Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాటమే జీవితమై కవిత్వమే హృదయ ఆరాటమై ప్రజల కోసమే తన కళ అని నమ్ముతూ
తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన స్థానాన్ని శాశ్వతంగా లిఖించుకున్న కవి అలిశెట్టి.
తన కళ్ళ ముందు కనపడుతున్న ప్రపంచంలోని సమస్యలను ఒడిసిపట్టుకుని
ప్రతీకలు పదబంధాలతో గురిపెట్టిన తూటల్లాంటి కవిత్వం రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్.
ఆయన పదాలు విస్పోటిస్తాయి. అన్యాయం అక్రమాల చెంప చెల్లుమనిపిస్తాయి.
బాధితుల పక్షాన ఆయన కవిత్వం ఓ ఆయుధమై కాపు గాస్తుంది. వెతల పాలైన వారి జీవితాలకు ఊరట కలిగిస్తుంది.
ఒక్కసారి ఆయన జీవితం లోకి చూస్తే...
అలిశెట్టి ప్రభాకర్ గారిది ప్రస్తుత జగిత్యాల జిల్లా.
తండ్రి స్వర్గీయ చినరాజం, లక్ష్మి. 1954 జనవరి 12న జన్మించి అదేరోజు 1993లో .. అతి చిన్న వయసులోనే మరణించారు..
మొదట్లో వివిధ పత్రికలలో బొమ్మలు వేసే కళాకారుడుగా,ఆ తర్వాత జగిత్యాల లోని సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో సాహిత్య రంగంలో ప్రవేశించారు.ఇరవై సంవత్సరాల వయసులోనే అలిశెట్టి గారి మొదటి కవిత 1974లో పరిష్కారం అనే శీర్షికతో ఆంధ్ర సచిత్ర వార పత్రికలోఅచ్చయింది.
అలిశెట్టి ప్రభాకర్ గారు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వరుసగా ఆరేళ్ల పాటు సిటీలైఫ్ పేరుతో సుమారుగా 1425 కవితలు రాశారు. అందులో 418 కవితలను సిటీ లైఫ్ పేరుతో 1992లో అచ్చు వేశారు. అందులోని నగర జీవితం కవిత ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులకు పాఠంగా తీసుకోబడింది.
ఒక్క మెతుకు చాలు అన్నం అంతా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి..
అలాగే అలిశెట్టి గారు రాసిన ఏ ఒక్క కవిత చదివినా మిగతావి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు.
ఆయన రచనల్లో అద్భుతమైన వర్ణనలు కనిపిస్తాయి.ఆకలి మంటల కేకలూ వినిపిస్తాయి.
తన భావాల్ని ముక్కు సూటిగా ఎలాంటి సంకోచం లేకుండా నిక్కచ్చిగా వ్యక్తం చేసేవారు.
ఒక కవితలో. 'మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదు/ నిర్విరామంగా నిత్య నూతనంగా/ కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను'... అని నిర్భయంగా తానేంటో ఎలుగెత్తి చాటిన విప్లవ కవి అలిశెట్టి. 1990 లో " ఏ దేశం సిరసు మీద/ మోపిన పాదాలైనా/ హోదాలైనా ) సామ్రాజ్య వాదాలే నని రాజకీయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ని లొసుగులను ఎత్తి చూపిన ధీశాలి.
సమాజంలోని తారతమ్యాలను ఎత్తి చూపుతూ .. ఓ చోట/ ఖరీదైన శవం/ బ్రతికి అరుస్తోందింకా స్వార్థంతో...
/నా దేహ దహన దాహం/ గంధపు చెక్కల్తోనే తీరుతుందని/.... మరో చోట/ కాలం గానుగు/తోలే పీనుగు/ ఆఖరి మూలుగు.. అంటారు.
వ్వథా భరిత వేశ్య జీవితాన్ని మూడే మాటల్లో .. తను శవమై/ ఒకరికి వశమై/
తనువు పుండై/ ఒకడికి పండై..
ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాసిస్సై.. ఆ చిన్న పదాలతో ఆమె జీవితాన్ని చెప్పడం ఒక్క అలిశెట్టి కే సాధ్యం.
నన్ను/ తొలిచే బాధల ఉలే/నను మలిచే కవితా శిల్పం అని రెండు మాటల్లో తన జీవితాన్ని ఆవిష్కరించారు.
అలిశెట్టి రచనలు
ఎర్ర పావురాలు,మంటల జెండాలు, చురకలు,రక్త రేఖ, సంక్షోభ గీతం, సిటీ లైఫ్, మరణం నా చివరి చరణం కాదు... ప్రతి రచన ఓ అద్భుతమైన వ్యక్తీకరణే..
ఎర్ర పావురాలు లో ...నీ గుండె మీద/ నా భావాల జెండా/ నిటారుగా/ నిలబెట్టి నంత మాత్రాన/ నేనెప్పుడూ/ తృప్తి చెందను) నువ్వు వాయువువై/ దానికి ఆయువు పోసినప్పుడు/ నాకు అసలైన సంతృప్తి అంటారు. అంతస్తులు ఆస్తులు ఉన్నాయని విర్రవీగే వారిని ఉద్దేశించి.. నా దృష్టిలో కవితలో.. అంతస్తూ ఐశ్వర్యం/ శ్రామికుడి భిక్షం/ నా దృష్టిలో ధన మదాంధుడే అడుక్కు తినేవాడు.. అంటారు.
ఇక చురకలు మినీ కవితల్లో
చీమ ..చెమటకు చక్కని నిర్వచనం/ చెక్కు చెదరని నిదర్శనం నిరంతరం... చీమే
ఇక రక్త రేఖలు లో చెమట సారం పీల్చుకుని/ పెట్టుబడుల /ఇంద్ర ధనుస్సులు / పుష్పిస్తూనే ఉంటాయని దోపిడీ వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేస్తారు.
సంక్షోభ గీతం లో విషాద సాక్షాత్కారం గురించి కన్నీళ్ళను ఏ భాషలో కి అనువదించినా / విషాదం మూర్తీభవించిన స్త్రీయే సాక్షాత్కరిస్తుంది " ఎన్నెన్ని / గాయపడిన ఉదయాల్ని సంకలనంగా కూర్చినా / ఎవరెవరి / బాధామయ గాథల్ని/ ఈ కలంతో జాలు వార్చినా/ మిత్రుడా/ నిరంతరం సూర్యుడే నా ముఖ చిత్రం/.... ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో కవితలు రాసిన అలిశెట్టి ప్రభాకర్ గారు తన క్షయ వ్యాధితో బాధ పడుతూ తనకు
మరణం సమీపించిందని తెర వెనుక మృత్యువు/ లీలగా కదలాడినట్లు/ తెరలు తెరలుగా దగ్గు/ గుండెల్ని పిండేస్తుంది... అని తన చివరి రోజుల్లో రాసారు ఈ కవిత. తాను మరణించేంత వరకు కవిత్వ సృజన చేస్తూ మరణించినా తన అజరామర కవిత్వంతో చిరంజీవి అయిన అలిశెట్టికి అక్షర సుమాంజలి.
పేరు : వురిమళ్ల సునంద
ఖమ్మం