Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు దశాబ్దాల కాలాన్ని పట్టుకుని తెచ్చి మనముందర పెట్టి 'కాలం వెంట కలం'తో నడుస్తూనే వున్నారు సుధామ గారు. వారి డెబ్బయి మూడు వ్యాసాల రీళ్ళు, కాలపు తెరపై సాహితీ కళాజీవితాలను కళ్ళకు కట్టిస్తాయి. నిజంగా ఇది అందరు చదవవలసిన సంపుటి. తెలుగు నేలపై వెలుగులు ప్రసరింపజేసిన సాహితీ కారులు, కళాకారులు అనేక ప్రముఖుల జీవితాలను, కళా సృజన పరిచయాలను ఇందులో మనం చూడగలుగు తాము. పరిశోధక విద్యార్థులకు, సాహిత్య అధ్యయన కారులకు, సాహితీ ప్రియులకు ఆసక్తిని రేకెత్తించే, అనురక్తిని కలిగించే వ్యాసాల సంపుటి సుధామ గారి 'కాలం వెంట కలం'.
రచయిత స్వయాన కవి, విమర్శకుడే కాక, కార్టూనిస్టు, చిత్రకారుడు, రేడియో ప్రయోక్త, కళాకారుడు అయి వుండటం వల్ల వ్యాసాల లయలో కళా హృదయం కదలాడుతుంది. ఆసక్తి చిగురుదొడుగుతుంది. తను రాసిన కవుల, కళాకారులతో పరిచయమూ, సహచర్యమూ, సాంగత్యమూ వారిపైన సుధామ గారికున్న గౌరవ అభిమానాలు కూడా చదివించేతనాన్ని పెంచాయి. వీరి అనుభవాల ధారను భావితరాలు ఆస్వాదించి తీరవలసినదే.
శ్రీశ్రీ, కుందుర్తి, దాశరథి రంగాచార్య, సినారె, రాళ్ళబండి కవితా ప్రసాద్ మొదలయిన పరిచయాలతో పాటు కథకులు పెద్దిబొట్ల సుబ్బరామయ్య అంపశయ్య నవీన్, రావూర్ భరద్వాజ్ రేడియో కార్యక్రమాలు, భానుమతిగారి కథలు, ముళ్ళపూడి పరిచయమూ, మునిమాణిక్యం గారు, పి.వి., కాళోజీల స్నేహం, నాటక రచయిత మొదలి నాగభూషణశర్మ, గీర్వాణ భాషా చంద్రుడు, పుల్లెల రామచంద్రుడు, మిమిక్రీ ధ్వని శిఖరుడు నేరెళ్ళ వేణుమాధవ్, మృదంగ విధ్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, కార్టూనిస్టు సత్యమూర్తి, చిత్రకళా రూపు రేఖల బాపు, తలిశెట్టి రామారావు, రేడియో అక్కయ్య తురగా జానకీరాణి, శశాంక మాడభూషి రంగాచార్య మొదలయిన ప్రసిద్ధులను తనదైన శైలిలో పరిచయం చేశారు. సినీ కథానాయకుడు అశోక్‌కుమార్, ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ ప్రజా గాయకుడు నోబుల్ బహుమతి గ్రహీత బాబ్డిలాన్ గురించీ ఇందులో మనం తెలుసుకోవచ్చు. సాహిత్య జీవితాలనేకాక తెలుగు భాషను గురించి, నూరేళ్ళ తెలుగు కథను గురించి, ప్రసార మాధ్యమాల గురించి వున్నాయి. తన సాహితీ కళా రంగ అనుభవాన్ని రంగరించి వెలువరించిన ఈ వ్యాస సంపుటి ప్రతి సాహితికారుడు కలిగి వుండాల్సిన గ్రంథం.
(కాలం వెంట కలం (వ్యాస సంపుటి), రచయిత : సుధామ, పేజీలు : 440, వెల : రూ.300/-, ప్రతులకు : ఎ. ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి 12, సదత్ టవర్స్, పద్మావతి అపార్ట్మెంట్స్, సలీం నగర్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్ - 036, సెల్ : 9848276929 / 9849297958)
- కె.ఆనందాచారి