Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి భాగ్యలక్ష్మి
కాలమిస్టు, రచయిత్రి
గుంటూరు, 9704725609
డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ వ్యాఖ్యాత. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, గానగంధర్వుడుని అందరూ ముద్దుగా 'బాలు' అని పిలిచే ఎస్పీ బాలు గారు 1946 జూన్, 4న నెల్లూరు జిల్లాలోని కోనెటమ్మ పేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ పుణ్య దంపతుల ఇంట సంగీత సరస్వతి వరాల పుత్రునిగా జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో వీరికి చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి మెండుగా ఉండేది. ఇంకా హార్మోనియం, ఫ్లూటు తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తనే సొంతంగా వాయించడం నేర్చుకున్నారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. ఇలా చదువు కొనసాగిస్తూనే వేదికల మీద పాటలు పాడుతూ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు.
1966 లో పద్మనాభం నిర్మించిన 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రంతో ఆయన సినీ గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇలా మొదలైన వీరి సినీ ప్రస్థానంలో అనేక అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అనేక భాషల్లో పాడారు. చాలామంది నటీనటులకు వారి నటనా శైలి కి, హావభావాలకు అనుగుణంగా పాటలు పాడే వారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. వీరు తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. ఆ తర్వాత అనేక ఇతర భాషల్లో కూడా అతిధి పాత్రలో నటించారు. ప్రేమికుడు, పవిత్రబంధం, రక్షకుడు, ఆరో ప్రాణం, ధీర్ఘ సుమంగళీభవ చిత్రాల్లో అద్భుతంగా తన నటనా కౌశలానికి భాష్యం చెప్పారు. అలాగే 2012లో ఆయన నటించిన 'మిథునం' సినిమాకు ప్రత్యేక నంది బహుమతి లభించింది. కమలహసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమినీ గణేషన్, గిరీష్ కర్నాడ్, రఘువరన్ లాంటి ఎందరో ప్రముఖులకు గాత్ర దానం చేశారు. సంగీత దర్శకునిగా కన్యాకుమారి చిత్రంతో ప్రారంభించి 40 చిత్రాలకు సంగీతాన్ని అందించి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. తన సినీ ప్రస్థానంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 1981 ఫిబ్రవరి 8న కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకంగా ఇరవై ఒక్క కన్నడ పాటలు పాడి అరుదైన రికార్డు సృష్టించారు.
పదాల మాధుర్యాన్ని గమనించి వీరు చేసే ఉచ్చారణ, వీరి పాటను పండితుల నుంచి పామరుల దాకా అందరినీ చేరువ చేసింది. బాలు పాటల పూతోటలో 25 సార్లు నంది అవార్డును అందుకొని సినీ రంగానికి వన్నె తెచ్చారు. ఇక బుల్లితెరపై పాడాలని ఉంది, పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించి ఎంతో మంది గాయనీ గాయకులను సినీ కళామతల్లికి కానుకగా ఇచ్చి రుణం తీసుకున్నారు. సినీప్రపంచాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 2020 సెప్టెంబర్ 25న సినీ కళామతల్లి పాదాల చెంతకు చేరారు.