Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమునందు నొక్కడు విదేశజనుండు విశాల భావనో
దేశములందు జీవిత నిధిన్ మన తెల్గుకు ధారవోసేసం
దేశము స్వేద బిందువులు తెల్పును సంపుట సంపుట స్వరూ
పాశయ దీక్ష రక్షణకు నాంధ్రుల గల్గెడిలో తలంపులే"అని సన్నిధానం నరసింహాశర్మ గారంటారు.అలా తెలుగు సాహితీ జగత్తు వికాసానికి పురుడు పోసిన సారస్వత సమరంగనలలో బహుముఖ వ్యక్తిత్వం కల్గిన విజ్ఞానఖని"C.P.BROUNగారు.
ఒకానొక సందర్భంలో C.P.Broun దొరవారు ఇలా అంటారు."The Telugu are a people quite as highly civilized as any in Europe;Telugu is peculiarly smooth and elegant in its sound,and the poets have cautiously preserved its euphony.Hence Europeans have called it the Italian of India...."C.P.Broun.
తెలుగు భాషాభివృద్ది కోసం తన జీవితాన్నే వెచ్చించిన నిత్య పరిశోధకుడు,నిరంతర కృషివదనుడైన చార్లెస్ ఫిలిప్ Broun దొర నవంబర్ 10,1798లో కలకత్తాలో పుట్టి పెరిగాడు.ఇంగ్లాండ్ పరిసర ప్రాంతంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 1817లో తిరిగి భారతదేశంలోని మద్రాస్ నగరానికి వచ్చి 1855లో తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.ఈస్టిండియా కంపెనిలో ఉద్యోగిగా మద్రాస్ సర్వీసుకు Broun దొర ఎంపిక కావడం ఆంధ్రుల అదృష్టమని చెప్పవలసి ఉంటుంది.1820లో కడపజిల్లా కలెక్టరుకు అసిస్టెంట్‌గా పనిచేశాడు.మచీలిపట్నం,గుంటూరు,చిత్తూర్ మొదలైన ప్రాంతాలలో ఉద్యోగం చేసిన ఎక్కువకాలం కడపలోనే స్థిరపడ్డారు. "కడపలో పెద్దబంగ్లా,తోట కొని అక్కడ గ్రంధాలయం ఏర్పాటు చేశాడు.తన సొంత డబ్బులతో పండిత పామరులను నియమించుకొని తన అవాసాన్ని సాహిత్య కర్మాగారంగా రూపొందించుకున్నాడుC.P.Broun గారు.పాఠశాలలు ప్రారంభించి దేశీయ ఉపాధ్యాయులను నియమించి ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు.తెలుగు,హిందూస్థానీ భాషలలో చదువు చెప్పించాడు"అని జానుమద్ది హనుమచ్చాస్త్రి వివరించారు.లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసిన తరువాత 1884 డిసెంబర్ 12 రోజున పరమపదించారు Broun దొర.
"నూరార్లు లెక్క సేయక పేర్లoదిన విబుధజనుల బిలిపించూచు వే
మార్ల ర్థమిచ్చు వితరణి
చార్లెసు ఫిలిప్Brownసాహెబు కారణన్"అని ప్రశంసలు అందుకున్న Brown తెలుగు సాహిత్యానికి ఆదరణ కారువైనప్పుడు,ఎన్నో కావ్యాలు,శతకాలు మారుగునపడిన గ్రంధాలను వెలుగులోకి తీసుకొచ్చిన అపర కార్యశీలుడిగా అవతరించాడు.ఒక దేశంకాని విదేశీ దేశస్థుడు ఒంటి చేతితో తెలుగు భాషా సాహిత్యానికి చేసిన సేవకి అతను మనకు చిరస్మరనీయుడైనాడు.
