Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.ఓర్సు రాయలింగు
9849446027.
"వచన కవిత విచారణలో ఉరిశిక్షపడ్డ
మొదటి ముద్దాయిని నేను
అలనాటి కవితా లతాంగిని హత్యాచేశాను
అలంకార ఆభరణాలు అపహరించాను
అన్నీ ఒప్పేసుకున్నాను ఆనాడు బోనులో ఎక్కి
క్రింది కోర్టు వేసిన శిక్షను
మానవ కారుణ్య దృక్పథoతో సడలించి
జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు
ఒక తరంపాటు బ్రతకలన్నారు బందీగా
పాఠకుల గుండెల చెరసాలలో "
అని సగర్వంగా సాటిచెప్పిన చరిత్ర గమనుడు మన కుందుర్తి ఉంది.వచన కవితకి మరోపేరు కుందుర్తి ఆంజనేయులు.వచన కవితా ప్రక్రియని ఒక ఉద్యమంగా,ఒక జీవిత ధ్యేయంగా మల్చుకున్నది కుందుర్తి మాత్రమే.ఫ్రీవర్స్ ఫ్రంట్ అతని ఊపిరి నాడులు.వచన కవిత ఈ రోజు ఇంతగా ప్రాచుర్యంలోకి రావడానికి మూలస్తంభం కుందుర్తి కాబట్టే "వచన కవితా పితామహుడు"అన్నారు.ఊరు వాడలు తిరిగి, కవిత్వం రాసి,పీఠికలు,ఫ్రీవర్స్ ఫ్రంట్ నడిపి,సిద్ధాంతాలు చేసి మార్గదర్శనం చేశాడు.అందుకే వచన కవితాచార్యులయ్యారు.
జీవిత ప్రస్థానం :
1922 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా,కోటవారి పాలెంలో కుందుర్తి ఆంజనేయులు పేద కుటుంబంలో జన్మించాడు.వినుకొండలో విద్యాభ్యాసం చేసినప్పుడు జాషువా తెలుగు పండితులుగా ఉండి "ఫిరదౌసి"రాస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే మొదటి శ్రోతలలో ఒక్కడైనాడు కుందుర్తి.1936 --41 విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి 1937లో పద్యరచనకు పాదుకలు వేశాడు.విజయవాడ ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో ఇంటర్ చదువుతుండగా విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు.ఆయన ప్రభావంతో ప్రాచీన కవిత్వ పఠనం అబ్బింది.
పద్యకావ్యాలు, ప్రేమకావ్యాలు సృజించాడు. 1941 -43లో గుంటూరు ఏ.సీ.కళాశాలలో బి.ఏ.చదివి, నరసరావుపేటలో నవ్యకళా పరిషత్ ఆరంభించాడు.కమ్యూనిస్ట్ భావాల వైపు తన మనసు మళ్లించుకున్నాడు. తెనాలి దగ్గర రెవేంద్రపాడులో రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశారు. అటు తరువాత గుంటూరు టుబాకో మార్కెట్లో ఉద్యోగం చేశాడు. 1956లో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలోఅనువాదకుడిగా కర్నూలులో పనిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్లో ఉద్యోగం.1967లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించి ప్రతి సంవత్సరం ఉత్తమ వచన కవితా సంపుటికి బహుమతి ఇచ్చేవాడు.1977లో ఉద్యోగ విరమణ. సోవియట్ లాండ్ నెహ్రూ బహుమతి ,ఆంధ్రప్రదేశ్, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు వరించాయి. 1982 అక్టోబర్ 25న పరమపదించాడు కుందుర్తి.
రచనలు :
1.సౌప్తికం ( పద్యకావ్యo ), 2.రసధుని, 3.అమావాస్య, 4.నా ప్రేయసి ( ప్రేమ కావ్యాలు ),
5.నాయాగరా ( కవితా సంకలనం ), 6.తెలంగాణ, 7.ఆశ ( వచన కవితా నాటకం ),
8.నగరంలో వాన, 9.నాలోని వాదాలు, 10.హంస ఎగిరిపోయింది, 11.తీరా నేను కాస్తా ఎగిరిపోయాక, 12.మేఘమాల 13.ఇది నా జెండా, 14.కుందుర్తి పీఠికలు, 15.కుందుర్తి వ్యాసాలు,
16.బతుకు మాట ( ఆత్మకథ ). హిందీలోకి కుందుర్తి కవితలు " మేరే బినా"గా అనువాదమయ్యాయి.
