Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ భాష కమ్మనంటూ
తీపి మాటలెన్నొచెప్పి
మాతృభాష దినోత్సవమంటూ
అభినందనల ఆనందాలతో
మురిసిపోవుదురు జనం
యేడాదికి ఒక దినం
మాతృభాష పరిరక్షణంటు
నినాదాల హామీలతోపాలకులు
బాధ్యత తీరినట్లు
మరచిపోవుదురు మరునాడు
ప్రభుత్వ ఉత్తర్వులకు సైతం
ఆంగ్ల భాషనే ఆశ్రయిస్తూ
మాతృభాష గొప్పదంటూనే
పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో
చదివించే తాపత్రయం పెద్దలది
ఖర్చెంతైన విషయజ్ఞానంరాకున్నా
పరభాషా మోజులో పడి
మాతృభాష మాధ్యమంలో
విద్యనభ్యసించేవారు
కానరాని రోజు ఎంతో దూరం లో లేదు
ఎమరుపాటులేని యేలికల
లోపభూయిష్ట విధివిధానాలతో
శాస్త్రసాంకేతిక రంగంలో
వైద్య న్యాయ శాస్త్రరంగాలలో
మాతృభాషల ప్రాధాన్యత లేక
తరిగిపోవుచుండె తెలుగు పరిధి
మాతృభాష అమలుకు పాలకుల
కానరాని కార్యశీలత
లోపిస్తున్న చిత్తశుద్ది
ఆదరణలేని హామీలకే పరిమితం
వాడుతున్న భాషే వృద్దిచెందు
వాడుకలో లేని భాష
కనుమరుగవుతుంది
జీవితాన్నిచ్చే భాషే
జీవించి వుంటుంది
కాలగర్భంలో కలిసి పోతున్న
భాషలెన్నో కళ్ళముందే
కనులు తెరచిచూడ
కనబడు నిజాలెన్నో
మాతృభాషాదినోత్సవ
శుభాకాంక్షలతో
పి.రామనాథం
భద్రాద్రి కొత్తగూడెం