Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహర్ కులంలో వెలసిన వేగుచుక్క...
గంజాయి వనంలో మొలచిన తులసిమొక్క...
దళితుల పాలిటిదైవం...
దారిచూపే దీపం...
అణగారిన పేదప్రజల ఆశాకిరణం...
అమరజీవి అంబేద్కర్ ! దండాలయ్య మీకు దండాలు!!
మీకు జన్మనిచ్చిన "ఆ అమ్మకు" కోటిదండాలు !
వీధి బడికి వెళ్తుంటే మిము వింతగా చూస్తుంటే
విదేశాలకేగి ఉన్నత విద్యనార్జించి
బుక్కులెన్నో పఠించి హక్కులన్నీ గ్రహించి
గాఢనిద్రలో ఉన్న గబ్బిలాలకు "జ్ఞానబోధ" చేసిన
బావిలోని కప్పలకు "బ్రతుకుదారి" చూపిన
కావు కావుమని అరిచే కాకులకు "కోకిలరాగాలు" నేర్పిన
పూరిగుడిసెలో పుట్టిన బహుజనులను "పులులుగా" మార్చిన
అమరజీవి అంబేద్కర్ !దండాలయ్య మీకు దండాలు!!
మీ "ఆదర్శ భావాలకు" వేయి దండాలు !
అణగారినవర్గాల అభ్యున్నతికి
జీవితాన్ని అంకితం చేసి
ఊరూరా తిరిగి ఉద్యమాలు రేపి
ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రూతలూగించి
మనిషి మనిషి మధ్య మంటలు రేపే
మనుశాస్త్రాన్ని మట్టుపెట్టి అడుగునున్న
బడుగువర్గాల అభివృద్ధికి గొడుగు బట్టి
పిచ్చి మతాచార్యులు నెత్తిన పిడుగులా పడి
అస్పృశ్యతను అంటరానితనాన్ని
నిరసించిన నిప్పులు కురిపించిన
అమరజీవి అంబేద్కర్ ! దండాలయ్యా మీకు దండాలు !!
మీ "కండబలానికి గుండెబలానికి" కోటి దండాలు !
కరెంట్ షాక్ కన్నా కాలకూటవిషం కన్నా
అతిభయంకరమైన అంటరానితనానికి
ఆహుతైపోకుండా అగ్రవర్ణాల వారి అడుగులకు మడుగులొత్తే బానిస బ్రతుక్కి బలైపోకుండా
రాజ్యాంగ రక్షణలెన్నో కల్పించి
కులంపేర ఈ సంఘం కుళ్ళు పోకముందే
కులమనే విశ్వవృక్షాన్ని కూకటివేళ్లతో సహా
పెకలించి వేయాలని ప్రబోధించిన...
సాంఘిక దురాచారాలను "సమాధి" చేసిన...
సమసమాజానికి "పునాది" వేసిన...
అమరజీవి అంబేద్కర్ !దండాలయ్యా మీకు దండాలు!!
మీ "సాంఘిక సంస్కరణలకు" శతకోటి దండాలు !
ఓ మహాత్మా !
మీరే మాకు దైవం !
నీ మాటే మాకు వేదం !
మీ బాటే మాకు శరణం !
నీ స్మరణే ఓ ప్రేరణ !
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం !
మీ ఆశయాలకు మా జీవితాలను అంకితం చేస్తాం!!
ఓ అమరజీవి అంబేద్కర్ మీకిదే మా అక్షరనీరాజనం!!!
పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్. - 9110784502