Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెనడా: ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న ప్రతీక పై మా కెనడా తెలుగు తల్లి నెలకొల్ప బడింది. నలభైకి పైగా కళాకారులు అంకిత భావం తో ఉగాది సందర్భంగా తొమ్మిది గంటలకు పైగా సభ వైభవంగా జరిగింది.
జానపద గేయగానం, సాహిత్య ప్రసంగాలు, కవి సంగమం, కథా సమయం, సరదా క్విజ్ వంటి అనేక వైవిధ్యం ఉన్న సభలతో కళకళలాడిండి. కెనడాలో సరోజ కొమరవోలు 1985లో తెలుగుతల్లి పత్రిక విత్తనం నాటారు. లక్ష్మి రాయవరపు వారి టీం నిరంతర కృషితో వట వృక్షంగా ఎదిగి కెనడా వాసులకు సాహిత్యం లో కొంగు బంగారమైంది.
ఇంకా ఎన్నో తెలుగు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే మంచి తలంపుతో తెలుగుతల్లి కెనడా, టొరాంటో తెలుగు టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సాహితీ సభ అత్యంత వైభవంగా తొమ్మిది గంటలపాటు సాగింది. సీనియర్ సాహితీ నిధులని, సంగీత విద్వాంసులని, సీనియర్ రచయితలని, సీనియర్ కవులని యువత కి పరిచయం చేసే లక్ష్యం నెరవేరిందని తెలుగుతల్లి ఎడిటర్ శ్రీమతి లక్ష్మి రాయవరపు తెలియ చేసారు. కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువతలో ఉన్న ప్రతిభని చూపేందుకు ఈ కార్యక్రమం అద్దంలా పనిచేసిందని టొరాంటో తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సర్దార్ ఖాన్ ఆనందించారు. పెద్దలని ప్రేరణగా తీసుకుని అనేక కవితలు, కథలు వ్రాయాలనుందని కార్యక్రమంలో పాల్గొన్న యువతీయువకులు ఆశాభావం వ్యక్తం చేసారు. ఆట పాటలతో తొమ్మిది గంటల సభ అలుపెరగక సాగిందని దాదాపు వంద మంది ఆహూతులు తెలియచేసారు. ఈ కార్యక్రమం చరిత్ర సృష్టించిందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.