ప్రధానంగా పద్యరచనను విడిచి వచన కవితా ప్రచారానికి ఆయన పూనుకోవడం వెనుక ప్రజలకోసం సృష్టించబడే సాహిత్యం ప్రజలకు అర్థం కావాలనే ఒక మహత్తర ఆశ దాగి ఉంది.ప్రాచీన సాహిత్యం కంటే ఆధునిక సాహిత్యాన్ని పాఠకులకు చెరువులోకి తీసుకురావడంలో కుందుర్తి కృషిని ప్రశంసించదగినది.వచన కవితను ఒక ఉద్యమంగా చేతబట్టిన కుందుర్తి ఆంజనేయులు,అనేకమంది యువ కవులకు మార్గదర్శకులయ్యారు.
"పాత కాలం పద్యమైతే / వర్తమానం వచన గేయం" అని ముక్తకంఠంతో ఎలుగెత్తి పలికాడు. పట్టాభికి ముందే పద్యాల నడుములు విరగదన్నింది కుందుర్తిగారే.కావ్య భాషనే సంకెళ్లు తెంచుమన్నాడు. పద్య కవిత్వం ప్రజలకి మధ్య "ఇనుప తెర"అన్నాడు. శవాకారంగా ఉన్న కవి సమయాలు,నేటి కాలానికి రుచించవని,అక్కర్లేని పాండిత్య ప్రకర్ష,విషయ సంపదలను వ్యతిరేకించమని అర్థించాడు.సాహిత్యంలోని మారుతున్న విలువలకి అనుగుణంగా రూపంలో మార్పు తప్పదని హితువు పలికాడు.
కుందుర్తి వచన కవితా వ్యాప్తికోసం ఉద్యమిస్తున్న రోజుల్లో సంప్రదాయ సాహిత్యానికి,పద్య కవిత్వానికి ఆదరణ బాగా ఎక్కువే. కవిత్వమంటే పద్యమే అనుకునేవారు. రాయప్రోలు, విశ్వనాథ, తుమ్మల, నాయిని, పుట్టపర్తి, మధునపంతుల, కారుణశ్రీ మొదలైనవారు పద్యకవిత్వంలో అందెవేసినవారున్నారు. ప్రసార సాధనాలలోగానీ, పత్రికలలోగానీ, సభలలోగానీ పద్యాలే ఎక్కువ కనిపించేవి. అటువంటి స్థితిలో పద్యకవిత్వానికి అడ్డుగా నిలిచాడు.వచన కవిత్వాన్ని ఎందరో చులకనగా, హేళనగా చేసి తనను కించపరిచారు. అయినా కూడా ఛందస్సులో ఉంటే చాలు అది కవిత్వమా ?అని కొత్త ప్రశ్నలు సoధించాడు. ఇంత తీవ్ర ఒత్తిడిలో తన ధోరణిని ఎక్కుపెట్టడం వల్ల యువ కవులు వచన కవిత్వం వైపుకు దారి మళ్లారు. పద్యకవిత్వాన్ని వెనక్కి నెత్తివేసి వచన కవిత ముందుకు సాగిపోయేలా చేశాడు కుందుర్తి.
"యతి ప్రాసల యిరకాటంలో పొల్లు మాటలు వాడినట్లు
భార్యామణి మెప్పుకోసం పక్కింటివాణ్ని తిట్టినప్పుడు
కథా గమనం భుజకంగా చంద్రవర్ణన చేసినట్లు" అంటూ కవితా లక్షణాల్ని ఉపమానాలుగా జతకల్పి తీసుకొని చెప్పటం కుందుర్తి లక్షణం.