Brown దొరకు తెలుగు అక్షరాలను నేర్పినది వెలగపూడి కోదండరామ పంతులు గారు.అలా తెలుగు భాషలో నిష్ణాతుడు కాగలిగాడు.అలాగే Brown దొరకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కృష్ణారెడ్డి పాత్ర చాలా వరకు మెచ్చుకోదగినది.ఈయన ద్వారా రాతప్రతుల్ని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించే విషయంలో ఆ రోజుల్లో ప్రముఖమైనవాడు కృష్ణారెడ్డి.అట్లా తన పండితుల సాహిత్యానికి సరిపోయే పాండితి ప్రకర్ష సంపాదించలేదని ఆ పండితులు వినయ విధేయలతో బోధిస్తారని సామాన్య సేవకు ఇచ్చే జీతమిచ్చినా తృప్తిపడతారని,విద్య బోధించి డబ్బు సంపాదించడం వారికి అలవాటు లేదని Brown గారు తన గ్రంధాలలో రాసుకున్నాడు.Brown దొరగారు తాళపత్ర గ్రంధాల శోధనలో పడి స్వoత డబ్బు ఖర్చు పెట్టి గ్రంధాల్ని సంపాదించడం,సంపాదించిన వాటిని పాఠక భేదాలతో సహా మంచి కాగితాల మీద రాయించి ఆ రాయించిన గ్రంధాలు తెలుగు ప్రజలు బాగా ఆదరించేవైనప్పుడు వాటిని సమర్థులైన పండితుల చేత వ్యాఖ్యానాలు రాయించడం ఆయనకు నిత్యకృతమైనది.జీర్ణ వ్యవస్థలో ఉన్న అనేక ఉద్గ్రంధాలను సాధించి కొన్నింటిని ముద్రించాడు. కొన్నింటిని భవిష్యత్ తరాల కోసం గ్రంధాలను బైండింగ్ చేయించి గ్రామాలలో ఉన్న గ్రంధాలయాలకు పుస్తకాలు ఉచిత సరఫరా చేసిన ఉత్తముడు,దానకర్ణుడుC.P.Brown గారు.
"Brown దొర చేసిన కృషిలలో ఉత్తమమైనది,అతని పేరును ఆంధ్ర సాహిత్య చరిత్ర యందు శాశ్వతము చేసినది.అతడు తెలుగు కావ్యములకు చేసిన సేవ.ఆనా డాతడు మేరు ధీరుడై నిలిచి,ఆంధ్ర కావ్యములనుద్ధరింప బూనకుండినచో,మహాకావ్యములని ప్రఖ్యాతి పొందిన చాల తెలుగు కావ్యములకు మనకు లేకపోయేడివే"అని ప్రత్యేక పరిశోధన చేసిన కొత్తపల్లి వీరభద్రరావు పలికిన వాక్యాలివి.మరిముఖ్యంగా ప్రజాకవి వేమనను యావత్ తెలుగు వారికే కాకుండా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప పరిశీలకుడు Brown దొర మాత్రమే.మన తెలుగు సాహిత్యంలోని పద్యకావ్యాలలో వేమన పద్యాలు Brown గారిని బాగా ఆకర్షితుణ్ణి చేశాయనడంలో సందేహం లేదు.పద్యాలలోని భాషా సౌలభ్యం,భావగంభీర్యం,మూడాచారం ఎక్కువగా దృష్టిని మరల్చినవి.వివిధ ప్రాంతాల నుండి వ్రాతప్రతులు తెప్పించడం 1824లో ప్రారంభించి వేమన పద్యాల్ని చదవడం ప్రారంభించారు.Brown దొర స్వయంగా ఆంగ్లానువాద వ్యాఖ్యానం రాసి వేమన పద్యాలను పుస్తకంగా "The verses of Vemana"1829 సంవత్సరంలో అచ్చువేశాడు.అలాగే పాశ్చత్యులు తెలుగు నేర్చుకోవడానికి "తెలుగు వ్యాకరణం"1840లో రాశాడు.తెలుగు వాచకాలు రాశాడు.Brown నిఘంటు నిర్మాణాలు తెలుగు పండితుల మెప్పును పొంది,తెలుగు వారికి నిఘంటు నిర్మాణ పద్దతిని నేర్పించాడు. " ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు",తెలుగు --ఇంగ్లీష్ నిఘంటువు",మిశ్రమ భాషా నిఘంటువు"అనేవి Brown దొర కీర్తిని మరింత పెంచాయి.ఇంకా "ఆంధ్రగీర్వాణచ్చందం",కర్నాటిక్ క్రోనాలజీ", మీరాశీస్వామ్యము", రాజుల యుద్ధములు", తాతాచారి కథలు", తెలుగు బైబిలు"ఇటువంటి లఘు రచనలు మరింత ఖ్యాతిని పెంచాయి.తెలుగు ప్రాంతాలకు ఉద్యోగిగా వచ్చి తెలుగు భాషను మాతృభాషకన్నా మిన్నగా ప్రేమించి,తెలుగు భాషాసాహిత్యాలకు అసామాన్యమైన,అపూర్వమైన సేవ చేసిన మహనీయుడు,మృత జీవి Brown దొర.
