Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సి.శేఖర్(సియస్సార్),
పాలమూరు, 9010480557.
ఏ జాతైనా ఏ తెగైనా
ఏ దేశమైనా ఏ మనిషైనా
ఒకరి కబంధ హస్తాలలో
చిక్కుకుని
బానిసలా బతకాలనుకోదు
తిన్నదేదైనా
కడుపునింపుకుని
కంటినిండా నిద్రిస్తే
స్వేచ్ఛగా హాయిగా
మనదైన రాజ్యంలో
జీవనగమనం సాగాలి
వర్ణాలతో మనిషిని బానిసలా చేసే
శ్వేతవర్ణ రాబందులు
దోచుకునే నెపంతో
దాడిచేసే దొంగలు
వర్ణవివక్షతను
నీ మొక్కవోని ధైర్యంతో
తిరుగుబాటుతో తరిమావు
ఎన్నోసార్లు నిన్ననగదొక్కాలని చూసినా
నల్లసూర్యుడివై
తెల్లోడిగుండెల్ని అదిరిపడేలాచేసావ్
నిన్ను బందించిన
కారాగారం
ప్రపంచమే నీవైపొచ్చేలా
నీవంటే తెలిసేలా
నిన్ను నీవే తెలుసుకునేలా
విప్లవంకాదని
అహింస అస్త్రాన్ని ధరింపజేసింది
నీ సహనమే
తెల్లసింహం తలదించుకునేలా
స్వాతంత్య్రం చేతుల్లో పెట్టి
తోకముడుచుకునెళ్ళిపోయింది
జగతంతా నిన్నభినందించిన వారే
సత్కారహారాలెన్నో నిన్నెతుక్కుంటూ చేరాయ్
భారతావని భారతరత్ననిచ్చి
విశ్వశాంతికి నీ కృషికి
నోబెల్ శాంతి బహుమానం
నీకు సొంతమైంది
గాంధీ శాంతి బహుమానంతో
ఆఫ్రికా గాంధివైనావు
మండేలా నీ జాతిగుండేల్లో
ఆరిపోని స్వేచ్ఛ కాంక్షను
మండించి
జాతిరత్నమై నిలిచావు
ధృవతారగా వెలిగావు