"వెన్నెల బ్రతుకు కన్నెల మీద
విరహ సర్పపు పడగ విప్పింది"
"వానల మేనాల మీద
దిగులు కన్య మనస్సుల్లోకి దిగుతున్నది"
"మాంత్రికుడి మెడలో ధరించిన
పుర్రెల దండలా ఉంది నా దేశం"
"దరిద్రుడి మేనిపై ధరించిన అతుకుల బొంతలా"
"అత్తారింటికి వెళ్లే కొత్త పెండ్లికొడుకులా" ఇటువంటి అలంకారాలు,ఉపమానాలు వాడటం కుందుర్తి పదప్రయోగం విలక్షణ లక్షణం.పురాతన పదాలు వాడలేదు.సంస్కృత,ఆంగ్ల పదాల వ్యామోహం లేదుగానీ,అవసరం ఉన్నచోట వాడడం జరిగింది. "ఉదయాల ఉగ్గు గిన్నెలు'', "జీవితపు రూకలు'', "పదవుల శ్మశానం",వంటి నూతన పద ప్రయిగాలు వాడుతూ, "పాలన్నం", "కాపుసారా", "చక్రాoకితాలు", "మూర్ఖ శిఖామణి" వంటి వాడుక పదబంధాలకు అధిక ప్రాధాన్యమిచ్చాడు కుందుర్తి.
"ఇది నా కవిత్వగీతం వినేవాడు నరుడు
చదువు సంధ్యలురాని రోడ్డుమీద పొమరుడు
లేమితల్లి ఒడిలో నిరంతర గాఢ నిద్రాపరుడు" అని తన కవిత్వ లక్ష్యం ఏమిటో స్పష్టంగా, సూటిగా లోకానికి వివరించాడు. నీతిని సజీవంగా పట్టిచ్చినవారికి పెద్ద బహుమానం ప్రకటించారని వ్యంగ్యంగా చెప్పడంలో కుందుర్తి వేదన మనకు అర్థమౌతుంది.కవిత్వం సాధారణ పాఠకులకు చేరడంలేదనే బాధ కుందుర్తిలో కనిపించేది. కవికి సామాజిక స్పృహ ఉన్నగానీ కవిత్వం సామాన్యుడికి దగ్గరగా చేర్చడం భాష ప్రతిబందకమౌతున్నట్లు కొంతవరకు నిరాశ పడేవాడు. అందుకే బుర్రకథలు, నాటకాలు, జానపదాలు, పాటలు ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకువెళ్లాయి అనడంలో సందేహమే లేదు.ఆ విధంగా కవులుగా మనం కవిత్వాన్ని కూడా ప్రజలకు చేరువ చేయలేమా ?అని తనకు తానుగా ప్రశ్నించుకొనేవాడు. మార్క్సిస్టు అవగాహనలో కుందుర్తి ప్రయాణం మొదలైన తరువాత ఆయన సమాజాన్ని ఆ అవగాహనలో నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.దాని స్పృహలో నుండి ఆయన తనను తాను సమాజానికి అంకితం చేసుకోవాడానికి ప్రయత్నించాడు.కుందుర్తి వచన కవిత్వంలో ఒక లయ,తూగు సాధించాలని ప్రయత్నం చేశాడు. అందుకు తగినట్టుగా అంత్యప్రాసలు,ఆదిప్రాసలు ప్రయోగించాడు.
"స్వార్థం గట్టిన గులకరాళ్ల వంతెన ఆలంబంగా
సామాన్యుల బ్రతుకు బాటకొక లంబంగా"
"అంతులేని ఆనాటి దురాగతాలకు
అంతా బెదిరి చూస్తున్నారు
అంతమొందించే శక్తికోసం
అంతా ఎదురుచూస్తున్నారు" అని కుందుర్తి సంప్రదాయాన్ని ఎదురించాడు. దేవుని పేరుమీద జరిగే అన్యాయాలను, అవాంఛనీయాల్ని వ్యంగ్యంగా పొడుస్తూ "భగవంతునికి బహిరంగ లేఖ" రాశారు.