C.P.Brown గారు ఛందో గ్రంధాలు,వ్యాకరణాలు,నిఘంటువులు,వాచకాలు,కావ్యాలు,చారిత్రక వచన గ్రంధాలు,కథలు రాశాడు.ఎన్నో కావ్యాలను పరిష్కరించాడు. సంస్కృత రచనలు,స్వీయ చరిత్ర రాశాడు. తెలుగు సాహిత్యంలో రచనల పరిష్కరణలో ఎందరో పండితుల సహకారాన్ని తీసుకున్నవారు జూలూరి అప్పయ్యశాస్త్రి ఉద్దండ పడితులలో ఈయన అగ్రగణ్యుడు.అనేక గ్రంధాలు,వ్యాఖ్యాలు, టీకాలు రాశాడు.Brown గారి అభిమతం ప్రకారం అతనికి నచ్చిన విధంగా వ్యాఖ్యాలు రాయడం వల్ల Brown దొర అప్పయ్య శాస్త్రి వ్యాఖ్యలనే మెచ్చుకొని ఆదరించేవాడు.అప్పయ్య జైమిని భారతం,పద్మపురాణం,ఆముక్తమాల్యద, శశాంక విజయం,సురాభాoడేశ్వరీయం,భాస్కర శతకం,మాతృ శతకం,శుకసప్తతి,కవికర్ణ రసాయనం,విజయ విలాసాలకు వ్యాఖ్యానాలు రాయించినట్లు తెలుస్తుంది.
చెంచయ్య పండితుడు "విజయం,శంశంశ అనే కావ్యాలను పరిష్కరణకు Brown దొర చేత నియుక్తుడైన పండితుడు చెంచయ్య. ఇతడు విష్ణుపురణ పరిష్కరన చేయడంలో పాల్గున్నాడు.ఇంకా కంభం నరసింహచార్యులు "శశాంక విజయం,చకోరియా వ్యాఖ్యను,ఆనందతంత్ర,రాఘవ పాండవీయ వ్యాఖ్యలను రాశాడు.Brown గారు సేకరించిన సంస్కృతాoద్ర గ్రంధాలన్నింటిని విడమరిచి వాటిని పట్టికలను తయారు చేసి వాటన్నింటిని నరసింహాచార్యులు పరిష్కరణలో సహయపడినాడు.విక్రమార్క చరిత్రము,కాశీఖండం,హంస వింశతి,హరిశ్చంద్ర వ్యాఖ్యానం మొదలైన వాటిని పరిష్కరించారు కంభం నరసింహాచార్యులు.మరొక పండితులు చిలుకమర్రి నరసింహాచారి ఇతను కూడా "ప్రభులింగ లీల"అనే ద్విపద కావ్యాన్ని పరిష్కరన చేశాడు.రాఘవ పాండవీయం,కాశీఖండంమొదలైనవి.ఇంకా ముటుకపాక బుచ్చయ్య శాస్త్రి గారు కడప జిల్లావాడు.ఈయన Brownదొర బుచ్చయ్య శాస్త్రిని తన విద్యా గురువుగా చెప్పుకున్నాడు.ఎక్కువ గ్రంధాలను రాయించకుండా కావ్య పరిష్కరణలకే అధిక ప్రాధాన్యతనిచ్చాడు.బుచ్చయ్య శాస్త్రి "వసు చరిత్ర"ప్రతి పదార్థ ప్రకాశిక వ్యాఖ్యానం రాయించుకున్నాడు Brown గారు.వెంకటేశ్వర మహాత్మ్యం,మాఘ మహాత్మ్యం మొదలగు కృతులను రచించాడు.భారతం,విష్ణూ పురాణం,హంసవింశతి,దశావతార చరిత్ర,పంచతంత్రం మొదలైన కావ్యాల పరిష్కరణలో Brown దొరకు తోడ్పడినాడు.అట్లాగే ఆరనిమఠం వీరభద్రయ్య గారిని "విజ్ఞుడైన జంగం గురువు"గా Brown గారు ప్రశంసించాడు.గరిమెళ్ళ వెంకయ్య ఉదయగిరి ప్రాంతం నుంచి కడపకు Brown గారిమీద గౌరవంతో వచ్చి భారతంలోని అరణ్య పర్వం పరిష్కరించాడు.ఇతను లేఖకుడిగా,పరిష్కర్తగా,వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
