Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. కారుమబ్బులు ఆవరించిన కఠిక జీవితంలో వెలుగులను ప్రసరింపజేసిన కాంతిమూర్తి స్వాగతం. తననం తననం తననంతా. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..." అనే పాట వినంగానే విద్యాప్రదాత, సాహితీ సృజనశీలి, సేవాతత్పరుడు గాదిరాజు రంగరాజు మాస్టారు గుర్తుకొస్తారు. ఎందుకంటే వీరు కళల కాణాచీగా వెలుగొందుతున్నారు. మనం వీరి కళా, విద్యారంగం, సాహితీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
గాదిరాజు రంగరాజు ఈ పేరు వింటేనే సాహితీ పూతోటలోని పూలన్నీ సాహితీ పరిమళాల్ని వెదజల్లుతూ ఆ ఆ పరిమళాల్ని కళామతల్లి పాదాల చెంతకు తీసుకు వెడతాయి. సేవాతత్పరుడు గా, ఉపాధ్యాయుడిగా, నాటక మరియు సాహితీ పిపాసిగా ఇలా అనేక కళల్లో వీరు అందిస్తున్న సేవలను చూసి భారతమాత సైతం ఆనందంతో పరవశించి పోతుంది. ఇంకా ప్రకృతిమాత సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇలా పంచభూతాలను సైతం పరవశింపజేసే రంగరాజు అందాల హరివిల్లులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ గలగల పారే సెలయేరు, వేదంలా ఘోషించే గోదావరీ నాదీమతల్లికి అతి చేరువలో పశ్చిమ గోదావరి జిల్లా గొల్లలకోడేరులో శ్రీరామరాజు, సీతమ్మ గార్లకు జన్మించారు కమనీయం, రమణీయం రంగ రాజు ప్రతిభాపాటవాలు. సరస్వతీదేవిని తన నాలుక పై శివతాండవం చేయిస్తూ విద్యా రంగంలో అత్యధికంగా నాలుగు పేజీలు, బి.ఇడి., ఎమ్.ఇడి. డిగ్రీలను అత్యధిక మార్కులతో సొంతం చేసుకున్నారు. ఇందు కలరు, అందు లేరు అన్న సందేహము వలదు ఎందెందు వెతికినా రంగరాజు గారే అన్న చందాన వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రవృత్తిగా కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయడం, పుస్తక సమీక్షలు చేయడం, మేకప్ వేయడం, నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా, కార్టూనిస్టుగా వేలాది కార్టూన్లు వేయడం, సేవారంగం ఇలా అనేక రంగాల్లో ప్రతిభను చాటుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్టూన్ వేయడం, కవిత రాయడం చేస్తూ పత్రికల వారి, పాఠకుల ప్రశంసలు పొందుతూ ఇటు వృత్తికి, అటు ప్రవృత్తికి సమన్యాయంచేకూరుస్తూ ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నింటా ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు.
విద్యాప్రదాతగా రంగరాజు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడంలో ఆయనకు ఆయనే సాటి. వీరు చెరుకువాడ ఉంది తోట, చెరువు గట్టుపాలెం పాఠశాలలో అవిశ్రాంతంగా విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడమే కాకుండా, అద్భుతంగా విద్యార్థుల మనసులకు హత్తుకొనేలా వినూత్న రీతిలో పాఠాలు బోధించేవారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎంతో మంది చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వీరి కృషి, పట్టుదల, శ్రమ, అనన్యసామాన్యం. ఇంకా వీరు మధ్యలో బడి మానివేసిన పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తు బడిబాట, బడి పిలుస్తుంది, చదువులతల్లి వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. పాఠశాలకు వస్తూ మధ్యలో చదువు మానేసిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లలు మళ్ళీ బడికి వచ్చేలా కృషి చేశారు. ఇలా ఎంతోమంది విద్యార్థులజీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించి నలుదిశలా ప్రసరింపజేశారు. వీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధానోపాధ్యాయ స్థాయికి చేరుకుని ఎంతో మంది ఉపాధ్యాయులకు కూడా ఆదర్శవంతంగా నిలిచారు.
