Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగత్ సింగ్ ఈ పేరు వినగానే భారతీయ యువకుల గుండెలు ఉప్పొంగుతాయి, గర్వంతో చెయ్యి మీసం మెలిపె డుతుంది. యువత మనసుల్లో అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ మహోన్నత వ్యక్తి, యువకెరటం భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి తన ప్రాణాలను పణంగా పెట్టారు. ధైర్యానికి సాహసానికి నిలువెత్తు రూపం. తనకి ఉన్న దేశ భక్తిని చూసి బ్రిటిష్ వారు కూడా సెల్యూట్ చేసేంతటి గొప్ప మహనీయుడు. బాల్యం నుండి ఆయనకు ఉన్న దేశభక్తిని గురించి తెలిస్తే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనదేశం గర్వించదగ్గ భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని లాహూరుపూర్ జిల్లాలోని బత్కర్ కలాన్ గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి పుణ్యదంపతుల ఇంట కారణజన్మునిగా జన్మించారు.
భగత్ సింగ్ తాత ముత్తాతలు, తండ్రి అందరూ కూడా గొప్ప దేశ భక్తులు. భగత్ సింగ్ తాతగారు అర్జున్ సింగ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ బ్రిటిష్ వారిని ఎదిరించే వారు. ఈ దేశ భక్తి పరాయణతనే భగత్ సింగ్ ఉగ్గుపాలతో అవపోసన పట్టారు. భగత్ సింగ్ కు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎత్తుకొని తన ఫ్రెండ్ నందకిషోర్ మెహతాతో కలిసి కొత్తగా వేస్తున్న తోటను చూడడానికి వెళ్ళినప్పుడు భగత్ సింగ్ ఆ తోటలో చిన్న చిన్న గడ్డిపరకలు, మొక్కలు నాటుతుంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నావురా అని అడిగారు. దానికి సమాధానంగా ఆ బాలుడు తుపాకులు నాటుతున్నా నాన్న అన్నాడు. అది విని వాళ్లిద్దరూ ఆశ్చర్యపోయారు. అందుకే అంటారు "భవిష్యత్తుకు బాల్యమే మొలక" అని. మొలకలు వేసే వయసులో తుపాకుల మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. భగత్ సింగ్ నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ బాబాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాడని బ్రిటిష్ వారు ఆయన్ని పట్టుకుని జైల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన పెరిషియా వెళ్లిపోయాడు. భర్త విదేశాలకు వెళ్లి పోయాడని ఏడుస్తున్న చిన్నమ్మ అరున్ కౌర్ ను ఓదారుస్తూ 'పిన్ని ఏడవద్దు నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా' అని ప్రతిజ్ఞ చేశాడు. అంత చిన్న వయసు నుండి బ్రిటిష్ వారి మీద కసి నరనరానా ఏవిధంగా పెంచుకున్నాడో మనకు ఈ సంఘటనతో అర్థమవుతుంది.
భగత్ సింగ్ కు చదువుల తల్లి కటాక్షం కూడా మెండుగా ఉండేది. పంజాబ్ లోని నవాన్ కోట అనే గ్రామంలోని దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించాడు. చదువుకుంటున్న రోజుల్లో 1919 ఏప్రిల్ లో జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో నూతన సంవత్సరంలో ప్రార్ధనలు చేసుకుంటున్న వందలాది సిక్కుల్ని బ్రిటీష్ అధికారి ఆధ్వర్యంలో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ సంఘటన తో సుమారు వెయ్యి మందికి పైగా చనిపోయారు. ఆ తరువాతి రోజు భగత్ సింగ్ తన తండ్రితో కలిసి వచ్చి ఆ ప్రాంతమంతా చూసే సరికి అతని రక్తం సలసల మరిగిoది. అక్కడి నుండి కొంతమట్టిని ఇంటికి తీసుకు వచ్చి ఒక సీసాలో పెట్టి దేవుని పక్కన పెట్టి రోజు ఆ మట్టిని కూడా పూజించేవాడు. ఇలా తన నరనరానా దేశభక్తి నింపుకున్నాడు.
1923లో లాహోర్లోని నేషనల్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడ చదువుకుంటున్నపుడే భగత్ సింగ్ స్వతంత్ర ఉద్యమం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో చేరాడు. అక్కడ లాలాలజపతిరాయ్ రాజ్ బిహారి బోస్ పరిచయమయ్యారు. అలాగే ఈయనకి మహాత్మా గాంధీ అంటే వల్లమాలిన అభిమానం ఉండేది. అప్పుడే మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపుని చ్చారు. గాంధీ గారు అనుకోకుండా ఈ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఇది భగత్ సింగ్ కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెతుక్కున్నాడు. 1926లో నవ జవాన్ భారత్ సభ అనే లిమిటెడ్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించారు.
