Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాజశేఖర్
1
పచ్చనిపంటలు
మొలిపించిన నాగలి
ఊయలూగుతుంది నేడు
మోడుబారిన చెట్టుకు
2
పల్లెతనం
డొల్లతన మయింది
పట్నపు హంగులు
పులుముకొంది
3
పక్షులన్నీ
వలస వోయినయి
వట్టివోయిన
చెరువుల నిలువలేక
4
తాజ్ మహల్
తలదించుకుంది
గిజిగాడు అల్లిన
ఊయల మేడను జూసి
5
ఎడారి ఆకలికి
ఒయాసిస్సు బియ్యపుగింజ
పేదోడి ఆకలి దీర్చ
ప్రభుత్వ పథకాలు తీరు
6
పుస్తకం అలిగింది
తలుపు దెరువని బడుల జూసి
బడిమొకంజూడని
పిల్లల జూసి
7
మనసు పీకి
గడీయారపు కొయ్యకు
తగిలించిండు మనిషి
గంటల నడుమ ఊగిసలాటే
8
చేపలు నీటికి
ఎదురీదుతున్నయి
ఆటవిడుపుకు గాదు
ఆకలి వేటకు
9
బువ్వ
బురదయింది
ప్రకృతి
వికృతచేష్టలతో
10
కృషీవలుడు
బయటపడకుండు
విత్తనకంపెనీ
వలనుండి
11
అలసిన
రైతు కదలలేకుండు
ధరణి
పొత్తిళ్ల సేదదీరిండేమో
12
నాయకులు
జమచేస్తుండ్రు మనీ
ఓటరుకు
ఎరేయడానికనీ
13
పెద్దమనిషి
ఏషం మార్చిండు
ఖద్దరేసి
గద్దెనెక్కిండు
14
మనిషి
పరాధీనుడైండు
పైసల
మోహం వీడలేక
15
మనిషి
పరుగులువెడుతుండు
గడియారపు
ముళ్లుపొడుస్తుంటే
16
రోగం
భోగాన్ని మరిపించింది
మనిషిలోని
మనసు చిగురించింది