Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్య రంగాన విలక్షణమైన పాండిత్య ప్రతిభ వున్న విదుషీమణి డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి. బహుళ ప్రక్రియల్లో రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ తెలుగు సారస్వత సంపన్నతకు ఆమె అందిస్తున్న దోహదం ఎంతో విలువైనది అంటూ సుజాతారెడ్డి గారి వ్యక్తిత్వం, మూర్తిమత్వం, సాహిత్య రంగంలో చేసిన కషిని వివరిస్తూ ఒక వ్యాసం, రచయిత్రిగా ఆలోచనాత్మకం ఆమె కథా సంవిధానం అంటూ ఇంకో వ్యాసంలో విశ్లేషించారు. విసుర్రాయి కథా సంకలనంపై ఓ.సరస్వతి, సంబాళ్ళ విజయలక్ష్మి పెద్ద వ్యాసాలతో పాటు వెల్దండి శ్రీధర్, బి.ఎస్.రాములు, కేతు విశ్వనాథరెడ్డి రాసిన చిన్న వ్యాసాలు కూడా ఉన్నాయి. ''మింగుతున్న పట్నం'' కథా సంకలనానికి వరవరరావు రాసిన ముందు మాటతో పాటు మునిపల్లె రాజు, కమలిని, అవసరాల రామకష్ణారావు, కాసుల ప్రతాపరెడ్డి రాసిన చిన్న వ్యాసాలు వున్నాయి. ''వ్యాపార మగం''పై గీతాంజలి రాసిన పెద్ద వ్యాసం వుంది. ''మరో మార్క్స్ పుట్టాలె'' కు ఎన్.వేణుగోపాల్ రాసిన ముందుమాట, కె.పి. సమీక్ష వున్నాయి. ముదిగంటి వారు రాసిన ఒక కథను తీసుకొని విహారి, ఎన్.రజని -రెండు కథలను తీసుకొని తుర్లపాటి రాజేశ్వరి విశ్లేషించారు. విశాలాంధ్రలో వచ్చిన వ్యాసంతో పాటు వుప్పల నరసింహం రాసిన పెద్ద వ్యాసం బాగున్నాయి. రచయిత్రిగా ముదిగంటి క్రమ వికాస పరిణామాన్ని ఈ వ్యాసాలు తెలియజేస్తాయి.
(ముదిగంటి సుజాతారెడ్డి కథల ప్రపంచం- విశ్లేషణలు. సంపా : జె.చెన్నయ్య, పేజీలు :97, వెల : రూ.150, ప్రతులకు : తెలంగాణ సారస్వత పరిషత్తు., హైదరాబాదు)
- కె.పి.అశోక్ కుమార్