Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఒక న్యాయవాది, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, బుద్ధిష్ట్. అంటరానితనంపై ఎలుగెత్తిన ఉద్యమకారుడు. భారతదేశపు తొలి న్యాయ మంత్రి. అన్నింటినీ మించి రాజ్యాంగ నిర్మాత. ఇంకా చెప్పాలంటే ప్రతి దళితుని పుస్తకంలో ఆయన అక్షరం, ప్రతి వెనుకబడిన వర్గంలో ఆయన వెలుగు ప్రతి పేదవాడి అభివృద్ధిపథంలో ఆయన అడుగు. అసమానతల సంకెళ్లు తెంచిన చైతన్యoలో ఆయన స్ఫూర్తి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్య స్మరణీయ దీప్తి. భారతీయ స్వేచ్ఛ జీవన విధానం పై చెరగని సంతకం. కులానికో, వర్గానికో, సిద్ధాంతానికో పరిమితం కానీ సమానత్వపు శక్తే "భారతరత్న" డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారత రత్న 1891 ఏప్రిల్, 14న కొంకణ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలోని అంబవాడ గ్రామంలో రాంజీ మాలోజీ, సుకుమార్ భీమాభాయి దంపతులకు భారతమాత ముద్దుబిడ్డగా జన్మించారు. ఆయన చిన్నప్పుడు కుల సాంప్రదాయ పట్టింపులు ఎక్కువగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
1900 సంవత్సరంలో సతారా లోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ చదువులో చురుగ్గా ఉంటూ చదువుపై ఎంతో శ్రద్ధ భక్తులు చూపేవారు. ఆయన 5వ తరగతిలో ఉండగానే తండ్రి చేస్తున్న ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది ఉద్యోగం కోసం తండ్రి, చదువు కోసం కొడుకు ఊరు మారాల్సి వచ్చింది. 1907లో అంబేద్కర్ మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఆయన చదువుకుంటున్న సమయంలోనే 14 సంవత్సరాల వయస్సులో రమాబాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత హెలిస్టర్ కళాశాలలో చేరి అత్యధిక మార్కులతో పాసయ్యారు. ఆయనకు సంస్కృతం చదవాలనే కోరిక బలంగా ఉండేది. ఆచారాలు కట్టుబాట్ల వల్ల ఆయన కోరిక తీరలేదు. ఆయనకు ఇష్టం లేకపోయినా పర్షియన్ భాష చదివారు. పట్టభద్రులైన వెంటనే ఆయనకి బరోడా సంస్థానంలో ఉద్యోగం వచ్చింది. కానీ పై చదువులు చదవాలన్న కోరికతో ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరిక చెప్పాడు. విదేశాల్లో చదువులు పూర్తి చేసి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో పదేళ్లు ఆయన దగ్గర పనిచేసే షరతు పెట్టి ఆర్థిక సహాయం చేసి విదేశాలకి పంపారు బరోడా సంస్థానాధిపతులు.
కొలంబియా విశ్వ విద్యాలయంలో చేరి ఎమ్. ఎ. డిగ్రీ, ఆ వెంటనే పీహెచ్. డి. విజయవంతంగా పూర్తిచేశారు. అప్పటి సిద్ధాంతాల వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా" అనే పేరుతో ప్రచురించారు అంబేద్కర్ చదువుకునే టైంలో ఒక ఉపాధ్యాయుడు అంబేద్కర్ పరిస్థితిని గమనించి అంబేద్కర్కి చాలాసార్లు సహాయం చేశారు. తన అసలు పేరు 'భీంరావ్ రాంజీ అంబా వళేకర్' ఉపాధ్యాయుని పై కృతజ్ఞతతో తన పేరు లోని చివరి వాక్యం మార్చేసి 'భీంరావ్ రాంజీ అంబేద్కర్' గా మార్చుకున్నారు. గురువు గారికి కృతజ్ఞతలు చూపుతున్న అబ్బాయే పెద్దవాడై రాజ్యాంగాన్ని రాశాడు. దళిత జాతి వైతాళికుడుగా పేరు పొందారు. విదేశం నుండి వచ్చిన తర్వాత అంబేద్కరుకు మహారాజావారి మిలటరీ కార్యదర్శి పదవి ఇచ్చారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహారాజ్ అస్పృశ్యతా నివారణ కోసం చాలా ప్రయత్న చేశారు.
