిచిలుక జరిగినదంతా చెప్పింది.
'' నీకోసం తెచ్చిన జామపండు ఇచ్చి మంచిపని చేసావు . నేను అపద్దం చెప్పకూడదని చెప్పానుగా ఎందుకు చెప్పావు. అక్కడ గుంత తవ్వితే ఆ మొక్క చచ్చిపోతుందని చెప్పావా అది చెట్టుకాదుగా... మానవత్వం లేని మనుషులే చెట్లు నరుకుతున్న ఈ కాలంలో .నీవేమో చెట్టును కాపాడుతున్నట్టుగా ఆ చిన్న మొక్క కోసం అపద్దం చెప్పావు.'' చిరుకోపంతో అంది తల్లి
'' ఉడుతకు నిజంగా ఎక్కడ దాచిందో తెలీదు ఈ చెట్టు కింద దాచిన సంగంతి మాత్రం గుర్తుండట ''
''ఒకవేళ అది నిజమై వుండవచ్చు నీవెందుకు అపద్దం చెప్పావు''
''తడితోనున్న నేలను తవ్వితే తప్పకుండా ఆ మొక్క కింద పడి చనిపోతుంది ఇదే ఉడుత రెండురోజుల తరువాత అక్కడ గుంత తవ్వినా నేను పట్టించుకొనేదాన్ని కాదు. ''
''నిన్ను అర్థం చేసుకోలేక పోతున్నాను… ఎందుకలా'' ఆశ్చర్యంగా అడిగింది తల్లి.
''అప్పుడప్పుడు ఒకరింటి పెరటివైపు వెళ్ళితే నన్ను చూడగానే దయతో గింజలుపెడుతుందని చెప్పానుగా .... ఉదయం ఆదేవతే ఇక్కడకు వచ్చింది'' చిట్టిచిలుక అంది
''ఏంచేసింది''
''ఆ మొక్క వైపు చూస్తూ 'రెండు రోజుల తరువాత బతుకమ్మ పండుగకు ఈ మొక్క లోని బంతి పూలను కోసుకెళ్లి బతుకమ్మను అలంకరించాలి. అంతవరకు ఈ బంతి పూల మొక్క క్షేమంగా ఉండాలి' అనడం నేను విన్నాను'' అంది
రెండు రోజుల తరువాత బతుకమ్మ పైన అలకరించివున్న ఆబంతిపూలు ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న ఆ చిట్టిచిలుకను చూసి చిరునవ్వుతో ఆశీర్వదించింది.
- ఓట్ర ప్రకాష్ రావు
తిరుత్తణి, 9787446026