"తను తప్పు చేస్తూ శివా శివా అని
నా కండ్లు మూసే యోగి,నీకు వాడు మహాభక్తుడు
నేను వాణ్ణి సహించాను
తిండి లేని వాళ్ళకి తృప్తి విషం పెట్టడానికి
ఒకపూట ఉపవాసం చేసే భోగి
నీకు వాడు మహా ఆప్తుడు -నేను వాణ్ణి సహించాను
పావలా కొబ్బరికాయ మొదలు
పదివీశెల బంగారం దాకా
ప్రతీ దానికి మెచ్చి భక్తులకు వరాలు యిచ్చి
నీవు దైవపదవిని నిరూపయోగ పరుస్తావు". అద్దెపల్లి రామమోహనరావుగారన్నట్టు "సాంప్రదాయికమైన ప్రతికలను శిల్పపరంగా వినియోగించుకున్న అభ్యుదయ కవులలో కుందుర్తి విలక్షణత కలవాడు.సమకాలీన మానవులలో ఉన్న కుళ్ళునీ,కపటాన్ని బహిర్గతం చెయ్యడానికి విశిష్ట విధానం అవలంబించాడు."ఇందుకు ఉదాహరణ మంచి శిల్పపరంగా,అభివ్యక్తి పరంగా,లయపరంగా రుజువు చేస్తాడు కుందుర్తి.
"ఇవాళ రాత్రికే పంపిస్తున్నాను
అమ్మాయిని అత్తవారింటికి
కట్నం గాడిద లాంఛనాలు బరువు లెక్కించి
మీసాల్లేని మగ సింహాల్ని వేలంలో
అందరూ వెర్రిగా కొనేస్తుంటే
అయిపోతాయన్న భయంతో
అందరితో పాటు నేనూ ఒక్కదాన్ని ?
పుట్టుకొచ్చిను పాటపాడి
ఇంటికి తెచ్చి కట్టయ్యగానే
యింత పొడుగు మీసాలు మొలిచాయి దానికి
తిమ్మయ్య మగదేనని అప్పుడు తెలిసి సంతోషించాను." ఇలా కవిత్వానికి వ్యంగ్యమనేది ఒక్కొక్కసారి మరింత సౌoదర్యాన్ని తీసుకొస్తుంది.ఎంతటి ఉద్రిక్తమైన విషయాన్ని కూడా వ్యంగ్యంగా చెప్పడం వలన ఒక అస్త్రంలా ఉపయోగపడుతుంది.కుందుర్తి రాసిన "బరువు"కవితలో వ్యంగ్యం చురకలు అంటించేలా చేశాడు.
"ఈ లోకానికి ఇంకా వేడిపుట్టాలి
కావాలిస్తే నన్ను నేను రెండుగా చీల్చుకుని
ఉత్తర దక్షిణ ధృవాలమీద కాలం గడుపుతాను
నింగిలో సూర్యుడిని వెలిగిస్తూ
నేల మీద మనుషులను వెలిగిస్తూ...." అని తనను తాను ఒక దివిటీల వెలుగించుకొని తెలుగు సాహిత్యంలో నూతనదారులు పరిచాడు.
"సగర్వంగా చెప్పుతున్నాను
సాగరం భూగర్భం కోసి చోట
గుండెల మీద ఆనించి కూలీలు
కొండరాళ్లు మోసే చోట
అందులో నేనున్నాను....." అని తను ఎటువైపో సూటిగా సెలవివచ్చాడు.కుందుర్తికి సమాజంపట్ల ఉన్న ఆర్తికి నిదర్శనం "నయగారా"కవిత సంకలనంలోని కవిత పంక్తులు.కుందుర్తి,ఏల్చురి, బెల్లంకొండ కలిసి చేసిన ఈ ప్రయత్నం తెలుగు సాహిత్య చరిత్రలో ఎనలేని కీర్తిప్రతిష్టలు పొందింది.అభ్యుదయ కవిత్వంలో వచ్చిన మొదటి సంకలనంగా ఈ కావ్యం చరిత్రను సృష్టించింది.ఇందులో ప్రబోధం,కథాత్మకత, ఆవేశం వంటివి మనకు ఈ సంకలనంలో కనిపిస్తాయి.
