Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- పింగళి భాగ్యలక్ష్మి
గుంటూరు
9704725609
కళాతపస్వి, దర్శక భగీరథుడు, ఈయన తెలుగు చిత్రసీమకు బంగారు పూదండ. తెలుగు సినీ కన్యకకు సింగారాలద్దిన శిల్పి. చలనచిత్ర రంగానికి కొత్త సొగసులు కూర్చిన విశ్వకర్మ. సినీ సీతామాలక్ష్మి పాదాలకు సిరిసిరిమువ్వలు ఏరినా,శారదా మహతిపై శృతిలయలుగా మారినా అది కాశీనాధుని విశ్వనాధ్ గారికే సాధ్యం. ఆయన కళాత్మక, కధాత్మక, వినూత్న, విశిష్ట చిత్రాల ఆవిష్కర్త. తెలుగు చిత్రసీమకు దశ, నిర్దేశం చేసిన గొప్ప దార్శనికుడు. వెండితెరపై ఎన్నటికీ చెరగని సంతకం విశ్వనాథ్ గారు. తెలుగు చిత్రాలలో తెలుగుదనాన్ని తెలుగు జిలుగు వెలుగుల్ని ఆవిష్కరించి ప్రతిష్ఠాత్మకమైన "రఘుపతి వెంకయ్య అవార్డు" "పద్మశ్రీ అవార్డు"లను సొంతం చేసుకున్న కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారు 1930 ఫిబ్రవరి 18న గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెదపులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల ఇంట కళామతల్లి ముద్దుబిడ్డగా జన్మించారు. బి.ఎస్.సి వరకు చదువుకున్నారు.
రేపల్లెలో నివసిస్తున్న సుప్రసిద్ధ గేయరచయిత సముద్రాల సీనియర్ కుటుంబంతో కాశీనాధుని పరివారానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. సముద్రాల వారి స్నేహ తీరంలో, వారి అక్షర సాన్నిధ్యంలో విశ్వనాథ్ లోని భావుకతను తట్టిలేపింది. సముద్రాల వారి స్నేహ పరిమళంతో, ప్రోద్బలంతో విజయవాడలోని వాహిని పిక్చర్స్ పంపిణీ సంస్థ మేనేజర్ గా ఉద్యోగానికి శ్రీకారం చుట్టారు విశ్వనాధ్ గారు. ఇంతలో మద్రాసు వాహినీ స్టూడియోలో 'సౌండ్ రికార్డిస్ట్' గా చేరాలని బి.ఎన్.రెడ్డి గారి నుంచి
స్వయంగా ఆహ్వానం అందింది. అప్పటినుండి విశ్వనాధ్ గారి జీవిత గమ్యం, గమనం మారిపోయింది. అక్కడ ఆదుర్తి సుబ్బారావుగారు, తాతినేని ప్రకాశరావు గారి లాంటి గొప్ప దర్శకులతో ఇంకా ఎన్టీ రామారావు గారి లాంటివారితో సాన్నిహిత్యం ఇవన్నీ ఆయన తనను తాను తీర్చిదిద్దుకోవడానికి దోహదం చేశాయి. ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన ముందుగా సౌండ్ అసిస్టెంట్ గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా 10 ఏళ్ళు పనిచేశారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, కృషి, పనిచేసే తత్వం అన్ని కలగలిపి అన్నపూర్ణ స్టూడియోలో ఆ బ్యానర్లో "ఆత్మగౌరవం" సినిమాకు దర్శకుడిగా విశ్వనాథకు అదృష్టం వరించింది. ఈ తొలి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ 'నంది పురస్కారం', 'రాష్ట్రపతి యోగ్యతాపత్రం' లభించాయి.
