Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డా.ఓర్సు రాయలింగు
9849446027.
తెలంగాణ సాహిత్య చరిత్రలో ఉద్యమాలదొక ప్రత్యేక గుమ్మం. కానీ ఖమ్మం వీరులకు కాణాచి. స్వాతంత్ర ఫలానికి పూర్వం,ఆ తరువాత మారుతున్న రాజకీయ,సామాజిక పోరాటాలను సాహిత్యం పుటల్లో పరిచయం చేసిన ఎందరో మహానుభావులున్నారు.మరిముఖ్యంగా గేయరూప కవిత్వంలోనూ,వచన కవిత్వం,కథ,నవల,నాటకం మొదలైన ప్రక్రియలలో ఇతోధికంగా సాహిత్యం పురుడుపోసుకుంది.అందులో రావెళ్ల వెంకటరామారావుది విశిష్టమైన స్థానం.ఆయనగారి మాటల్లోనే 'ఆనాటి ఖమ్మం ప్రాంతీయ యువకవుల్లో శ్రీయుతులు దాశరథి, హీరాలాల్ మోరియా, రామకవి, రంగారావు ముఖ్యులు. వారు వైప్లవ్య వాహినీ పథాకచ్చాయల్లో నిలిచికృధానల పూరిత దళం సారించి, స్వేచ్చాగీతాలు గానం చేశారు. తెలుగు జాతి నాడుల్లో పేర్కొన్న పెనుమైకం వదిలించి చైతన్యపూరితమైన నవ జాగృత శంఖారావాన్ని పూరించారు. వాశీగీతి ప్రభంజనం మాలాంటి బాలబృందం వెన్నుతట్టి మేల్కొల్పి ఉత్సహేద్వేగాలందించాయి. అమృత స్వోతస్వినులై పదుపు కట్టించి పరుగులెత్తించాయి' అని రాసుకున్నారాయాన. రావెళ్ల వెంకటరామారావు గారు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో విస్తృతంగా గాంధీ పోరాట అడుగుజాడల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఖమ్మం ప్రాంతంలోని గోకినేపల్లిలో 1931లో జన్మించారు. 'ఆయన జీవితమే అభ్యుదయ కావ్యమని' పురిపండ అప్పలస్వామి విశ్లేషణ చేశారు. సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి పల్లె వాతావరణంతో మమేకమైనారు. పదిహేనేళ్ల వయసులో ఒకవైపు తెలంగాణలో పెచ్చుమీరుతున్న నిజాం నిరంకుశ పరిపాలనను అంతమొందించుటకు ఎదురునిలబడ్డారు. రావెళ్ల వెంకటరామారావు ఒకేసారి రెండు స్వాతంత్ర్య ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి. నిజాం రాకాసి మూకలు నిర్బంధిస్తే వారి కంట్లో కారంపొడి చల్లిన సాహస వీరుడు. 1948లో జైలు గోడల మధ్య నలిగిపోయారు. ముంబాయి, వరంగల్ జిల్లా సరిహద్దు జైలులో నాలుగు సంవత్సరాలు ఖైదీగా ఉన్నారు. 1952లో కోర్టు తీర్పు మూలంగా జైలు నుంచి విముక్తి పొందారు. ఖైదీగా జీవితాన్ని కొనసాగిస్తూనే కవిత్వం రాశారు. తెలంగాణ కవులది రాజ్యాధికార స్వరం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కాంక్షీంచే స్వభావం. ప్రాచీన కవులైన బమ్మెర పోతన, పాల్కురికి సోమన్నలు వారసత్వం బాటలు, భాష, ఛందస్సు, భావం, యసలు అన్నీంటిలో విప్లవ సారమే కావాలి. మార్పురావాల్సిందేనని రావెళ్ల తపన. అదేపనిలో నిత్యం జీవించారు. ప్రజల కోసం అవసరమైతే తన ప్రాణాలను పణంగా రక్తాన్ని ధారబోసే కలం యోధుడు. మన అస్తిత్వం