"భూమ్మీద పస్థులున్న మనుషుల్ని చూసి
ఆకాశం కంటతడి పెట్టినట్లు
వాన ముమ్మరంగా కురుస్తుంటే"
"అవసరం లెనప్పుడడిగితే
అప్పులు సులువుగా లభించినట్లు
అక్కరలేని నగరంలో కూడా
పుష్కలంగా కురుస్తుంది" ఈ విధంగా కొత్త కోణంలో కల్పనలు చేస్తాడు.వాస్తవికతతో కూడిన పదబంధాలు,ఉపమానాలు వాడి పాఠకుల మదిని లాక్కుంటాడు.అయితే కసి,క్రోధం ఎక్కడా ఉండకపోవడం విశేష గుణం కలవాడు కుందుర్తి.
ఉప్పు సత్యాగ్రహాన్ని "దండియాత్ర"గా వచన కవితా కావ్యం రాశాడు.ప్రాచీన కావ్యాల్లోలాగా కుందుర్తి కూడా ప్రకృతి పరమైన అంశాల్ని కథలో లీనామయ్యేలా వర్ణించడం గమనిస్తాము.తెల్లవారి పాలన కి వ్యతిరేకంగా సాగిన,గాంధీ ప్రారంభించిన ఉద్యమానికి ప్రజలు చైతన్యం పొందటం గమనించి "దండియాత్ర"రచించాడు.నిజాం నవాబు నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా "తెలంగాణా"కావ్యం రాశాడు.వచన కవిత్వంలో కథా కావ్యాలకి కుందుర్తి నాంది పలికాడు.కథాకథనం,అభివ్యక్తి,ధ్వని ఒక్కసారిగా అల్లుకుపోయిన కావ్యం ఇది.
"దానికి రుజువు నీ చెదిరిన పాపిట
చిక్కుపడిన ముంగురులు
నూనె లేక తల దువ్వలేదు
అధికారి కనుసైగ చేసింది
ఆ యువతి కూడ గమనించలేదు
పోలీసులు బూట్లతో ముట్టడం మొదలెట్టారు
కీళ్ళమీద లాఠీలతో కొట్టడం మొదలెట్టారు" అని సన్నివేశాల చిత్రణ చేస్తూనే "కాలుతున్న శవంలాగా కరిగే న్యాయాన్ని కనకరిస్తాను నేను....నేటి మీద పరాక్రమిస్తాను"అని కర్తవ్యం గుర్తు చేస్తాడు. "ఈ నేల ఎవరిసోత్తు"అంటూ ప్రజల్ని ఇలా చైతన్య పరిచాడు.
"తిరుగుబాటు కాలానికి కలిసిన చుట్టం
ప్రతి యుగానికి అంతిమ ఘట్టం...." వంటి పదాలు ఉద్యమాలలో నినాదలై మస్తిష్క పొరల్లోకి ప్రవహిస్తాయి.తెలంగాణలో ప్రధాన సమస్య భూమి.భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది.
"మనం నివసించే భూమి గుండ్రంగా ఉంది
భూస్వాముల చేతుల్లో
వందల వేల ఎకరాలు పూర్ణాంకాల్లో...." తెలంగాణలోని అణచివేతల పట్ల తీవ్ర ఆగ్రహంతో రచనలు చేసిన వారిలో కుందుర్తి ఒకరు.తెలంగాణ సాయుధ పోరుకు బాటలు వేసిన కవుల్లో కుందుర్తి ముఖ్యుడుగా చెప్పుకుంటారు. "తెలంగాణా కావ్యాన్ని కుందుర్తి కొన్ని భావాల పునాదుల మీద రాశాడు.కాలం,మార్పు,ఉద్యమం,జనశక్తి, సంఘర్షణ మొదలైన భావాలు కావ్యంలో అంతఃప్రవాహాలుగా ఉంటాయి.ప్రజల్లో చైతన్యం రావడం,సమాజ ప్రయోజనాకి కృషి చేయడం ప్రధానాంశం"అని అద్దెపల్లిగారు వక్కానిస్తారు.
