Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ ఆధునిక వైతాళికుడు, నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు, అణగారిన వర్గాలను అగ్రవర్ణాల నుంచి కాపాడిన మహాత్ముడు. 150 ఏళ్ళ క్రితమే స్త్రీ విద్య కోసం ఆలోచించిన మేధావి. కుల నిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన విప్లవకారుడు. బడుగు బలహీన వర్గాలను చైతన్య పరిచిన విప్లవజ్యోతి సామాజిక సమస్యలపై ఉద్యమం చేసిన వీరుడు, ధీరుడు. ఈ బలహీనవర్గాల ఆశాదీపం జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. 1834 నుండి 38 వరకు మరాఠీ పాఠశాలలో చదివారు. తండ్రి గోవిందరావు పూల వ్యాపారం చేసేవారు. ఆ పూల వ్యాపారం వల్ల జ్యోతిరావు ఇంటి పేరు 'గోలే' నుంచి 'పూలే' గా మారింది. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవారు ఇలా వ్యవసాయం చేస్తూనే 1841లో స్కాటిష్ మిషన్ విద్యను పూర్తి చేశారు.
ఈయన చిన్నతనంలోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం ఆయనను బాగా ప్రభావితం చేసింది. ఆ పుస్తకం ప్రభావంతోనే పూలే ఆలోచనా విధానం మారింది. సమాజాన్ని భిన్న కోణంలో చూడటం ప్రారంభించారు. కుల వివక్ష మతోన్మాదంపై పోరాటం ప్రారంభించారు. స్వాతంత్ర్యాని కంటే ముందు దేశాన్ని రక్షించాలనే సంకల్పం బలపడింది. సామాజిక సమస్యలపై తిరుగుబాటు చేసిన తొలి కాంతి దర్శకుడు పూలే. పూలేకు 13 ఏళ్ళ వయసులోనే సావిత్రితో వివాహం జరిగింది. వీరు స్త్రీకి విద్య కావాలని ఆలోచించిన మొదటి భారతీయుడు. సమాజంలో తన భార్యను విద్యావంతురాలుని చేశాడు. అంతేకాదు ఆమెలో పోరాట స్పూర్తిని తీసుకురావడంలో ఒక చరిత్ర సృష్టించారు. 1858 లో మొట్టమొదటి బాలికల పాఠశాల పూణేలో ప్రారంభించారు. అణగారిన వర్గాలకు విద్య నేర్పించేందుకు ఎవరు ముందుకు రానందున తన భార్య సావిత్రిబాయి పూలే తో పాఠాలు చెప్పించిన ఘనత పూలేది. ఏ అక్షరానికి అయితే దళితులను దూరంగా ఉంచారో వారికి అక్షరాలు నేర్పించి గొప్ప విద్యావంతులుగా తీర్చిదిద్దారు. భారతదేశంలో దళితులకు పాఠశాల పెట్టిన ఘనత కూడా వీరిదే. విద్యతోపాటు సామాజిక రుగ్మతల కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ వచ్చారు.
జ్యోతిరావు పూలే బడుగు బలహీనవర్గాల ఆశ దీపం. భారతదేశం పునాదిలో కూరుకున్న అగ్రకులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన గొప్ప ఆలోచనాపరుడు. పూలే పుట్టేనాటికి భారతదేశం అనేక సామాజిక అసమానతలకు నిలయంగా ఉంది. అందుకే పూలే మతోన్మాదంపై నిరంతరం పోరాటం చేశారు. పూలే పోరాట పటిమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. పూలే 18 ఏళ్ల వయసులోనే రాయడం ప్రారంభించి గొప్ప కలం యోధుడయ్యాడు. 1858లో మరాఠీలో 'తృతీయ రత్న' ఆ తర్వాత 'గులాంగిరి' హిందీ సాహిత్యంపై అద్భుతంగా రచనలు ఆవిష్కరించారు. వర్ణాశ్రమ చారిత్రక మూలాలను వెలికి తీసి హేతుబద్ధంగా తన సమకాలీన స్థితిగతుల్ని ఆవిష్కరించింది "గులాంగిరి" రచనే. ఆయన పురాణాలు అన్నింటినీ తిప్పి రాశారు. వేదాలకు కొత్త భాష్యం చెప్పారు.
1873లో పూలే స్థాపించిన "సత్యశోధక్ సమాజ్" అంటరానితనాన్ని సమాజం నుంచి వెలి వేయడానికి కృషి చేసింది. జనం చేత "మహాత్మా" అనే బిరుదు పొంది మహాత్మ జ్యోతిరావు పూలే అయ్యారు. సమన్యాయ సత్య సోదరుడైన పూలేను 1888లో "మహాత్మా" అనే బిరుదుతో సత్కరించారు. ఇంకా వీరు ఆనాటి సమాజంలోని వితంతు పునర్వివాహాలను చైతన్య పరిచారు. తానే స్వయంగా పునర్వివాహాలు జరిపించారు. సమానత్వం, స్వేచ్ఛా ఐక్యమత్యంతో కూడిన సమాజాన్ని కోరుకున్నారు. ఈ మహనీయుడు సమన్యాయ సత్య శోధకుడు సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే 1890 నవంబరు 28న పరమపదించారు. పూలే జీవితం నేటి తరo ఆదర్శంగా తీసుకొని ఆయన సూచించిన బాటలోనే అందరూ పయనించాలని కోరుకుంటూ ఈ సత్యశోధకునికి ఘన నివాళి.
-- పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు.
కాలామిస్టు, రచయిత్రి
9704725609l