Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు వెనుకబడిన బడుగు జీవుల గడ్డ...
- నేడు వెలుగు నిచ్చే పుస్తకాల అడ్డ....
ఈ 20 ఏండ్ల కాలంలో ఎన్నో సమావేశాలకు హాజరయ్యాను. కానీ, అత్యంత సంతృప్తినిచ్చింది మాత్రం నాగర్ కర్నూలు జిల్లా రుక్మద్దీన్ గడ్డలోని ఫూలే - అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావడమే. సమాజంలో అత్యంత వెనుకబడిన బేడ,బుడగ సామాజికవర్గానికి చెందిన చెన్నయ్య, చందు, శంకర్, వెంకటేష్ మరి కొంతమంది విద్యావంతులైన యువకులు ముందుకు వచ్చి
ఈ గ్రంథాలయ స్థాపనకు పూనుకున్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఒక గొప్ప కార్యక్రమానికి నడుంబిగించారు.
సినిమాలు లేని నాటి కాలంలో ప్రజలను తమ హరికథలు, బుర్రకథలు, ఆటపాటలతో ఆనందింపజేసిన బేడ, బుడగ, జంగాలు రానురాను సినిమాల ప్రభావంతో తమ కళకు ఆదరణ కోల్పోయారు. నాటి నుండి సరైన జీవనోపాధి లేక వీధుల్లో భిక్షాటన చేస్తూ దుర్భరమైన జీవితాలను గడిపారు. నాడు బుర్రకథలు, హరికథలు చెప్పే కళాకారులు నేడు సమాజంలో భిక్షగాళ్ళుగా, అంటరాని వారిగా ఊరికి దూరంగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఆది కళాకారులుగా రాజులను సైతం మెప్పించిన కళాకారులు, నేడు కకావికలమైన బ్రతుకులతో సమాజంలో నిరక్షరాస్యులుగా, విజ్ఞానానికి దూరంగా అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్నారు. తరాలు మారినా తలరాతలు మారని తమ జీవితాలను మార్చేవారు లేక దీనంగా, దిక్కులేక ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురైన జీవితాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉన్నది.
ప్రపంచం నానాటికీ సరికొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి పథం వైపు దూసుకెళుతోంది. బేడ, బుడగ, జంగాల మాత్రం దానికి దూరంగా మూఢనమ్మకాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ విద్యాభివృద్ధికి దూరంగా చైతన్యం లేక జీవిస్తున్నారు. అంధకారంలో ఉన్న ఆ జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలిగించినడానికి, అచేతన స్థితిలో ఉన్న ఆ బతుకుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా
ఫూలే - అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (గ్రంథాలయం) ఏర్పాటు చేసి, రోజు సాయంత్రం విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ, వారానికోసారి అక్కడి నిరక్షరాస్యులైన మహిళలకు,పెద్దలకు చదువు నేర్పడమే కాకుండా వారిని విజ్ఞానవంతులులను చేయాలన్న ప్రయత్నం తో ముందుకు సాగుతున్నట్లు చెన్నయ్య, చందు, శంకర్, వెంకీలు తెలిపారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలను చైతన్యం చేయడానికి చుట్టుపక్కల మారుమూల గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఆ గ్రామాలలోని ప్రజలను విజ్ఞానవంతులను చేసి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఉన్నారు.ముఖ్యంగా తన సమయాన్ని, శ్రమను సమాజం కోసం వెచ్చిస్తున్న చెన్నయ్య లాంటి సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.లీడ్ ఫౌండేషన్ తరపున వీరికి 100 పుస్తకాలు మరియు 10 కుర్చీలను అందించాము.ఈ కార్యక్రమంలో నాతోపాటు అతిథులుగా విచ్చేసిన వాణి గారు ఎన్నో విలువైన పుస్తకాలను, నల్ల బాబు గారు ఇంటింటికి ఒక అంబేద్కర్ చిత్రపటాన్ని అందించారు. రిటైర్డ్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ శివశంకర్ గారు వార పత్రికలను సమకూర్చారు.
నర్సంపేట లోని లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికే కొన్ని గ్రంధాలయాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పల్లెలో కూడా గ్రంథాలయాలు విలసిల్లేలా ప్రజలు ముఖ్యంగా యువత ప్రయత్నం చేయాలి. 'గల్లీ గల్లీకి ఓ గ్రంధాలయం' ఉండేలా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలి. పేదరికంపై, వెనుకబాటుతనం పై యుద్ధానికి అక్షరాలనే ఆయుధాలుగా వాడాలి!
ఈ గ్రామ యువకుల ప్రయత్నం ఎందరికో స్ఫూర్తినివ్వాలని, పుస్తక దాతలు, విద్యావంతులు తమ వంతు సహాయం అందించవలసిందిగా కోరుకుంటూ వారికి అందరి తరపున శుభాకాంక్షలు!
- కాసుల రవికుమార్
కవి, ఉపాధ్యాయుడు,
ఫౌండర్: లీడ్ వెల్ఫేర్ సొసైటీ,
లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ,
నర్సంపేట, 9908311580