Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జగ్గి పాలు దొర్కుతయని పాలమూరున్నరంటా
పస్తులుండేటోల్ల నోట్ల్కే గంజి కరువని ఎవర్కి ఎరుకలే
జాగల పెద్దజిల్లైనా
జానేడు పొట్టకోసం కస్టం రెక్కలుకట్టుకొని
కోసులు దూరం ఎగిరెల్లే వలసపక్సులం
చరిత్ర నిర్మించుకున్న కోటలెన్నున్నా
కరువుకి,కూటికి కంచెలే లేవు
దక్షిణకాసి, ఐదవ పీఠం అంటుండ్రుకాని
అభివృద్ధి నోస్కోని గుడికి గునపాలే గుచ్చుతుండ్రు
పట్టుసీరలు చేనేత బట్టలకు పేరెట్టిన నారంపేట,రాజోలిలున్నా
పేగులని దారాలుగా చేసి ఆకలి చీర అల్లినోడికి
ఆసరా పింఛనొక్కటే దిక్కాయే
ముసల్దైనా పిల్లల మర్రి అవ్వకి ఊతకర్ర సేతికిచ్చే మనుమండ్లే కరువయ్యే
కోహినూరు,గోల్కొండ వజ్రాలకి పుట్టిల్లైనా
మెట్టింట్ల కష్టాన్ని మోస్తూనే ఉంది
సుట్టూ నీళ్లున్న వచ్చిన సుట్టం నోట్లోకి సుక్క నీళ్లులేకపాయే
యాసంగోస్తే వోరాల మీద ఒంటికాలినడక
వోగులోని శాన్స బాయి గూడా నీళ్లు లేక ఏడ్సినా ఆ కన్నీళ్లను
ఎత్తుకొచ్చే కడవకే ఎరుక ఆ ఎత
గొంతెండుకుపోయినా వాగు గూడా
సెలిమెలు తోడుకుంటది
రాష్ట్రం రాకముందు నిప్పురవ్వలైనోళ్ళు
వొచ్చినాక ఆశల దీపాలను ఆర్ద్రతతో ఎలిగించుకున్నోళ్ళు
అంతా ఎరుకయ్యాక కవిత్వాన్ని ఆయుధంగా చేస్కునోళ్ళు
డప్పుల్ల్తో,సప్పుల్ల్తో చైతన్యం నింపుతున్నోళ్ళు ఎందరో
ఎన్ని జిల్లాలై చీలినా
మేమంతా పాలమూరు బిడ్డలమే
మర్రిచెట్టు కింద
ఊడల్లా ఊగుతున్నోల్లమే
ఏండ్ల చరిత్రని ఎనకాలేసుకున్న నా పాలమూరు ఏన్కో ఇంకా ఎనకబడే ఉంది
ఇసుమంతైనా ఇస్వాసామున్నోళ్ళు ఎవ్వలైనా ఇడుపుకి దీపం పెడ్తరని తల్పేన్క తొంగిచూస్తుంది
కూనమున్నోళ్ళు ఎవరైనా కందీలు పట్టుకోస్తారని కన్నీళ్లతో ఎదురుసుస్తూనే ఉంది
యాదుంచుకున్నోళ్ళక్కటే ఒక వలస పద్దెం పాడిపోతుండ్రు
- పి.సుష్మ
సోమేశ్వర్ బండ, మక్తల్, పాలమూరు
9959705519