ప్రమాదంలో పడినప్పుడు, ప్రతికూలతల మీద తిరుగుబాటు చెలరేగడం అనివార్యమవుతుంది. తమని చిన్నచూపు చూసేవారికి ఘాటైన సమాధానం చెప్పడం ఆయా సమూహాలకు ముడిసరుకుగా మారుతుంది. అదేవిధంగా వెనక్కి తిరిగి గతాన్ని నెమరువేసుకోవడం, ఆ గతవైభవ స్మరణ ద్వారా నూతనోత్తేజం పులముకొని ఆత్మగౌరవంతో బతకడం తెలంగాణ ప్రజల జీవన విధానంలో కనిపిస్తుంది. వలసొత్తర చైతన్యాన్ని కొలవడానికి ప్రత్యేక తెలంగాణ పోరాటం ప్రధాన సాధనంగా నిలుస్తుంది.కానీ, ప్రత్యేక రాష్ట్ర కాంక్షాలు ఇంకా ఉద్యమ రూపంగా దాల్చకముందే,తన నేలకున్న ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన రచయిత రావెళ్ల వెంకటరామారావు. 1950లలో హైద్రాబాద్ పట్టణానికి వచ్చి 'తెలంగీ','బేడంగీ' అని అవమాన ఛీత్కారాలు పొంది, గాయపడిన హృదయంతో రాసుకున్న గేయమాలిక 'మాతృగీతిక'. దీని రచన 1954 కాలంలో రచించినది. ఇలా తెలంగాణ అస్తిత్వ స్పృహతో రాసుకున్న ఈ గేయం 'సాయుధ పొరటానంతర చైతన్య గేయాలలో మొదటిదని, తొలి తెలంగాణ అస్తిత్వ గేయమన', ( తెలంగాణ ఉద్యమపాట ప్రాదేశిక విమర్శ అనే గ్రంధం పుట.129:2016 )డా.పసునూరి రవీందర్ తన సిద్ధాంత రచనలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముమ్మాటికీ రావెల గేయం తొలి తెలంగాణ అస్తిత్వ గేయముగానే కన్పిస్తుంది. పోరాట వారసత్వాన్ని అద్భుతంగా ఈ గేయంలో తన బాణీని చూపించారు.
కదనాన శత్రువుల
కుత్తుకుల నవాలీల
నుత్తరించిన బలో
న్మత్తులేలిన భూమి
వీరులకు కాణాచిరా !
తెలంగాణ
ధీరులకు మొగసాలరా!
అబలయని దేశమును
కబలిశీప తలపడిన
పరరాజులకు, స్త్రీల
పటుశౌర్యమును జూపి
రాజ్యతంత్రము నడిపెరా !
తెలంగాణ
రాణి రుద్రమ దేవిరా ! ( రావెల వెంకటరామారావు,మాతృగీతిక)
ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని కవితాత్మకంగా ఆత్మగౌరవంతో సృజించిన ఈ గేయంలో శతాబ్దాల పూర్వ వైభవాన్ని అత్యంత రమణీయంగా వర్ణించాడు. వీరులు పుట్టిన నేలని, శిల్ప సౌశీదర్యంతో విలసిల్లినదని, రాణి రుద్రమదేవి పరాక్రమాన్ని, రాజ్యతంత్రాన్ని నడిపినదని, సాంస్కృతికంగా విలువైన చరిత్ర కలిగినది, సాహిత్యం పరంగా ఎందరో మహా సృజనకారులు జన్మిచారని, గొప్ప గొప్ప కావ్యాలు ఇక్కడ పురుడుపోసుకున్నయని, శిథిల తెలంగాణను, జీవకళ కోల్పోయిన తెలంగాణ వైభవాన్ని, సహజ సంపదలతో ఆనాడు అలరారిందని, తెలంగాణ ఎనలేని ఉద్యానవనాలతో తులతూగిందని రావెళ్ల వెంకటరావుమారావు ఈ గేయంలో కొనియాడారు.
'మతమౌఢ్యమున మాన
వత్వమునె బలిగొన్న
మొగలు షాహి ఫౌజు
ముష్కరా ఘాతాల
శిథిలమై పోయిందిరా !
తెలంగాణ
జీవకళ కోల్పోయేరా !
స్వాతంత్ర్య తొలిసమర
శత్రువులు,వంచకులు
నైజాము పాలకుల
కైజారుపోటులకు
ముక్కలుగ చీలిందిరా !