విద్యా రంగంలో వీరు అందిస్తున్న సేవలు చూస్తుంటే ఓ చక్కని పాట గుర్తొస్తుంది "నూటికో, కోటికో ఒక్కరు ఎప్పుడో, ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నిలిచాడు. జాతే ఆ వెలుగన్నాడు. జాతిపిత, మన జాతిపిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగ నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు, శాంతిదూత, మన శాంతి దూత. ఆ జాతిపిత బాపూజీ, శాంతిదూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో, ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే, మీరే మాస్టారు...." అంటూ విద్యార్థులంతా మాస్టారు మీద అమితమైన అభిమానం పెంచుకుని రంగరాజు మాస్టారు స్కూలు నుండి బదిలీ అయ్యి వేరే స్కూలుకి వెళ్ళినప్పుడల్లా "మాస్టారు మీరు వెళ్లొద్దు మాతోనే ఉండండి" అంటూ విద్యార్థులు కంటతడి పెట్టిన తీరు చూస్తే వారికి విద్యార్థులపై ఉన్న అపారమైన ప్రేమ, విద్యార్థులకు వారిపై ఉన్న భక్తిభావం తేటతెల్లమవుతుంది. ఇటువంటి మానవత్వం మూర్తీభవించిన మాస్టార్ని చాలా అరుదుగా మనం చూస్తుంటాం. ఆ అరుదైన మాస్టారే రంగరాజు మాష్టారు. ఇలా వీరు ఎంతో మంది విద్యార్థుల జీవితాలకి బంగారు బాటలు వేశారు.
సాహితీ మాతకు నీరాజనాలు అర్పిస్తూ ఈ కవి పుంగవుడు నేటి సమాజం తీరుతెన్నులపై మనసుకు హత్తుకొనేలా కుటుంబ నేపథ్యంతో కూడిన అంశాలతో చక్కని కథలు, కవితలు, వ్యాసాలు అనేకం రాశారు. కవితలు అయితే రోజు ఓ చక్కని సామాజిక అంశంతో ఏదో ఒక పేపర్లోనో, పుస్తకంలోనో తప్పక ప్రచురితమవుతుoది. వీరి రచనలన్నీ కూడా ఒక్కసారి చదివితే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేoత ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఇంకా ఈ మానవతావాది చిరునవ్వే వజ్రాభరణoగా ధరించి మానవతా పరిమళాలు వెదజల్లే "ఆకాశమంత అమ్మ, అంతరంగాలు, సామెతల శ్రవంతి" లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి కవితా సంపుటాలను సాహితీ పూతోటలో వీరబూయించిన సాహితీ సృజనశీలి. వీరు పుస్తక సమీక్షలు కూడా చాలా అద్భుతంగా రాస్తారు. అనేక మంది ప్రముఖులు రాసిన సంపుటాలకు సమీక్షలు రాసి చక్కని ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇంకా మీరు కవిత్వంలో అరుదైన రికార్డులు కూడా సాధించారు. శతావధానం, సహస్రావధానం లో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.
