Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురువు పాదాల మీదపడి
బోరున విలపించాలని ఉంది!!...
అతడు నాకు ఓ బోధివృక్షం!!...
అక్షరాలతో నన్ను...
విస్తరింప జేశాడు!!...
విజ్ఞానసౌధం వైపు...
నడిపించాడు!!...
అక్షరాలదారుల్లో...
అనంతభావాన్ని చూపించి...
తడి ఆరిన ఎడారి గుండెలని
సరికొత్త భావంతో...
స్పృశించేలా చేశాడు!!
గురువే నాకు ఓ ఇతిహాసం!!...
ప్రకృతి పుస్తకాన్ని తెరిపించి...
పసందైన పదాలకు
పదును పెట్టించి...
అదును చూసి నాలోని
అజ్ఞానాన్ని తరిమేశాడు!!....
తరతరాల చరిత్రలో
తరగని గుణాలనెన్నో చూపించాడు!!...
లోకంపోకడను
తనకళ్ళతో చూపించి...
మనసుతో ముడివేసి...
మమతలవడిలో కూర్చోబెట్టి...
సంస్కార గుణవంతునిగా... తీర్చిదిద్దాడు!!...
కనికట్టుతో కట్టేసి
కనువిందుచేసే ఎన్నో
దృశ్యాలను చూయించి...
అక్షరాలతో మనసుకు విందుచేసి...
వింతలోకాల్లో...
అక్షరపుంతల్ని తొక్కించేలా చేశాడు!!...
ప్రపంచపు వింతల్ని...
మానవీయ విలువల్ని...
సమానత్వపు వెలుగుల్ని...
ఆచరించి చూపాడు!!...
అందుకే...
అతడొక విజ్ఞాన కాంతి పుంజం!!...
నాలో నిలిచిన ఓ క్రాంతి దీపం!!...
అక్షరం మొలకెత్తే
విధానం చూపాడు!!...
నా గుండెలో చొరబడి
సత్యాన్ని దర్శించే
వినూత్న దృష్టిని అలవరచాడు!!...
వెన్నెల జలతారులో...
పారే సెలయేరులను..
దర్శించేలా చేశాడు!!....
ఎన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించి..
సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనాడు!!..
ప్రతినిత్యం ఓ అద్భుత
కృత్యం ఆవిష్కరిస్తాడు!!...
గురువు చూపిన
గమ్యం సుసంపన్నం!!...
నాలోని చెడుశక్తులను
పట్టేసి కట్టేసి దూరంగా నెట్టేశాడు!!...
బతుకు ఏడారిని ఓ పచ్చని
మాగాణిగా మార్చేశాడు!!...
స్వేదం చిందించకుండా...
రుధిరం పొంగించకుండా...
సునాయాసంగా అక్షరాకృతిని
పటిష్టమైన జాగృతిగా మలిచాడు!!...
ఎన్నోతప్పిదాలను తిప్పికొట్టి...
తప్పటడుగులను సరిచేసి...
కలిసొచ్చిన కాలానికి
నడిచొచ్చిన గురువుగా...
నా అంతరంగాన...
ఓ ఆరాధ్యదైవంగా మిగిలాడు!!...
- అంబటి నారాయణ
9849326801