Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాకి బట్టలు వేసుకోవడం అంటే
ప్రజలకు కవచమై పోవడమే
మరణ మృదంగాలమధ్య
జీవితాన్ని గడపడమే
కర్కశమైన బూట్లు
కాళ్లకు తొడుక్కోవడమంటే
నీది నాది అన్న తారతమ్యం మరచి
చెడును ఆనవాళ్లు లేకుండా
తొక్కివేయడమే
పెట్టుకున్న టోపీ కిరీటం కాదు
ఏనాడు కుటిల ఆలోచనలు
మెదడులో చేరకుండా రక్షిస్తున్న
ఆశయాల ఆశీస్సు
బిగించిన బెల్టు కాళ్ళలో ఉన్న శక్తికి....
హృదయంలో ఉన్న కరుణను
అనుసంధాన పరిచే ఉపకరణమే కాదు
ఛాతిని పొంగించి
సమాజపు వెన్నెముకను
నిటారుగా నిలబెట్టే సంసిద్ధతను
అందించే ప్రాణశక్తి
భుజాలపై నక్షత్రాల మెరుపులు
మీరు కాపాడుతున్న ప్రజల ఆకాంక్షలు
చేతిలో లాఠీ... తుపాకి
ఆపదలను రూపుమాపే బ్రహ్మాస్త్రాలు
మీరు చేసే కవాతు క్రమశిక్షణా ప్రవాహం
కాఠిన్యం మీ ఉద్యోగ మార్గం
చట్టాల అమలు మీ హృదయ స్పందనం
ఠాణాలు... కోర్టులు... జైళ్ళు శాంతి కేదారాలు
అక్కడ న్యాయం పండాలంటే
సత్య బీజాలు నాటాల్సింది మీరే
నగరం నడిబొడ్డులో అయినా...
పల్లెల ప్రాంగణంలో అయినా....
అడవుల అంతరంగంలో నైనా...
జంకు గొంకులే కాదు....
స్వార్థం పక్షపాతం లేకుండా
ఆయుధాలు ధరించిన హంసలై
ధర్మాన్ని కాపాడడమే మీకు దరహాసం
అసిధారావ్రతమై సాగే మీకు
సమాజమే కుటుంబం
మీ కుటుంబాలకు మీ ప్రస్థానమే గర్వకారణం
విధి నిర్వహణలో మీ అమరత్వం
కలలో కూడా కోరుకోకూడనిది
అమరత్వం అనివార్యమైనప్పుడు
దేశమే గంభీరంగా నిలబడి సెల్యూట్ చేస్తుంది
దేశ పతాకమే వినమ్రంగా చేతులు జోడిస్తుంది
- ఘనపురం దేవేందర్లి
(పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కవిత)