తెలంగాణ
రక్తమే చిందిందిరా !' ( రావెళ్ల వెంకటరామారావు )
అని మాతృగీతంలో నైజాము మీద వ్యతిరేకత కనిపిస్తుంది. తెలంగాణ పోరాట చరిత్రను అభివర్ణించుకుంటూ వచ్చిన కవిగా, తెలంగాణ సాయుధపోరాటాన్ని కీర్తించకుండా ఎవరు ఉండలేరు. కనుక నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను కవితాత్మకంగా వర్ణించాడు. మత చాంధసత్వం వల్ల మనుషులలో మానవత్వమే లేకుండా ముస్లిం పాలకులలో పరిపాలకులు కొనసాగించారని ఆలపించాడు. ఆవిధంగా ముస్లిం పాలనలోనే తెలంగాణ ప్రాంతం ముక్కలు ముక్కలై పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా గేయమై ప్రవహించడానికి ముఖ్యంగా ముస్లింల చేత అవమానపడి ఉండవచ్చు. హైద్రాబాద్ రాష్ట్రం దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పాటు ముస్లిం నవాబుల పరిపాలనలో ఉంది. 1948 నాటికి ఆ పాలన సమసిపోయినప్పటికి ముస్లిం ఆధిపత్యం కొంతమేరకు ఉండడంవల్లనే తనను అవమానించిన వారికి సమాధానంగా ఈ మాతృగీతం రచించాడని తెలుస్తుంది. రావెళ్ల వెంకటరామారావు గేయాన్ని తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రజాదరణ గావించాడు.
ఇంకా ఈ గేయంలో తెలంగాణ తల్లి విశిష్టతలను, ఛందోబద్ధంగా రచించాడు కవి. ఆత్మాభిమానం ఉనికిలో పడినకొద్ది గతాన్ని స్మరించడం అనివార్యం.తెలంగాణకు గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక చరిత్రను గుర్తుచేసే ప్రయత్నం చేశాడు రచయిత. అప్పటికే సరళమైన తెలుగులో గేయరచన చేయటమనే పద్దతి ప్రచారంలో ఉంది. కాబట్టే రావెళ్ల పండితులను దృష్టిలో పెట్టుకొని గ్రాంధికభాషను వాడుకుని ఈ గేయం రచించడాని తెలుస్తుంది. ఆనాటి ఆంధ్రమహాసభ గ్రామాల్లో భాష పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉంది.తెలుగుభాషను పరిరక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో సాగిన ఈ ప్రచార సభ ప్రభావం రావెళ్లపై ఎక్కువ ఉండి ఉంటుంది.తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో రచన చేసి ఉండవచ్చుననేది నా భావన.తెలంగాణ చరిత్ర పోరాటాల పురిటిగడ్డనేకదా ! ఎన్నోయేండ్లుగా తెలంగాణ ప్రజలు నిత్యం పోరాటాలు చేస్తూ ఉండడంతప్ప ఎన్నడూ మరిసింది లేదు. అలాంటి త్యాగలతో పోరుచరిత్రలను ఈ గేయ రచయిత గుర్తుచేస్తూ రణరంగంలో శత్రువుల తలలను నరికేసిన వీరుల నిలయం తెలంగాణ ఆత్మాభిమానమని చాటి చెప్పాడు. అదేవిధంగా కాకతీయుల పాలనలో తెలంగాణ ప్రాణప్రతిష్ఠ, కీర్తిప్రతిష్టలు దశదిశల చాటిన వీరనారీ రాణి రుద్రమ.అంతటి శౌర్యాన్ని,పరాక్రమాన్ని రచయిత తనదైన శైలితో కొనియాడాడు. స్త్రీ తెగువను, ధీరత్వాన్ని ,రాజ్యపాలన చేసిన రాణి రుద్రమదేవి అని ముక్తకంఠంతో పలికాడు.తెలంగాణ ఎప్పుడు మాతృస్వామ్య చరిత్ర అనడానికి ఈ ఆత్మగౌరవ ప్రకటన చాలా వరకు ఉపయుక్తంగా ఉంది.అందుకే తెలంగాణలో తల్లికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తుంది.
'కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి
బోధిసత్వుని ధర్మబోధనల నేర్పించి
శ్రీగిరిచైత్యమురా తెలంగాణ చైతన్యమును చాటేరా...
శ్రీవైష్ణవుల భక్తిచిందు గీతాలలో
బసవన్న శివతత్వ పారవశ్యములోన
ఉఱుతలూగిందిరా,తెలంగాణ వెల్లువైపొంగిందిరా...'
