Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీడు భూములెన్నిటినో
సస్యశ్యామలం చేసి
అన్న దాతయై జనులకు
జీవనాడియై జాతికి
కష్టనష్టాలెన్నొచ్చినా
కడుపులో దాచుకుని
పంటిబిగువున బతుకీడ్చుతూ
ప్రకృతి వికటించినా
మార్కెట్ మాయలు చేసినా
ఎదురుదెబ్బలెన్నితిన్నా
ముందుచూపేతప్ప
వెనుకడుగు వేయలేదు
అదరలేదు బెదరలేదు
సాగు సాగింపు ఆపలేదు
ఎత్తులు జిత్తులు తెలియని
అన్యాయాలు అక్రమాలు చేయని
మాయా మర్మం మోసం లేని
పవిత్ర వృత్తిని వీడలేదు
అండగా వుండాల్సిన పాలకులు
నూతన సాగు చట్టాలు తెచ్చిరి
కార్పొరేటర్ల చేతుల్లో బంధించ
కుదేలౌతున్నాడు కర్షకుడు
భద్రత లేని బతుకగునని
గిట్టుబాటు లేని సేద్యమగునని
అన్యాయమని ఆడిగినందుకు
నిరసనకు దిగినందుకు
అపహాస్యం చేస్తున్నరు
అపరాధిగ చూస్తున్నరు
అడ్డంకులు కలిగిస్తున్నరు
అవాంతరాలు సృష్టిస్తున్నరు
అయినా ఆగబోమంటూ
ఎత్తిన పిడికిలి దించబోమంటూ
నల్లచట్టాలు రద్దగు వరకు
దీక్ష బూనినాడు లక్ష్యం దీశగా
పట్టువీడబోనంటూ
నిర్బంధాల లెక్కచేయనంటూ
కదలినాడు సైరికుడు సైనికుడై
చారిత్రక యవనికపై తాను
చెరగని ముద్రను వేస్తూ
సుదీర్ఘ పోరాటం సాగిస్తూ
కదలాలి జాతియావత్తు
అతని అడుగు జాడన
- పి.రామనాథం
భద్రాద్రి కొత్తగూడెం