1929 లో సైమన్ కమీషన్ భారతదేశంలో అడుగుపెట్టింది. భారతదేశ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలాలజపతిరాయ్ నేతృత్వంలో భారీ ర్యాలీ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడిన లాలాలజపతిరాయ్ కొద్దిరోజులకే చనిపోయారు. ఇలా గాయపరిచిన పోలీస్ ఆఫీసరును భగత్ సింగ్ చంపాలి అనుకొంటాడు. 1928 డిసెంబర్ 17న పోలీస్ ఆఫీసర్ పై కాల్పులు జరుపుతాడు. పొరపాటున కాల్పులు పోలీస్ ఆఫీసర్ కి తగిలి ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఈ హత్య కేసులో బ్రిటిష్ వారు సీరియస్ గా తీసుకోవడంతో సింగ్ పైనిఘా ఎక్కువైంది.
ఆ తర్వాత 1929 లో వైస్రాయి అయినటువంటి లార్డ్ ఇర్విన్ రెండు కొత్త బిల్లులను తీసుకు వచ్చారు 1. పబ్లిక్ సేఫ్టీ బిల్ 2. డేట్ డిస్ప్యూట్ బిల్లు. ఈ రెండు బిల్లుల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజల్ని అణిచివేయడానికి చేసినవేనని భావించారు. ఇందుకు నిరసనగా ఎవరికీ ప్రాణనష్టం జరగకుండా బాంబు పేల్చాలి అని అనుకుంటాడు. ఈ బాంబు పేల్చడం వల్ల ఎవరికీ ప్రాణ నష్టం జరగకూడదు, కేవలం నిరసన మాత్రమే తెలపాలని అనుకుంటాడు. 1929 ఏప్రిల్ 18న భగత్ సింగ్ తన అనుచరులతో కలిసి ఎవరికీ ప్రాణనష్టం జరగకుండా బాంబుని విసిరారు. ఆ వెంటనే పోలీసులకు లొంగిపోయారు. అసెంబ్లీలో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ జైలుకు వెళ్లారు. బ్రిటిష్ వారు ఖైదీలను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. నిరసనగా మిగతా ఖైదీలతో కలిసి భగత్ సింగ్ నిరాహార దీక్ష చేశాడు. చివరికి బ్రిటీష్ వారు సింగ్ డిమాండ్లకు తలఒగ్గారు. దాంతో సింగ్ దీక్ష విరమించాడు.
భగత్ సింగ్ ని జైలు నుంచి విడుదల చేయకుండా ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. గాంధీజీ చంద్రశేఖర్ ఆజాద్ లు సింగ్ ని రక్షించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈయనకు జైలు నుంచి తప్పించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తన మరణం ద్వారా దేశంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ప్రతి ఇంటి నుండి ఒక భగత్ సింగ్ పోరాడే విధంగా రావడం కోసం తన వీరమరణం ఎంతో అవసరం ఉందని ఆయన భావించారు. చివరికి 1931 మార్చి 24న ఉదయం ఏడు గంటలకు భగత్ సింగ్ ను ఉరి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి రెండు రోజుల ముందు నుండే ఈ వార్త దావానలంలా వ్యాపించి దేశం ఉప్పెనలా ఎగసిపడింది. యువకులంతా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రోజు ముందే అంటే1931 మార్చి 23 రాత్రి 8 గంటలకు భగత్ సింగ్ ను ఉరి తీయడానికి రంగం సిద్ధం చేసింది. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు జైలర్ వెళ్లి సర్దార్జీ మిమ్మల్ని ఉరి తీసే సమయం ఆసన్నమైంది, మీరు తయారవ్వండి అన్నారు. అప్పుడు భగత్ సింగ్ జైలు లాకప్ నుండి బయటకు వచ్చి సుఖదేవ్, రాజ్ గురువులతో కలిసి ఉరికంభం వైపు అడుగులు వేస్తారు. భగత్ సింగ్,సుఖదేవ్, రాజ్ గురువులు ఒకరినొకరు హత్తుకొని భారతమాత విముక్తి కోసం అమరులయ్యారు. ఇలా 12 ఏళ్ళకే రక్తంతో తడిసిన నేలని ముద్దాడి శపధం చేసి, 14 ఏళ్ళకే స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టి, 23 ఏళ్లకే దేశం కోసం ఉరితాడుని పూలమాలగ స్వీకరించి తన ధైర్యసాహసాలతో యావద్భారత దేశానికి ఆదర్శంగా చరిత్రలో నిలిచి పోయిన భారతమాత ముద్దుబిడ్డ, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఘన నివాళి.
పింగళి. భాగ్యలక్ష్మి, గుంటూరు,
కలమిస్ట్ రచయిత్రి,
ఫోన్ నెంబర్.9704725609