Authorization
Wed April 02, 2025 01:09:24 pm
మా నాన్న ఓ మాట అంటుండేవాడు!!...
అన్నం తినేటప్పుడు...
ఒక మెతుకు కూడా
నేలమీద పడకుండా
తినాలని!!...
ఒకవేళ మెతుకులు
కింద పడితే...
భూదేవి శాపం
పెడుతుందని!!...
మెతుకుకు...నేలకు
ఉన్నది మాతృబంధమని!!
ఎందరో కష్టానికి
ఓర్చి..శ్రమించి
చేయి చేయి కలిపి....
ఓర్పు,నేర్పు రంగరించి..
గుండెలు ఒక్కటై...
మనసు పెట్టి...
రక్తాన్ని చెమటగా చిందిస్తేనే...
నేలతల్లి శరీరం
పుండయి పండై...
పంటగా చేతికొస్తేనే..
మనకు మెతుకు..బతుకు!!...
అప్పుడప్పుడు
పురుగు రూపేణ కాయల్ని తొలిచేస్తుంది!!..
కోతకొచ్చిన పైరును
కూటికి అందకుండా చేస్తుంది!!...
నేలను దున్ని..విత్తకపోతే
ఏ పంటా పండదు!!..
మనిషి కండబలం
నేల గుండెబలం లేకుంటే
పంటదిగుబడి అసలేరాదు!!...
కర్షకుడనే
ఓ అద్భుత కళాకారుడి
కలల రాబడిది!!...
అన్నార్తుల ఆకలి తీర్చే అమృతబాండమది !!...
నేలతల్లి ఆకుపచ్చని చీరలో తొణకిసలాడే సౌందర్యమది!!..
ప్రకృతితో నిత్యం యుద్ధంచేసి
పొందిన విజయదరహాసగీతమది!!...
రైతుకళ్ళలో వెలిగే పచ్చని కాంతిది!!..
తుఫానులు..వరదలు
ముంచెత్తినా!!..
దళారులు నిలువునా
మోసంచేసినా!!...
ప్రభుత్వాలు దగాచేసినా!!...
దౌర్జన్యాలు చేసినా!!... అప్పులుపాలైనా!!...
ఆఖరికి ప్రాణాలుపోయినా!!.. వెన్నుచూపకుండా...
కర్షకుడు పండిస్తేనే...
మన కడుపుల్ని నింపే ఫలసాయమది!!...
అలా లోకానికి..
నిత్యం అన్నంపెట్టే
కర్షకుడిదెప్పుడూ
చితికిన బతుకే!!...
తనకు తినడానికి
తిండి లేకున్నా...
తన కన్నీటి కష్టార్జితమే...
సమస్తమానవాళికీ తనందించే
జీవిత సర్వస్వమదే!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801