Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిని నమ్ముకుని
మట్టిలో పుట్టి, మట్టి సారంతో
పంటలు పండించి
అందరి ఆకలిని తీర్చే అన్నదాతలు నేడు తమ నేలతల్లిని వదిలి
తమ ఉనికి కోసం, న్యాయం కోరి
రాజధాని రహదారులను
చీమల దండులా ఆక్రమించారు
ఆరుగాలం శ్రమించి చెమట చుక్కలతో
నేల గర్భాన్ని తడిపి నాటిన గింజలన్నీ
మొలకలై పంటగా మారి
రైతన్న పాదాలను ముద్దాడితే
కడుపుకింత ముద్ద
బ్రతుకుకో భరోసా దొరుకతుందని
భ్రమించిన అమాయక ఆశాజీవికి
మార్కెట్ మాయాబజార్ లో
దళారుల సిండికేట్ స్వార్థానికి
గిట్టుబాటు మాట దేవుడెరుగు పెట్టుబడే చేతికి రాక చతికిలపడి
అప్పులకు జడిసి, నిస్ఫ్రుహలో
ఏ ఆసరా కానరాక
చీడపురుగులను హతం చేసేందుకు
దాచిన మిగిలిన మందు తాగి
తల్లి మట్టి ఒడిలోనే కలిసి పోయే
దౌర్భాగ్య దుస్థితిలో ఉంది రైతురాజ్యం
మెతుకులను పండించే మార్మిక కళ
అన్నదాతలకు మాత్రమే తెలిసిన
సహజ వారసత్వ విద్య
కోటీశ్వరుడి కోట్ల నోట్ల కట్టలు
మతం, కులం, ప్రాంత విద్వేషాలను
రగిల్చి ఓట్లను దండుకునే
రాజకీయ రాబందులకు
చేతకాని, అంతుచిక్కని
అద్భుత జీవకళ వ్యవసాయం
శ్రమించడం, పండించటం, పంచటం,
జనాల ఆకలిని తీర్చటం తప్ప
ఏ స్వార్థం, ఏ మోసం
ఏ రాజకీయం తెలియక
తన బ్రతుకేదో చచ్చి నిలుపుకుంటూ
దేశానికి ‘కనిపించని వెన్నెముక‘ ఉనికిని
కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అందించే
కొత్త కుట్ర చట్టాలకు నిరసనగా
ఎగసిన మౌన ఉప్పెనలై
పాలకుల దిమ్మ తిరిగేలా
ఢిల్లీ కోటను ముట్టడించిన
రుద్ర కృషీవలుల ఘర్జనలకు జతగా
అందరం ఒక్కటై గొంతు కలపాలి
మానవతతో రైతులను రక్షించుకోవాలి
( దేశరాజధానిలో జరుగుతున్న రైతన్నల ప్రభంజనానికి మద్దతుగా )
- డా. కె. దివాకరా చారి; 9391018972