Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మంచి మాట'ల కవి డా. సామల సదాశివ
'సదాశివ' ఈ పేరు స్మృతి పథంలోకి రాగానే తెలుగు వారికి ఉర్దూ, తెలుగు సారస్వతాల వారధిగా నిలిచిన మహా మేరు పర్వతం మన కళ్ళ ముందు నిలుస్తుంది. ముచ్చట అనే పదానికి 'ఆక్స్ఫర్డ్' డిక్షనరీలో అర్థం రాయాల్సొస్తే సదాశివ అన్న పేరు రాయాల్సి వస్తుంది. తెలుగు కస్ళీకు ఉర్దూ, ఫారసీ సాహిత్య వెలుగులను చూపించిన డాక్టర్ సామల సదాశివకవి, రచయిత, విమర్శకులు, అనువాదకులు.
'సదాశివ సార్'గా పిలుచుకునే సామల సదాశివ 11 మే 1928న నిన్నటి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా, కాగజ్నగర్ సమీపంలోని లోని తెనుగుపల్లెలో పట్టారు. తండ్రి నాగయ్య పంతులు వద్ద భారత, భాగవత, రామాయణాలు చదువుకున్న సదాశివ బడిలో ఉర్దూ మీడియంలో చదివి, మరో గురువు వద్ద అరబ్బీ నేర్చుకున్నారు. వరంగలులో మెట్రిక్ చదివి స్వంత జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాహిత్య వ్యాసంగం కొనసాగించారు. వీరి తొలి కృతి 'ప్రభాతము' వచ్చింది. తరువాత పిల్లల కోసం రాసిన పద్య కృతి 'మంచి మాటలు' రెండవ రచన. 'ధర్మ వ్యాధుడు', 'విశ్వామిత్రము', 'అంబపాలి' ఇతర పద్య కృతులు. అమ్జద్ రుబాయీలను తేటగీతిలో తెలుగువారికి అందించిన సదాశివ తరువాత 'ఫారసీ కవుల ప్రసక్తి', 'గాలిబు జీవిత చరిత్ర', 'ఉర్దూ సాహిత్య చరిత్ర' మొదలగు పుస్తకాలు రాశారు. గీటురాయి, మిసిమి, సియాసత్ మొదలగు పత్రికల్లో ఉర్దూ, ఫారసీ సాహిత్యం గురించి, హిందుస్థానీ సంగీతంలో శిఖరాయ మానంగా వెలిగిన ప్రతిభామూర్తుల గురించి రాసిన వ్యాసాలు ఇప్పటికీ పాఠకుల మదిలో మెదలుతాయి. 'మలయ మారుతాలు', 'యాది', 'స్వర లయలు' వీరికి మిక్కిలి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రచనలు. ఇవేకా 'కేశవ సూత్' జీవిత చరిత్ర మరాఠీ నుండి అనువాదం చేశారు. 'స్వరలయలు' గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది.
సదాశివ రాసిన బాల సాహిత్యంలో తొలి రచన 'మంచి మాటలు', ఇది నలభయ్యవ దశకంలో చేసిన రచన. 'విద్యార్థులారా!' అంటూ చిన్నారి పొన్నారి బాల బాలికల కోసం మంచిమాటలు చెప్పిన సదాశివ సారు 'కోడికూతతో నిద్ర మేల్కొనవలయును / కార్యములు దీర్చికొనుము సకాలమందు / స్నాన మొనరించి, తలదువ్వి, చదువుకొమ్ము / అమ్మ అన్నంబుతిందు రమ్మనువఱకును' అని చెప్పినా, 'మతము, మతమని మూడాభిమాన మొసగ / నొరులమతముల ద్వేషించు టొప్పుగాదు- / మతములన్నిటి దొక్కటే మార్గమనియు / దేవుడొక్కడే యనియును దెలియుమయ్య' అని పలికినా అది వారికే చెల్లింది. చక్కని తేటగీతి పద్యాలతో సదాశివ కూర్చిన ఈ మంచిమాటలు బాలలకు ఆయన అందించిన తాయిలం.
ఉపాధ్యాయునిగా, పాఠశాలల ఇన్స్పెక్టర్గా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన సదాశివ వివిధ భాషలలోని బాలగేయాలను అనువాదం చేశారు. 1972 నుండి పాఠ్య పుస్తక రచయితగా అనేక బాలల రచనలు చేశారు. 1972లో ఐదవ తరగతి, 1982లో ఏడవ తరగతితో పాటు ఇతర తరగతులకు వీరు ఒక్కరే పూర్తి పాఠ్య పుస్తకాన్ని రచించారు. పిల్లల్లో స్ఫూర్తిని, ఉత్తమ విలువలను పెంచేందుకు అవసరమైన అనేక కథలు, వ్యాసాలు, గేయాలు, పద్యాలు, మహామహుల జీవిత కథలను ఇందులో చేర్చారు. ఆ కోవలో తొలి సారిగా పాఠశాల విద్యార్థులకు ఆదిలాబాదు గిరిజన వీరుడు 'కొమురం భీం'ను పిల్లల కోసం పాఠ్యపుస్తకాలలోకి చేర్చారు. సదాశివ కూర్చిన పాఠ్యపుస్తకాల గురించి అప్పుడు చదువుకున్న ప్రతి విద్యార్థి నేటికీ యాది చేయడం ఆయన ప్రతిభకు నిర్శనం.
ఆ శైలిలోని గొప్పదనమే వారు రాసిన బాలల రచనలు పిల్లలను ఆకట్టుకునేలా చేసింది. పిల్ల కోసం ఆయన కూర్చిన 'నాయకురాలు నాగమ్మ', 'దసరా పండుగ', 'జవహర్లాల్ నెహ్రూ', 'తిరుపతి వేంకటకవులు', 'అబ్రహం లికన్', 'నాడీ జంగుడు', 'చాంద్ బీబి', 'తిక్కన', 'అన్నమయ్య', 'మిర్జా గాలీబు' 'వివేకానంద స్వామి' వంటివి వీరి మేటి బాలల రచనలు. పిల్లల కోసం అనేక గేయాలు రాశారు. 1950 ప్రాంతంలో 'బాల' బాలల పత్రికలో సదాశివ అనువాద గేయాలు, బాల గేయాలు అచ్చయ్యాయి. వాటిలో 1952 నవంబర్ సంచికలో వచ్చిన 'సాలీడా!' గీతం ఒకటి. 'ఏమోయీ సాలీడా / ఏమి నేయుచున్నావు?/ అనురంగన కొఱకిపుడొక / అంబరమ్ము మొదలిడితిని' అంటూ ఇలా సంభాషణ రూపంలో సాగుతుందీ గీతం. ఇది 'స్పైడర్ వెబ్'కు అనువాదమని పేర్కొన్నా అచ్చమైన తెలుగు బాలల గీతంలా ఉండడం దీని విశేషం. ప్రౌఢ పద్యాన్ని, ఉర్దూ ఫారసీల అనువాదాన్ని, సంగీత మలయమారుతాల్ని ఎంత ప్రతిభావంతంగా తెలుగువారికి అందించారో బాలల కోసం బాధ్యతగా రచనలు చేశారు డాక్టర్ సామల సదాశివ మాష్టారు... తెలుగు బాలల 'సదాశివ తాతయ్య'.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548