Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పింగళి. భాగ్యలక్ష్మి, గుంటూరు
ఫోన్.9704725609
భారతదేశం వీరులకు ధీరులకు నిలయం. అటువంటి వీర పుత్రుని కన్న ఖ్యాతి భారతమాతకు దక్కింది. ఈ వీరులు దేశం కోసం సర్వస్వాన్ని అర్పించారు. అటువంటి వీరులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యులు. వీరి జీవితం ఆద్యంతం ఒక సాహసం. ఆయన జీవితాంతం సాహసమే ఊపిరిగా జీవించారు. ఆంగ్లేయుల పైకి దూసుకు వచ్చిన ఒక బుల్లెట్ నేతాజీ. అందుకే "నేతాజీ" అన్న మూడు అక్షరాలు వినబడగానే నదులు కూడా పొంగిపొర్లి ప్రవహిస్తాయి. సముద్రం సైతం కట్టలు తెంచుకొని ఆయన పాదాల చెంత చేరి పవిత్ర జలంగా మారుతుంది. ప్రకృతి మాత సైతం పిల్లగాలులు ప్రసరింప చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతుంది. మువ్వన్నెల జెండా సైతం ఆయన కీర్తి కిరీటాల్ని వినువీధుల్లో ఎగుర వేస్తుంది పంచ భూతాల్ని సైతం అలరిస్తూ దేశమాత దాస్యశృంఖలాలను తెంచేందుకు జీవితకాలం పోరాటం చేసిన ఆదర్శమూర్తి. రవి 'అస్తమించని సామ్రాజ్యం' అంటూ విర్రవీగిన బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సా లోని కటక్ పట్టణంలో జానకీనాథ్ బోస్ ప్రభావతి గార్ల పుణ్య దంపతులకు జన్మించారు.
నేతాజీ చిన్నతనం నుంచీ కూడా చదువులో బాగా చురుగ్గా ఉండేవారు. 1913లో కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలో మెట్రిక్యులేషన్ టాపరుగా నిలిచారు. మెట్రిక్యులేషన్ తరువాత కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే నేతాజీకి స్వామి వివేకానంద రచనల పట్ల అమితమైన ఆసక్తి పెరిగింది. 1919లో బి.ఏ. తత్వశాస్త్రంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ఎమ్.ఎ.లో చేరిన ఆ చదువును కొనసాగించలేక పోయారు. ఇదే సంవత్సరం పంజాబులోని అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ పార్కులో సమావేశమైన ప్రజలపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సుభాష్ ను తీవ్రంగా కలచివేసింది. స్వాతంత్ర్య పోరాటంలోకి దూకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని దృఢంగా ఉన్నారు. కానీ తండ్రి మాత్రం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసిన తర్వాతే దేశ సేవ చేయాలి అని గట్టిగా చెప్పారు. దాంతో నేతాజీ లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సివిల్ సర్వీసు పరీక్షలకు చదివి పరీక్ష రాసి అత్యధిక మార్కులతో నాలుగవ స్థానంలో నిలిచారు. అక్కడే ఉద్యోగంలో చేరారు. అప్పటికే సహాయ నిరాకరణోద్యమం జోరుగా సాగుతుంది. భారతీయులంతా ఇబ్బందులు పడుతుంటే చూడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కార్యకర్తగా చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
జాతీయ స్వచ్ఛంద సేవా దళ్ పేరుతో ఒక వాలంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీంతో బ్రిటిషు వారు బోస్ ను అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు. స్వరాజ్య పార్టీ తరపున పోటీ చేసి చిత్తరంజన్ దాస్ మేయరుగా ఎన్నికయ్యారు. ఈయన నేతాజీని కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నియమించారు. కాని ఆరు నెలలు తిరక్కుండానే బెంగాల్‌ని విప్లవోద్యమ కేంద్రంగా మలచాడు అనే కారణంతో బర్మాలోని మాండలే జైలులో 30 నెలలపాటు ఉంచారు. దీంతో నేతాజీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో బెంగాల్లో ఆందోళన జరగ వచ్చనే కారణంతో మాండలే జైలు నుంచి వీరిని విడుదల చేశారు. జైలు నుంచి వచ్చాక నేతాజీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1930లో కలకత్తా కార్పొరేషనుకు మేయరుగా కూడా ఎన్నికయ్యారు. కొద్దిరోజులకే క్షయవ్యాధి సోకి చికిత్స కోసం వియన్నా వెళ్లారు. చికిత్సానంతరం విఠల్ భాయ్ పటేల్ తో కలిసి ఒత్తిడి తెచ్చే విధంగా వ్యూహరచన చేశారు. ఇదే సమయంలో తండ్రి చనిపోవడంతో భారతదేశం వచ్చారు. కొద్దిరోజులకే నేతాజీని గృహ నిర్బంధంలో ఉంచారు. మళ్లీ ప్రభుత్వం అనుమతితో చికిత్స కోసం వియన్నాం వెళ్లారు. అక్కడ 1937లో ఇండియన్ యూరోపియన్ సంఘ సభల్లో పాల్గొని అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఐరోపాలో కూడా బ్రిటిష్ పాలకులపై పోరాటానికి కలసివచ్చే నేతలతో కలిసి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం కూడా మొదలయింది. దీంతో బ్రిటిష్ వారు పూర్తిగా రెండవ ప్రపంచ యుద్ధంలో మునిగిపోయారు. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పంపించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని భావించారు నేతాజీ. ఫార్వర్డ్ బ్లాక్ నేతృత్వంలో తన అనుచరులతో కలిసి నేతాజీ బ్రిటిష్ వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దీంతో బ్రిటిష్‌వారు బోస్ ను మరోసారి అరెస్టు చేశారు. బోసును 12వ సారీ అరెస్టు చేసిన బ్రిటిష్ వారు ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించి గృహనిర్బంధంలో ఉంచి 62 మంది పోలీసులను కాపలా పెట్టారు. 40 రోజులు ఇలానే ఉండి స్వామి వివేకానంద రచనలు చదివి బాగా ఆకళింపు చేసుకున్నారు. ఆధ్యాత్మిక సాధనపై కూడా దృష్టి పెట్టారు. మెల్లిగా 1941 జనవరిలో నేతాజీ గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జర్మనీ చేరుకున్నారు, జర్మనీ నుంచి భారత దేశ ప్రజల కోసం రేడియోలో ప్రసంగించారు
స్వాతంత్ర్యం కోసం హిట్లర్ సహాయం కోరారు. హిట్లర్ జర్మనీ అధికారి సుభాష్ కు దుబాసీగా పంపారు. యుద్ధ కాలంలో జర్మనీ అధీనంలోకి వచ్చిన పదివేలమంది యుద్ధ ఖైదీలను తన వర్గల్లో చేర్చుకున్నారు. 1942 జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో తొలి జాతీయ స్వతంత్ర సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇటలీలో కూడా వేల మంది యుద్ధ ఖైదీలను విడిపించి ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేర్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్ని రోజులు జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకోవడం భారతీయులను ఉత్తేజపరిచింది. జపాన్ లో కూడా నేతాజీ మానవతా దృక్పథంతో ఆలోచించి 45 వేల మంది యుద్ధ ఖైదీలను విడిపించి తన సైన్యంలో కలుపుకున్నారు. జపాన్ నుంచి తూర్పు ఆసియా దేశం వచ్చి అక్కడి భారతీయులతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. 1963 జూన్ 4న సింగపూర్ లో భారతీయులు ఏర్పాటుచేసిన బ్రహ్మాండమైన సభలో రాస్ బిహారీ బోస్ తో కలిసి నేతాజీ పాల్గొన్నారు. రాస్ బిహారీ ఉద్యమ నాయకత్వాన్ని, సైన్యాన్ని నేతాజీకి అప్పగించారు. అజాదు హింద్ ఫౌజ్ సుప్రీం కమాండర్ గా ఎన్నికయ్యారు నేతాజీ. కమాండర్ హోదాలో నేతాజీ అజాదు హింద్ ఫౌజు సైనికుల్ని ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగం చేశారు. తూర్పు ఆసియాలో భారతీయ ఉద్యమ సారథిగా పగ్గాలు చేపట్టిన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తుది శ్వాస వరకు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగుర వేయడమే లక్ష్యంగా నేతాజీ చలో ఢిల్లీ సమర నాదం చేశారు. ఇలా సమరశంఖం పూరి స్తూనే అజాద్ హింద్ ఫోజ్ ఏర్పాటు చేసి పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అయితే నేతాజీకి అందవలసిన సైనిక సహాయం అందలేదు. అదేసమయంలో జపాన్ కూడా లొంగిపోవడంతో నేతాజీ సింగపూర్ చేరుకొని భారత్ కు స్వాతంత్ర్యమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశాల్లో నేతాజీ సింగపూర్ విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సైగాన్ చేరుకుని అక్కడి నుంచి 1945 ఆగస్టు 17న ఒక ప్రత్యేక విమానంలో బయల్దేరారు. బయలుదేరే ముందు 'విధి బలీయమైనది అన్నారు' అంతే మానవత్వం మూర్తీభవించిన త్యాగమూర్తిని మళ్ళీ ఎవ్వరు చూడలేదు. ఆ తర్వాత ఐదు రోజులకి 1945 ఆగస్టు 22న టోక్యో రేడియో నుంచి ఒక వార్త ప్రసారం చేశారు. సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న ఫార్మోజా సమీపంలో సంభవించిన విమాన ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. ప్రపంచం యావత్తూ ఒక్కసారిగా దిగ్బ్రాoతి చెందారు. ఆ మహావీరుడు దేశానికి చేసిన సేవలు అజరామరం అనన్య సామాన్యం.