ప్రతి ఒక్కరిలో ఒకటి, రెండు కళలు ఉండటం సర్వసాధారణం. కాని అత్యధికంగా అనేక కళల్లో ప్రతిభను కనపరచడం రాజుకే సాధ్యపడింది. ఇలా వీరు అనేక నాటకాలు కూడా రాసారు. రాయడమే కాకుండా అద్భుతంగా తన నటనా కౌశలానికి భాష్యం చెప్పారు. ఈ అపర మేధావి నాటకం జీవితానికి ప్రతిలిపిగా,వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలని నవరసాలను సంధించి నాటకానికి వాస్తవికత ఆపాదించి ఆయా పాత్రలలో ఒదిగిపోతారు. ఇలా రేడియో నాటకాల్లో, టీవీ ధారావాహికల్లో నటించి అద్భుతంగా ఆయా పాత్రలకు న్యాయం చేకూరుస్తు నట విరాట్ గా భాసిల్లుతున్నారు. ఇంకా కళల కాణాచిగా వెలుగొందుతున్న ఈ కళా పిపాసి మేకప్, నటన, దర్శకత్వం, కొరియోగ్రఫీ ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి రేడియో కార్యక్రమాల్లో పాల్గొని హ్యాట్రిక్ సాధించారు రేడియోలో కథలు, కవితలు, నాటకాలు ఇలా పలు అంశాలలో తన ప్రతిభను చాటారు. ఇంకా విద్యార్థులకు రేడియోలో అనేక సబ్జెక్టులలో పాఠాలు బోధిస్తూ అందులోని మెళకువలను సులువైన పద్ధతిలో చెప్పి విద్యార్థుల్ని మెరుపుతీగల్లా తయారు చేశారు. మాస్టారు అంటే గాదిరాజు రంగరాజు మాస్టారే అన్నంత అద్భుతంగా రేడియోలో కూడా పాఠాలు బోధించారు.
ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఇంకా సమకాలీన సామాజిక అంశాలపై కార్టూన్లు వెయ్యటంలో అందెవేసిన చేయి చిన్నతనం నుంచి సొంతంగా బొమ్మలు గీస్తూ, సొంతంగా నేర్చుకుని కార్టూన్ రంగంలో అడుగుపెట్టి కార్టూనిస్టుగా రాణిస్తున్నారు. వేలాది కార్టూన్లు దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ప్రపంచప్రఖ్యాతి చెందిన కార్టూనిస్టు అబూ అబ్రహం ప్రశంసలందుకున్నారు అంటే రంగరాజులోని సృజనాత్మకతను మనం అర్థం చేసుకోవచ్చు. వీరు ప్రముఖ కార్టూనిస్టు బాపు జిల్లా వాసి. అంతర్జాతీయ స్థాయిలో కూడా వీరి కార్టూన్లు చక్కని ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు సూర్య, మరో కిరణాలు, ఉదయం, చట్టం పత్రికలలో వీరి కార్టూన్లు ప్రచురితం అవుతూ అనేక సామాజిక సమకాలీన అంశాలపై అవగాహన కలిగిస్తూ అందర్నీ చైతన్య పరుస్తున్నారు. ఒక్కోసారి సంభాషణలు ఏవీ లేకుండా క్యాప్షన్ లెస్ కార్టూన్లతో అన్ని భాషల వారిని అలరిస్తూ ఉంటారు. కార్టూనిస్టుగా వీరు పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇంకా జాతీయ దినోత్సవాలు, ఎన్.ఎస్.ఎస్ క్యాంపుల్లో, గ్రంథాలయ వారోత్సవాల్లో కూడా వీరి కార్టూన్లు ప్రదర్శింపబడి విద్యార్థులకు కార్డులపై మక్కువ కలిగించారు.
కరోనా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు కరోనా పై అవగాహన కలిగిస్తూ తివాచీపరచినంత అందంగా, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నంత గొప్పగా, ఇంకా చెప్పాలంటే రవివర్మ చిత్రాల్ని మురిపిస్తూ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా తీర్చిదిద్ది కరోనా భూతాన్ని తరిమివేయడంలో చైతన్యం కలిగించి "విశ్వ గురువు ప్రపంచ రికార్డుల సంస్థ' వారి ప్రతిష్ఠాత్మకమైన "కోవిడ్ -19 వారియర్ నేషనల్ అవార్డు"ని కూడా ఇటీవల అందుకొని కార్టూన్ రంగానికే వన్నె తెచ్చిన గొప్ప కార్టూన్ కింగ్.