"నేను గేయాన్ని
ప్రజల గుండెల్లో యింకా మాయని గాయాన్ని
మృత వీరుల ధ్యేయాన్ని
స్వేచ్చా స్వాతంత్ర్యాలకు ఉపమేయాన్ని
ఛందస్సు పరిశ్రమకు ఆపేసిన ప్రభుత్వ సహాయాన్ని
సమతా సమాజ సాధనకు ప్రజాబలం చెప్పిన ఉపాయాన్ని
జాతికీ అవినీతికి జరిగే సంఘర్షణ సముదాయాన్ని" అని ప్రజల పక్షం నిలబడి అస్తవ్యస్త వ్యవస్థని ఎదురించాడు.
1981లో కుందుర్తి భార్య సుందరమ్మ చనిపోయినప్పుడు "హంస ఎగిరిపోయింది"అనే స్మృతి కావ్యం రాశాడు. ఇందులో మనం మరో కుందుర్తిని చూస్తాం.హంస ఎగిరిపోయింది -- అనడంలోనే తాత్వికత గోచరిస్తుంది. ఈ కావ్యం కుందుర్తి వ్యక్తిగత అనుభూతికి సంబంధించినది. అయితే ఎలిజీలలో గొప్ప ఎలిజీ.
"సుందరంమధురం మంజులమ్మనోహరమైన
చుక్కొకటి రాలిపోయింది
పక్షవాతం రాకుండానే నా రెక్కోకటి వాలిపోయింది"
"ఈ అడవిలో కొలనుందేమో
హంసలేంది కొలనేందుకుంటుంది ?
ఇక నీళ్లు కూడా కరువు
బ్రతుకింక గాడిద మీద మైల గుడ్డల బరువు" అని తన మనస్థాపాన్ని వ్యక్తపరుస్తాడు.జీవిత సహధర్మచారిని ప్రాధాన్యాన్ని విడమరుస్తాడు.నిరాశ,నిస్పృహలు ఉన్నా సహజమైన పరిహాసం,సంప్రదాయ నిరసన ఎక్కడికి పోతుంది ?అంటాడు కుందుర్తి.
"గతం చూసి గర్వించడం మంచిదే
కాని ప్రస్థుతం పఠించడం మరీ మంచిది
గతం విస్మరించడం తప్పే
కాని పట్టుకు వేలాడ్డo మరీ తప్పు
వాల్మీకి రామాయణం వ్యాసుడు భారతం రాసినట్లు
వర్తమాన కథావస్తువును వర్ణించడం నా మతం"
"ప్రయోజనం తండ్రి పరమ సౌoదర్యం తల్లిగా
పలికే ప్రతి వాక్కు రసానంద కల్పవల్లిగా
నా దారి నాది" అంటూ కుందుర్తి గతాన్ని కాల్చి వెయ్యమనే తీవ్రవాది కాదు,ఉగ్రవాది కాదు,అతనేమిటో అతని మాటల్లో తెలుస్తుంది.
ఇలా కుందుర్తి ఆంజనేయులు సమాజానికి చేరువలో ఉండి వచన కవిత పాఠవంలోకి ఆవహుడైనాడు. 1982 అక్టోబర్ 25న జీవితానికి సెలవిచ్చారు. 1984 నుండి కుందుర్తి రంజని తెలుగు సాహిత్య సమితి తరపున ప్రతిష్టాత్మకమైన కుందుర్తి గారి పేరు మీద వచన కవితల పోటీ పెట్టి అవార్డ్ కూడా ఇవ్వటం జరుగుతుంది.ఈ విధంగా కుందుర్తి సాహిత్య లోకానికి ఎనలేని సాహితీ సంపదను ఇచ్చి ప్రజల గుండె గదుల్లో కొలువైన అసలు సిసలైన "వచన కవితా పితామహుడు కుందుర్తి."
( కుందుర్తి ఆంజనేయులు గారి 10 డిసెంబర వర్థంతి,జయంతి సందర్భంగా రాసిన వ్యాసం )