( రావెళ్ల వెంకటరామారావు )
తెలంగాణ ప్రాంతానికి ఉన్న చరిత్ర మరే ప్రాంతానికి లేదనేది గమనించాలి. ఇక్కడ బౌద్ధ మత ఆరామాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. నాగార్జున సాగర్, ధూళికట్ట, రాయగిరి మొదలైన పరిసరాలలో బౌద్ధ భిక్షువులు బౌద్ధమతాన్ని పరివ్యాప్తం చేశారనడానికి ఎందరో చరిత్రకారులు ఆధారాలతో నిరూపించారు.మలిదశ ఉద్యమ సమయంలో ఈ చరిత్ర తెలియనివారు అనేక అసత్యాలను బహిర్గతం చేయడం జరిగింది. తెలంగాణకు అసలు చరిత్రనే లేదని అపవాదులు,విమర్శలు కుట్రపూరితం చేశారు చరిత్రహీనులు. అలా రావెళ్ల వెంకటరామారావు హిందూమతం గీసిన కుల గీతలను కాదని జనానికి బుద్ధుని బోధనలు ఈ నేలపై గుర్తులు చెదరిపోనివిగా కనబడతాయి. శ్రీగిరి చైతన్యము తెలంగాణ నేలని, సహజమైన చైతన్యశీ ఈ పుడమి సొంతమని చరిత్ర రుజువు చేస్తుంది. అలాగే చిందుకళాకారుల నోట భక్తిగీతాలు, వైష్ణవ మతానికి చెందిన గీతాలు ప్రజల మధ్య సజీవంగా సాంస్కృతిక వైవిధ్యాన్ని గురించి భిన్న మతాలతో అలరారుతున్న తెలంగాణ నేల ఔదార్యాన్ని కీర్తించాడు రచయిత.తెలంగాణ సాహిత్య చరిత్రను కొనియాడిన సందర్భం మనకు ఇక్కడ కనిపిస్తుంది.
'కవితలో విక్రాంతి కాహాళిని పూరించి
కమ్మ తెనుగున తేట కావ్యాలు విరచించే
పాల్కురికి ఆనాడేరా...
తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా....
భాషా వధునయన బాష్పతతి వనగింప
రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించి
కృషికుడై జీవించేరా
తెలంగాణ కవిరాజ పోతన్నరా !'
పూర్వ చరిత్రకున్న వైశిష్టతను గుర్తుచేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని కార్యోన్ముఖులు కావచ్చెనే సంకల్పం ఈ గేయంలో ప్రకఠితమౌతుంది. తెలంగాణలో విరిసిన సాహిత్యానికి సమైక్యరాష్ట్రశీలో సరైన గుర్తింపు పొందలేదనేది నిర్వివాదాంశం. పాల్కురికి, పోతనలు ఆత్మభిమానంతో రాజ్యాధిక్కారాన్ని చెడుగూడాడిన స్మరణ కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ముందు నుంచే ఆత్మగౌరవ నినాదం గేయసాహిత్యంలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. ఈ రకంగా ఆత్మాభిమానం ప్రకటన గేయ రూపకంగా మలచడంలో మలిదశలో ఊపిరిలూదిశీదని చెప్పవచ్చు.
రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ గురించి అక్షరారక్షరం ఎంతో గానం చేశాడు.ఈయన ఖమ్మం ప్రాంతంలో అభ్యుదయ కవిగా,రజాకార్ల ఆగడాలను,నిజాం నిరంకుశ పోకడలను ప్రత్యేక్షంగా చూసిన ఆనాటి యువకవి. వచన గేయాల ద్వారా ఆనాటి సామాజిక పోకడలను 'అవతల్పం', 'ముడిముక్కలు' అనే ముందుమాటలో పురిపండ అప్పలస్వామి అప్పటి సాహిత్య సిద్ధాంతాలను బేరీజు వేశారు. అటుతరువాత 1968-1969 మధ్యకాలంలో వెలువడిన ప్రత్యేక తెలంగాణ పాటను, సాయుధ పోరాటశీ అనంతరం ఉద్యమ పాటగా చిత్రీకరించుకోవాలి. కళ కోసమే కళ అన్న పూర్వ సిద్ధాంతాలు బూజు పట్టింది. ప్రజల కోసమే కళ అనే సత్యవాదం విశ్వవ్యాప్తం చేసిందిగా కనిపిస్తుంది. ప్రపంచం చుట్టూరా అభ్యుదయ సాహిత్యోద్యమం తలెత్తింది.ఆ అభ్యుదయ కోవకు చెందిన వారే రావెళ్ల వెంకటరామారావు గారు. ఆయానకిదే తెలంగాణ కలం యోధుల అక్షర నివాళి.