ఆయన పాటించే జీవన సూత్రాలు, క్రమశిక్షణ, అంకితభావం ఇవన్నీ ఆయన్ను ఓ గొప్ప దర్శకుడిగా ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. ఆయన సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని మానవీయ కోణంలో అనేక చిత్రాలను ఆవిష్కరించారు. ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని సృష్టిస్తారు. చక్కని కథ ఉంటుంది, అంతకుమించి కథాబలం ఉంటుంది. ప్రతి ఫ్రేములో నవ్యత్వం, ప్రతి దృశ్యంలో వైవిద్యం, సంప్రదాయం, సనాతనo, సమాహారంగా దర్శనమిస్తాయి. శాస్త్రీయ, సంగీత నృత్యాలు సమ్మోహనంగా కనిపిస్తాయి. ఆ దృశ్య కావ్యాలలో ఆ చిత్రాలన్నింటినీ మించి విశ్వనాథ్ గారి దర్శక ప్రతిభే ప్రస్పుటిస్తుంది, ప్రతిఫలిస్తుంది.
అలాగే ఉదాత్త కథాంశంతో 'శారద' చిత్రం తీశారు. ఇలా అన్నీ వైవిధ్యభరితమైన చిత్రాలే తీశారు. "ఓ సీత కథ" చిత్రం నుంచి స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. అపారమైన ప్రేమను గుండెల్లో దాచుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు. "సిరిసిరిమువ్వ" సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కళాతపస్వి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది "శంకరాభరణం". ఫలితంగా పొదుపైన, పదునైన సంభాషణలు వీనుల విందైన పాటలు కలగలిసి 'శంకరాభరణం' దృశ్యకావ్యమై ఆవిష్కృతమైంది. జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఈ సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది.
భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన ఎన్నో సినిమాలు తీశారు. వాటిలో 'సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం" లాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలు. కుటుంబ వ్యవస్థ సామాజిక అంశాలను కూడా తీసుకుని "సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం" వంటి అద్భుతమైనసినిమాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత గొప్ప దర్శకులే కాదు, అంతకు మించి అద్భుతమైన నవరసాలు పండించే గొప్ప నటులు కూడా. "సంతోషం, వజ్రం, శుభసంకల్పం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్" వంటి విజయవంతమైన సినిమాల్లో తన నటనకు పట్టం కట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కాశీనాధుని కళా తపస్సుకి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు ఆయన ఇంట కొలువుతీరి పునీత మయ్యాయి. ఇంక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే "పద్మశ్రీ" అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
"ఏ కులము నీదంటే గోకులము నవ్వదా" అంటూ మను ధర్మ పై సప్తపది చిత్రం ద్వారా పిలుపునిచ్చారు. ఈ సినిమాలో అజరామజరమైన సంగీతాన్ని వర్షిoచారు. నృత్యం ఇతివృత్తంతో తీసిన సినిమాలు అనేకమంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి. ఇలా విశ్వనాధుని సినిమాల స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది లలిత కళా రాధకులుగా మారారు. విశ్వనాథ్ గారు సినిమాలలో కళాత్మకమైన విలువల్ని మేల్కొలపడానికి ఏతెంచిన నూతన వైతాళికుడు. తెలుగు సినిమా రంగం ఆయన రాకతో స్వరావళిని దిద్దుకుంది. సకల జనావళి హృదయాలలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సినిమాలని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా శాస్త్రీయ, సంగీత నృత్యాలు నేర్పే పాఠశాలలెన్నో ఆవిర్భవించాయి. అది ఆయన పంచిన అమృతం. ఈ అమృతమూర్తి కాశీనాథుని విశ్వనాథ్ గారు 'కళల కాణాచి'గా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచం నలుమూలల వ్యాపింపజేస్తూ మరిన్ని ఉత్తమోత్తమమైన సినిమాలు తీస్తూ అలాగే నటనలో కూడా నవరసాల్ని పండిస్తూ ఆచంద్రార్కం చుక్కల్లో చంద్రుడిలా ఈ భూమ్యాకాశాలు ఉన్నంతవరకు వెలిగిపోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.