Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా|| కందేపి రాణీప్రసాద్
98661 60378
“ అమ్మా ఆడుకోవటానికి వెళ్తున్నా బై ” అంటూ అనురాగ్ తుర్రున బయటకు పరిగెత్తాడు. “ సరే ఒక్క గంటలో వచ్చేయి” అని చెప్పి వాని ఇంటి పనిలో మునిగి పోయింది. ఆదివారం వచ్చిందంటే ఎక్కడలేని పని అంత మీద పడుతుంది. పిల్లలు ఆటలని వాళ్ళ లోకంలో వాళ్ళుంటేనే ఇంత పని చేసుకునేది తను. భర్త హాయిగా టివి చూడటంలో మునిగిపోయాడు. ఈయన పని హాయి అనుకుంటూ వాని వంటింట్లోకి పోబోతుంటే “ కొంచెం కాఫీ ఇవ్వు” అనే భర్త మాట వినిపించింది. కాఫీ పెట్టి కప్పు తీసుకొని హాల్లోకి వస్తుండగా బయట నించి గోల వినిపించింది.
అనురాగ్ ఏడుస్తూ వస్తున్నాడు. వాడిని పట్టుకొని నలుగురైదుగురు పిల్లలు తీసుకొస్తున్నారు. వాణి, భర్త రాజేష్ కాఫీ కప్పులక్కడ పడేసి ‘ఏమైందిరా’ అని ఆదుర్దాగా అడిగారు. “ అంటీ అనురాగ్ ను కుక్క కరిచింది. మేమందరం అరుస్తున్నా వదిలి పెట్టలేదు. గట్టిగా కొరికింది. రక్తం కారిపోతుంది ఆంటీ” అంటూ ఆరిందాలా అన్నీ విషయాలు చక్కగా చెప్పాడు ఎదురింటి ప్రియంక్, వాణి అనురాగ్ కాలు వంక చూసింది. కాలుకు రక్తం కారుతోంది. కండ ఊడి వచ్చింది. వాణి భయపడుతూ హాస్పిటల్ కు వెళదాం పదండి అంటూ భర్త వంక చూసింది. రాజేష్ అనురాగ్ కాలును శుభ్రంగా తుడుచి ఒక బట్ట కట్టాడు. అనురాగ్ ఏడుస్తునే ఉన్నాడు. కాసిని చల్లటి నీళ్ళు తాగించారు. ఒక అరగంటకు తేరుకున్నాడు అనురాగ్. మళ్ళీ వాణి అడిగింది భర్తని “ హాస్పిటల్ కు తీసుకు వెళ్దామండి” అన్నది. “ ఇవాళ ఆదివారం కదా ఏ ఆసుపత్రి ఉండదు వాడిని రేపు తిసుకెళదాంలే” అన్నాడు. ఎదో ఒక హాస్పిటల్ తెరిచే ఉంటుంది కదండీ అన్నది వాణి. “ ఎక్కడని వెతుకుతం అన్ని మూసే ఉంటాయి. రేపు వెళ్ళచ్చు ఈ రోజు వాడికి నొప్పి లేకుండా బ్రుఫెన్ టాబ్లెట్ వెస్తాన్లే” అంటూ నిమ్మళంగా చెప్పాడు రాజేష్.
వణికి భయంగా ఉన్నా భర్త మాటకు ఎదురు చెప్పలేక ఊరుకున్నది. పిల్లవాడు నొప్పి తగ్గేదాకా వెక్కుతూనే ఉన్నాడు. రాత్రికి నిద్రపోయాడు ఎలాగో. తెల్లవారి లేచిందగ్గర నుంచీ భర్త వెంట పడుతూనే ఉన్నది ఆసుపత్రికి వెళదామని. ఆఫీసు కెళ్ళి చెప్పి వస్తానని వెళ్ళాడు. చివరకు మద్యాహానికి వచ్చి అప్పుడు తీసుకువెళ్ళాడు హాస్పిటల్ కు హాస్పిటల్ లో చాల మంది ఉన్నారు. వీళ్ళ వంతు వచ్చే సరికి 3,4 గంటలు పట్టింది.
డాక్టరు దగ్గరకు వెళ్ళాక సమస్య ఏమిటని అడిగితే కుక్క కరిచిందని చెప్పారు. “ ఎప్పుడని అడిగాడు డాక్టరు నిన్న కరిచింది “ డాక్టర్ ఆదుర్దాగా అన్నది వాణి ఏమైనా ప్రమాదమేమో అని భయపడుతూ.
‘నిన్న ఎందుకు రాలేదు’ అని డాక్టరు అడుగుతూ పిల్లవాడి గాయాన్ని పరిశీలించాడు. గాయం సమస్య కాదు కుక్క కరవటమే ప్రమాదం. “ మీకు కుక్క కరిస్తే ఇంజక్షన్లు వేయించాలని తెలియదా” అన్నాడు డాక్టరు. “తెలుసు కానీ అని నుసుగుతూ నిన్న ఆదివారం కదా హాస్పిటల్ ఉండదని” అన్నాడు రాజేష్. డాక్టర్! కుక్క మంచిదే అన్నాడు రాజేష్.
డాక్టర్ వాళ్ళిద్దరితో ఇలా అన్నాడు. కుక్క మంచిదైనా దానిలో వైరస్ ఉండవచ్చు. మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇంజక్షన్లు వెయ్యాలి. ఇదివరకటి రోజుల్లో అయితే బొద్దు చుట్టూరా 14 ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త మందులు వచ్చాయి. ఇప్పుడు మొదటి రోజు, మూడవ రోజు, ఎడవ రోజు, పద్నాలుగో రోజు, ఇరవై ఎనిమిదో రోజు ఇంజక్షన్లు ఇవ్వాలి. అంటే కేవలం ఐదు డోసులు మాత్రమే ఇస్తే సరిపోతుంది.
ఎప్పుడైనా కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీటిలో బాగా రుద్ది కడగాలి. నాలుగైదు సార్లు ఇలా కడిగి అప్పుడు డాక్టర్ వద్దకు రావాలి. రోడ్డు మీద వెళ్ళేటపుడు కుక్కల్ని గమనించుకోవాలి. పెద్దవాళ్ళు పిల్లలకు ఇలాంటి జాగ్రత్తలు చెపుతూ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం మీలాగా నిర్లక్ష్యం చెయ్యకూడదు. పిచ్చి కుక్క కాదులే అని అశ్రద్ధ చేయకూడదు. ఒక్కసారి రేబిస్ వ్యాధి వచ్చిందంటే మరణమే తప్ప మార్గం లేదు. మందు లేని జబ్బును ఎంతో జాగ్రత్తగా నివారించాలి. టీకా ఇవ్వటమే మార్గం ఇప్పటికైనా వచ్చారు సంతోషం. ఈ రోజు ఇంజక్షన్ వేస్తాను. మరల మూడో రోజు రావాలి. అలా నేను చెప్పిన తారికులన్ని మరచి పోకుండా రండి. నేను ప్రిస్క్రిప్షన్ మీద ఆ రోజులు ఏయే తారికుల్లో వస్తాయో రాసిస్తాను. పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లవాడికి ఇంజక్షన్ వేసి పంపాడు డాక్టర్.