మరికొంత మంది పండితులలో పైడిపాటి వెంకటనరసయ్య "చెన్నపట్నం కవీశ్వరుల రాజులు --పూర్వోత్తరాలు" పద్యాలుగా చెప్పే పనికి ఇతన్ని నియమించుకున్నాడు.ఈయన అనిరుద్ద చరిత్ర,రాధా మాధవ సంవదాలకు వ్యాఖ్యాలు రాశాడు.వైజయంతి విలాసం,విక్రమార్క చరిత్ర,హరిశ్చంద్ర చరిత్రలను పరిష్కరించారు.సూరి దశావతార చరిత్రను,సూరి రామాభ్యుదయాన్ని పరవస్తు చిన్నయ్య సూరి పరిష్కరించాడు. సునందా పరిణయం కావ్యానికి లేఖకుడు.వసూచరిత్ర మూల గ్రంధాన్ని తర్జామ చేశాడు జూలూరి లక్ష్మీనారాయణ గారు.సంస్కృతాంధ్రాలలో పండితుడు.పరిష్కర్త పురాణం హాయగ్రీవ శాస్త్రి.వర్తమాన తరంగిణి ముద్రనలయం యజమాని,సంపాదకుడు,భారత గ్రంధాలను ,అష్టాదశ పురాణాలను ముద్రించాడు పువ్వాడ వెంకటరావు.శ్రీరంగ రాజు చరిత్ర,వ్యాకరణం,కందవోలు భూగోళం మొదలైనవి రచించాడు నరహరి గోపాలశెట్టి గారు.మరికొంత మంది కవులకు,పండితులకు Brown దొర కాలానికి అనుగుణంగా తాళపత్ర గ్రంధాలను ఏవిధంగా విభజించుకోవాలి,ఏవిధంగా సేకరించుకోవాలి,వ్రాతప్రతులు ఏవిధంగా భద్రపర్చుకోవాలో దారి చూపించారు.దానికనుగుణంగానే ఎందరో పండిత ప్రకరుషులైన దక్షణ భారతదేశం నుంచి తెలుగులో సర్వయర్ జర్నల్ కాలిన్ మెకంజీ,కావలి వెంకట బొర్రయ్య,వెంకట లక్ష్మయ్య,కావలి వెంకట నారాయణస్వామి అనే వాళ్ళతో గ్రంధాలను పరిష్కరణకు ఉపయోగించుకున్నారు.
వీళ్ళలో కవి ఉద్దండులైనవారు శ్రీ కందుకూరి వీరేశలింగం సాహిత్య చరిత్రలకు వైవిధ్యం,ఆధునిక వాఙ్మయానికి పునాదులు వేయడమే కాకుండా పరిశోధన వైపు మార్గం సుగమం చేశాడు.ఈయన కట్టుకథలను నమ్మకుండా క్షేత్ర పద్దతిలో శాసనాలు,కైఫీయత్తులు పరిశీలన గావించి,శాస్త్రీయమైన పద్దతిలో "కవుల చరిత్రను"రచించాడు.మానవల్లి రామకృష్ణ కవి కూడా తెలుగు,సంస్కృతాలలో మంచి పండితుడు.వేటూరి ప్రభాకర శాస్ట్రీతో కలిసి మద్రాసు రాష్ట్రమంతా తిరిగి తాళపత్ర గ్రంధాలను సేకరించి "సంస్కృత కవులు"అనే గ్రంధమాలలో 20మంది కవుల గురించి ప్రస్తావించారు.అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిశోధన వ్యాసాలు,భాషాతత్వ వ్యాసాలు,గ్రంథ సంవదాలు,పరిష్కరణలు,బాల వాఙ్మయం,జానపద పీఠికలు,శాసన పరిశోధనలు,చరిత్ర పరిశోధనలు ఈయన చేయిపెట్టని తెలుగు వాఙ్మయ రంగంలేదని చెప్పవచ్చు."చాటుపద్య మణి మంజరి"అనే గ్రంధం సేకరించి ముద్రించారు.అలాగే క్రీడాభిరామ పీఠిక,తంజావూరు రాజుల పీఠిక,అన్నమాచార్య చరిత్ర పీఠికలు మొదలైనవి చెప్పుకోవచ్చు.ఇదే కోవలోకి కోమర్రాజు లక్ష్మణరావు గారు బహుభాషా కోవిధుడు,చరిత్రకారుడు,శాసనాలను పరిష్కర్త,ఆధునిక తెలుగు సాహిత్య సంజీవినికి మూలస్తంభం ఈయన.విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి భారతదేశంలో శ్రీకారం చుట్టి,పదకుoడు వందల పుటల వ్యాసాలను ఆయనే రచించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనడంలో సందేహమే లేదు.
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప కృషి చేసిన అద్వైతుడైన Brown దొర తెలుగు కావ్యాలను ఉద్ధరించిన బద్దకంకనుడు కాకపోతే ఈరోజు మనం ఆనందంతో చదువుకొనే,గర్వంగా చెప్పుకునే అనేక కావ్యాలు,గ్రంధాలు నశించిపోయేవి అనడంలో ఎంతమాత్రం సత్యదూరం కాదు.తెలుగు సాహితీ పూదోటలో పూచిన పారిజాతమై,గ్రంథ సాహితీ పరిష్కరణ శోధకుడు "C.P.BROWNగారు.
- డా.ఓర్సు రాయలింగు
సెల్: 9849446027.