Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాన రహదారుల దిగ్బంధించి
నిత్యవ్యాపారాల నిలువరించి
నలుదిక్కులు పిక్కటిల్ల నినదించి
ప్రభుత్వాల స్థంభింపజేయపూని
హస్తినలో తిష్టవేసిన ఈ సత్యాగ్రహులెవరు?
అద్దాల సౌధాల కులుకువారికి
నిర్విరామ విందు విలాసాలు సలుపు వారికి
చెమట చుక్కలంటే తెలియని వారికి
ధాన్యం!మిల్లుల్లో ఉత్పత్తవునని ఊహించే వారికి
సమయానికి సర్వసుఖాలందుకునేవారికి!!వారెవరు??
రుధిరాన్ని స్వేదంగా మార్చి
వ్యయ ప్రయాసలే సేద్యంగా మలచి
దుక్కిదున్ని బీళ్ళను సస్యశ్యామలం చేస్తూ
సాంప్రదాయ కృషీవల జీవనాన్ని కొనసాగించే
అసలు సిసలు పల్లీయులు!సాటి భారతీయులు!
చవితినాడు చంద్రుని చూశారేమో
వక్ర వికృత అపనిందల పాలబడినారు
లాఠీదెబ్బల విందుభోజనపు వడ్డింపులు
జలఫిరంగుల వీరంగపు అతిథి మర్యాదలు!...
జననాయకులు వారు!ఖల్ నాయకులు కారు!
రక్తం గడ్డకట్టించే చలిదుప్పటి కప్పుకుని
కార్పొరేట్ కంపెనీలకు ప్రాణాలు పణంగా పెట్టే!రాక్షస చట్టాలను చట్టుబండలు చేయశపథం చేసిన భీష్ములు!
పొలాలువదలి పోరుబాటపట్టిన భారత భాగ్యవిధాతలు!
జాతి పరాధీనంకాకుండా నిరంతరం గస్తీకాస్తున్న అంతర్గత సైనికులు వారు!!
- కరిపె రాజ్ కుమార్
8125144729