మహారాజ్ సహకారంతో బి.ఆర్.అంబేద్కర్ "ముఖం నాయక్" అనే పక్ష పత్రికకు సంపాదకత్వం వహించారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్ ల నుండి కొన్ని వేల మంది జనం వచ్చారు. 'మహత్' చెరువులోని నీళ్ళు త్రాగడానికి అంటరానివారికి అప్పట్లో నిషేధం వుండేది. అంబేద్కర్ నాయకత్వంలో ఆ చెరువు నీళ్ళు త్రాగారు వేలమంది. ఆ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ "బహిష్కృత భారతి" అనే పత్రికను ప్రారంభించారు. 1932లో రెండవ రౌండ్ టేబుల్ సన్నాహాల్లో సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లారు. 1932లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ సభ్యులకు కమ్యూనల్ అవార్డును ప్రకటించిoది. దాని ప్రకారం అస్పృశ్యు లకు ప్రత్యేక స్థానాలు లభించాయి. గాంధీజీతో కలిసి అస్పృశ్యత నివారణకి పోరాటం సాగించారు. వెలివాడల బతుకుల్లో చైతన్యం నింపారు. దళితుల సమస్యల పరిష్కారానికి చదువు ఒక్కటే మార్గమని తలిచాడు. అందుకే తన వర్గంలోని ప్రజలకు చైతన్యo కలిగిoచాడు. అందుకే ప్రజల్లో వెలుగురేఖ అయ్యాడు అంబేద్కర్.
ఆయన రాజకీయ ప్రస్థానం అనంతం,, అమోఘం. అంతకు మించి ఆయన రాజ్యాంగ రచన బహుజనులకు ఒక గొప్ప బహుమానం. అంతకుమించి గొప్పగా దేశానికి దశ, దిశా నిర్దేశం చేసింది. ప్రతిక్షణం దేశం కోసం పోరాటం సాగిస్తూ తన జీవితాన్ని అంకితం చేశారు. స్వతంత్ర్య భారతావనికి తొలి న్యాయ శాఖ మంత్రి. అంతే కాదు ఇండిపెండెంట్ ఇండియాకు రాజ్యాంగ రచన బాధ్యతలను కూడా ఆనాటి తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు అప్పగించి ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసింది. రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ ను అధ్యక్షునిగా నియమించారు. అదే ఆయన జీవితంలో మహోజ్వల మలుపు. చరిత్రలో ఓ శాశ్వతమైన స్థానాన్ని కల్పించిన మహత్తరమైన ప్రస్థానం. బడుగు వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు వెలుగుని పంచిన గొప్ప సందర్భం. అనేక రాజ్యాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి పటిష్టమైన రాజ్యాంగాన్ని దేశానికి కానుకగా ఇచ్చారు. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కు చట్టాలు చేశారు. అస్పృశ్యతను ఒక శిక్షార్హమైన నేరంగా చేస్తూ ఒక చట్టాన్ని కూడా తెచ్చారు. అందరి జీవితాల్లో వెలుగు రేఖల్ని మహోన్నత వ్యక్తి.
అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త. పారిశ్రామికీకరణ, వ్యవసాయ అభివృద్ధి దేశానికి ఉతమి స్థాయని బలంగా నమ్మారు. అందుకే వ్యవసాయంలో అత్యధిక పెట్టు బడులు పెట్టాలని సూచించారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అనేక రచనలు కూడా చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మరోవైపు అంటరానితనం పై పోరాటం చేస్తూనే ఎన్నో పుస్తకాలు రాశారు. ఇలా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించారు. అధ్యయనం, సంఘటితo, పోరాటం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరికి తారకమంత్రంగా పనిచేస్తుంది. పాలకవర్గాలకు మార్గదర్శకంగా ఉంది. బడుగు, బలహీన వర్గాలకు మార్గం చూపింది. ఇలా జీవితం మొత్తం దేశం కోసం, వెలివాడల బతుకుల్లో వెలుగు కోసం కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు చిరస్మరణీయుడుగా. నేడు భిన్న వర్గాలు విద్య, ఉద్యోగ రాజకీయ అభివృద్ధిలో అడుగులు వేస్తున్నారoటే అది అంబేద్కర్ దార్శనికతే. ప్రసిద్ధ రచయిత 'వేవర్లి నికోలస్' డాక్టర్ అంబేద్కర్ భారతదేశంలోని ఆరుగురు మేధావుల్లో ఒకరు అని ప్రశంసించారు. ఇలా మహా మేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగడించిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న భువి నుండి దివికేగారు.
పింగళి. భాగ్యలక్ష్మి, గుంటూరు.
ఫోన్ నెంబర్.9704725609