Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేనెలొలికే భాష, అమ్మతనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఈ భాష జాతికి ఆయువుపట్టు, తరతరాల సంస్కృతికి వారధి, నాగరికతకు నిండుతనం. "తెలుగు భాష తియ్యదనం, తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం" అన్న ఈ మాటలు ఒక సినీ కవి గారి కలం నుండి జాలువారిన అక్షరసత్యాలు. 'అమ్మ' అనే పిలుపు లోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుoది. ఇంకా చెప్పాలంటే మాతృభాష అమ్మ పాలoత ఖమ్మనైoది, మధురమైనది, పవిత్రమైంది. అలాగే "చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా" అనే మధురమైన వేములపల్లి వారి గీతం ఆలపిస్తే ఓ రోమాంచిత ప్రేరణ జాతి మొత్తాన్ని ప్రజ్వలింప చేస్తుంది.
"దేశభాషలందు తెలుగు లెస్స" అన్నారు కృష్ణ దేవరాయలు. దేశంలో 22 అధికారిక గుర్తింపు పొందిన భాషలలో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం 'ద్రవిడ భాష'. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టంద్వారా 1966లో తెలుగును అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోను తెలుగును అధికార భాషగా గుర్తించారు. 2008లో కన్నడ తో పాటు తెలుగును కూడా ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీసుఘఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉన్నారు.
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలిచే తెలుగుభాషను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సింగపూర్, మయన్మార్, మారిషస్ తదితర దేశాల్లో కూడా తెలుగు భాష ఎంతో గొప్పగా విరాజిల్లుతుంది. అన్ని దేశాలలో మన తెలుగు భాష దేదీప్యమానంగా వెలుగిపోతున్నా కూడా మనం మన పిల్లల్ని చిన్నతనం నుంచి కూడా ఇంగ్లీష్ చదువులకే అంకితం చేస్తున్నాo. మనం ఇంగ్లీష్ మీడియంలో చేరితే ఇటు ఇంగ్లీష్ లోను పూర్తిగా పట్టు సాధించలేము, అటు తెలుగులోను పూర్తిగా పట్టు సాధించలేము. తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగుకు మధ్యలో అయోమయం వల్ల ఏ భాష సరిగా రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటాము. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే మాతృభాషలో విద్యా విధానం కొనసాగించాలి. అలాగని ఇంగ్లీష్ నేర్చుకో కూడదని కాదు. "మాతృభాషను ప్రేమించు, పరభాషను గౌరవించు" అనే నినాదంతో ముందుకు సాగాలి. మాతృభాషలో ఒకసారి జ్ఞానం సంపాదించుకున్న తరువాత ప్రపంచంతో ఎలా మెలగాలి అని తెలిసిన తర్వాత విజ్ఞానం సంపాదించుకునే క్రమ పరిణామం అర్థం అయిన తర్వాత ఏ భాష అయినా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. 15 సంవత్సరాల పాటు మాతృభాషలో విద్య నేర్చుకున్న తర్వాత మనం ఇంగ్లీష్ అయినా, ఫ్రెంచి అయినా, కన్నడ అయినా, జర్మనీ అయినా తేలికగా నేర్చుకో గలుగుతాం.
యాభై ఆరు అక్షరాల తెలుగుదనం, 16 అణాల తెలుగు తియ్యదనం వున్న తెలుగు భాష గొప్పతనం అమోఘం, అపూర్వం. కవులు పండితులు, మేధావులు విదేశీయులు సైతం మెచ్చుకున్న భాష మన తెలుగు భాష. తెలుగు భాష పరిస్థితి భాషాభిమానులకు కంటతడి పెట్టిస్తుంది. జిలుగు వెలుగులు విరజిమ్మాల్సిన మన తెలుగు భాష మృతభాష జాబితాల్లోకి చేరనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. రానురాను మాతృభాషలో బోధన తగ్గిపోతుంది. ఇలా తెలుగు భాష రోజురోజుకు ఉనికిని కోల్పోతుంది. నాగరికతకు నిండుతనం లాంటి తెలుగు భాషలోనే విద్యాబోధన జరగాలి. అప్పుడే ఏ భాషకైనా మనుగడ ఉంటుంది. తెలుగు భాషలో ఎక్కువగా ఆంగ్ల పదాలు రావడం కలుషితం కావడం ఇలా తెలుగు పదాలు కనుమరుగైపోతున్నాయి. గ్లోబలైజేషన్, కంప్యూటరీకరణ వల్ల చాలా పదాల వినియోగం తగ్గిపోయింది. పిల్లలకు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయాలి. అలాగే మమ్మీ, డాడిల స్థానంలో 'అమ్మానాన్నలు' లాంటి తియ్య తియ్యటి పదాలు పిల్లలు పలికేలా చెయ్యాలి. ఇంకా ఏ దేశమేగినా నీ ఆత్మ బంధువు తెలుగును మరవద్దు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తెలుగును బ్రతికించే విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. తెలుగు రచయితలను ప్రోత్సహించేందుకు వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అందించాలి. తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్య గ్రంథాలలో ప్రవేశపెట్టాలి. "పరభాషను గౌరవించు, మాతృభాషను ప్రపంచానికి చాటి చెప్పు" అన్న నినాదాన్ని ఇంటింటికి చేర్చాలి. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు విస్తృతంగా కొనసాగాలి. తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిబింబం, జీవన సౌందర్యం ఇంత చక్కని మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం నిత్య నూతనంగా మలచుకోవడం తెలుగు బిడ్డలుగా మన కర్తవ్యం. అప్పుడే తెలుగు వెలుగులు నలుమూలలా విరజిమ్ముతాయి.
- పింగళి. భాగ్యలక్ష్మి
9704725609