ఈ సేవా తత్పరుడు తన వంతు సేవలో భాగంగా విద్యాసంస్థలకు, నిరుపేదలకు సహాయం చేశారు. వీరు ఏ పాఠశాలలో పనిచేస్తుంటే ఆ పాఠశాలకు కావలసిన సకల సౌకర్యాలు సమకూరుస్తూ ఆ పాఠశాలను జిల్లాలోనే ప్రథమంగా నిలిపేవారు. లైన్సుక్లబ్ ద్వారా కూడా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఉపాధ్యాయుడుగా అత్యుత్తమంగా సేవలు అందిస్తూనే మండలంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి సేవలు అందించే వారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం, ఇంకా మండలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు, వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి గొప్ప సేవాతత్పరునిగా భాసిల్లుతూ ప్రధానోపాధ్యాయ స్థాయికి ఎదిగారు.
"బహుముఖ ప్రజ్ఞ" అన్న పదం కూడా వీరి ప్రతిభకు తక్కువేమో అన్నంత గొప్పగా అన్నింటా అంటే విద్య, సాహితీ, సేవ, కళా రంగాల్లో పరిమళాలను వెదజల్లుతూ ఈ మహిమాన్విత మూర్తి అవార్డుల పంట పండించడంలో తనకు లేరు వేరెవ్వరు సాటి అన్నంత గొప్పగా అవార్డులను సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు + బంగారు పతకం, 'ఐ టాప్ సంస్థ' వారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జన్మభూమి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, లయన్స్ క్లబ్ వారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, నన్నయ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జనాభా లెక్కల సేకరణలో సిల్వర్ మెడల్, జన్మభూమి పోటీల్లో మూడు గోల్డ్, రెండు వెండి పతకాలు అందుకున్నారు. ఇంకా ఉగాది పురస్కారాలు, ఐదుసార్లు జీవిత సాఫల్య పురస్కారం, సాహిత్యంలో దివాకర్ల వెంకటావధాని అవార్డు, సరిగమ కళాపరిషత్ వారి అవార్డు, కళాలయ వారి అవార్డులతో పాటు లెక్కకు మిన్నగా ప్రశంసాపత్రాలు కూడా అందుకొన్నారు. ఇంకా నాటకరంగంలో ఉత్తమ నటుడి అవార్డు, విజయనగరం నంది నాటకోత్సవాల్లో ప్రత్యేక బహుమతులు, రాష్ట్రంలోని అనేక నాటక పోటీల్లో పాల్గొని లెక్కకు మిన్నగా బహుమతులు అందుకొని అవార్డులకె వన్నెతెచ్చిన గొప్ప ప్రతిభ మూర్తి. వీరు ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పాల్గొని పలువురి ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఈ సేవా తత్పరుడు, విద్యాప్రదాత నాటకరంగంపై ఉన్న మక్కువతో మైసూర్ యూనివర్సిటీలో నాటకరంగంపై పి.హెచ్.డి. చేస్తూ త్వరలో "డాక్టర్ గదిరాజు రంగరాజు" గా రూపాంతరం చెందబోతు నాటక రంగంలో కూడా జిలుగు వెలుగుల్ని విరాజీమ్ముతున్నారు. ఇలా వీరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినా, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా చక్కని గుర్తింపు పొందిన వీరిని చూస్తుంటే ఓ చక్కని పాట గుర్తొస్తుంది . "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది . అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది..." అన్న పాటలోలాగా రంగరాజు పెద్దల పట్ల గౌరవ భావం, పిల్లల పట్ల అభిమానం ధనం కురిపిస్తూ ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ వుంటారు. మానవతా విలువలకి అద్దం పడుతున్న ఈ సేవా తత్పరుడు, సాహితిపిపాసి, ఉపాధ్యాయ రత్న ముందు ముందు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తూ సాహితీ, కళారంగాలకు మరింత వన్నెతెస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డ గాదిరాజు రంగరాజు మాస్టారు పున్నమినాటి చంద్రునిలా వెలిగిపోవాలని కోరుకుంటూ మీ సేవకివే మా శతకోటి వందనాలు.
పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు.
కలమిస్టు రచయిత్రి
ఫోన్ నెంబర్.9704725609