Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.కందేపి రాణి ప్రసాద్
98661 60378
ఆటో ఆగి అగగానే గభాల్న దూకినట్లుగా దిగారు రత్తాలు పోశయ్య.. వాళ్ల చేతిలో పసిబిడ్డ ఉన్నది వీళ్ళ వెనకాల ఇంకో ముగ్గురు నలుగురు దిగారు గబ గబా నడుచుకుంటూ పిల్లల ఆసుపత్రి మెట్లెక్కారు. అక్కడున్న రిసెప్షనిస్ట్ దగ్గరకెళ్లి 'అర్జెంటుగా డాక్టరు గార్ని పిలవాలమ్మ! పిల్లాడు ఫీట్స్ తో కొట్టుకుంటున్నాడు' అని ఏడుస్తూనే చెప్పింది రత్తాలు. రిసెప్షనిస్ట్ వెంటనే వాళ్లను డాక్టర్ రూమ్ లోనికి తీసుకెళ్లింది.
రత్తాలు పెద్దగా ఏడుస్తూనే పిల్లాడ్ని టేబుల్ పై పడుకోబెట్టింది. పిల్లాడికి సంవత్సరం వయసు ఉంటుంది. కాళ్లు చేతులు కొట్టుకుంటున్నాడు డాక్టరు స్టెత్ తో పరిక్షిస్తూనే 'పిల్లాడి నుదురు మీద గాయం కనిపించింది ఇది ఏమిటి?' అని అడిగాడు. 'ఫీట్స్ తో కాళ్లు చేతులు కొట్టుకుంటున్నప్పుడు చుట్టతో కాల్చి వాత పెడితే తగ్గుతుంది సారూ' పిల్లాడి తండ్రి పోశయ్య చెప్పాడు. అతను చెప్పింది వింటూనే డాక్టరు ధర్మామీటరు తో జ్వరాన్ని చూశాడు చాలా ఎక్కువగా ఉన్నది.
సాధారణంగా పిల్లలకు జలుబు దగ్గు జ్వరం రావడమనేది సర్వసాధారణంగా జరిగే విషయం అయితే పిల్లలకు జ్వరం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 103,104 ఉన్నప్పుడు ఫిట్స్ రావడం జరుగుతుంది. కొంతమంది భయపడి కలవరిస్తుంటారు. ఏవో దృశ్యాలు కనిపిస్తుంటాయి. మరి కొంత మందికి ఫిట్స్ వస్తుంటాయి. ఫిట్స్ వచ్చినప్పుడు పల్లెటూర్లలో చాలా మంది ఇలా చుట్టతో కాల్చి నుదుటి మీద వాతలు పెడుతుంటారు. ఇది ముడనమ్మకమే తప్ప నిజమైన చికిత్స కాదు. పల్లెటూర్ల లొనే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతుంటారు కాల్చి వాతలు పెట్టడం వల్ల గాయంతో పాటు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ విషయాలు ప్రతిరోజు ఎంతో మందికి చెప్పినా ఎవరూ వినరు. అయినా డాక్టరు మళ్లీ మళ్ళీ చెపుతూనే ఉంటారు. డాక్టరు కు వైద్యం చేయడంతో పాటు అవగాహన కలిగించడం కూడా ఒక భాద్యతే అందుకే పిల్లాడికి సెలైన్ ఎక్కించి అడ్మిట్ చేశాడు. పిల్లాడి తల్లితండ్రుల్ని పిలిచిన డాక్టరు వాళ్లతో 'అమ్మా జ్వరం ఎక్కువైనప్పుడు ఒక వస్త్రాన్ని నీళ్లలో ముంచి పిల్లాడి ఒళ్లంతా తుడవాలి. అలా ఒంట్లో వేడి తగ్గేదాకా తుడవాలి వెంటనే డాక్టరు వద్దకు తీసుకెళ్లాలి. డాక్టరు ఇచ్చిన మందులు వాడుతూనే ఇలా తడిబట్టతో ఒళ్ళు తుడుస్తుండాలి. జ్వరం వస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలే గాని కాల్చి వాతలు పెట్టకూడదు' అని జాగ్రత్తలు చెప్పాడు.
రత్తాలు పోశయ్య ఇద్దరూ డాక్టరు కాళ్ల మీద పడ్డారు. ఎలాగైనా మా బిడ్డని కాపాడండి సారూ అంటూ ఎసిస్తూనే ఉన్నారు. డాక్టరు వాళ్ళను లెవదీసి 'నీ బిడ్డకేమీ ప్రమాదం లేదమ్మా నేను చూస్తున్నాను కదా క్రమం తప్పకుండా మందులు వాడాలి జాగ్రత్తలు తీసుకోండి ' అంటూ వాళ్ళను ఓదార్చాడు