Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దాశరథి' పేరుతో ప్రసిద్ధి చెందిన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య జూలై 22, 1925న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో పుట్టారు. శ్రీమతి వెంకటమ్మ, శ్రీమాన్ వేంకటాచార్యులు తల్లిదండ్రులు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి తెలంగాణ విముక్తి కోసం కృషి చేసిన దాశరథి కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు, సినీ గేయ రచయిత. 'రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే' అని నినదించి నిజాం పాలనకు చరమ గీతం పాడేందుకు పోరాడిన దాశరథి 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని ఎలుగెత్తి చాటాడు.
దాశరథి పోరాటయోధునిగా జైలుశిక్షను అనుభవించాడు, జైలులో ఖైదీగా అనేక బాధలకోర్చాడు. పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. 1953లో తెలంగాణ రచయితల సంఘంను స్థాపించాడు. ఉపాధ్యాయునిగా, పంచాయితీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసిన వీరు సినీగీత రచయితగా స్థిరపడ్డాక 1971లో ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1967లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కారం, 1974లో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్న వీరిని అనేక విశ్వవిద్యాలయాలు డి.లిట్లతో సత్కరించాయి. 1977లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమింపబడ్డారు. 1983లో తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 'అగ్నిధార', 'రుద్రవీణ', 'తిమిరంతో సమరం', 'అమృతాభిషేకం', 'ద్వజమెత్తిన ప్రజ', 'పునర్నవం', 'జ్వాలాలేఖిని' వంటి కావ్యాలు దాశరథి ప్రతిభకు తార్కాణాలు. మీర్జా గాలీబ్ ఉర్దూ గజళ్ళను 'గాలిబ్ గీతాలు' పేరుతో తెలుగులోకి అనువదించాడు. వందలాది సినిమా పాటలు రాసిన దాశరథి పిల్లల కోసం 'బాలల గేయాలు' రాశారు. దీనిని 1960లో కొండా శంకరయ్య సన్స్ వారు ప్రచురించారు.
1961లో 'ఇద్దరు మిత్రులు' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన దాశరథి తెలుగు సినిమా పాటకు ఉర్దూ పరిమళాలు అద్దడమేకాక, తెలుగులో గజల్ ప్రక్రియకు జీవంపోశారు. తెలుగు సినిమాల్లో 'ఇద్దరు అసాధ్యులే' అందాలపాపకు నూరేళ్ళు.. (బంగారు కలలు) పుట్టినరోజు జేజేలు.. చిట్టి పాపాయి... (దేవుడు చేసిన పెళ్ళి) ఓహో.. చిట్టిపొట్టి పాపల్లారా.. వంటి బాలల గీతాలు రాశారు. సినారెతో కలిసి పిల్లల కోసం 'బొమ్మల బాల భాగవతం', 'బొమ్మల బాల రామాయణం' రాశారు.
'విఘ్నేషునికీ దండాలు / వినాయ కునికీ దండాలు / ఎలుక సవారికి దండాలు / ఏనుగు మోముకు దండాలు / బొఱ్ఱ సామికీ దండాలు / పార్వతి కొడుకుకు దండాలు / ఉండ్రాలయ్యకు దండాలు / దయామయునికి దండాలు / వరాలయ్యకు దండాలు / బాలల పెద్దకు దండాలు' అంటూ బాల గేయాల్లో వినాయకుడిని 'బాలల పెద్ద' గా చెబుతారు దాశరథి. సమ సమాజం, సామ్యవాదం, కమ్యూ నిజాలు దాశరథికి యిష్టాలు. గాంధీ, నెహ్రూల పట్ల ఆయనకు ప్రేమ కూడా ఉంది. దాశరథి బాల గేయాల్లో 'చందమామ- నెహ్రూ మామ' గీతంలో 'మబ్బుల్లో దాగియున్న మనిషి యెవ్వరూ?/ రాత్రిపూట వెలుతురిచ్చు రాజెవ్వడూ?/ పిల్లలతో ఆడుకునే పెద్దెవడూ?/ చందమామ చందమామ ఇంకెవ్వడూ!' అని చెబుతూనే... చందమామ కు చెప్పిన పై గుణాలన్నీ ఉన్నవారు నెహ్రూ మామ కాక ఇంకెవ్వడని చాటుతూ.. 'చీకట్లనె చెదరగొట్టి దూకునెవ్వడూ?/ నెహ్రూమామ నెహ్రూమామ ఇంకెవ్వడూ' అంటారు,
'పిల్లిబావ అలుక-ఎలుక పిల్ల విందు' వీరి గేయాల్లో మరో చక్కని గేయం 'ఎలుకవచ్చి పిల్లిబావ నేమన్నదీ?/ అలుక వీడి తన యింటికి రమ్మన్నది' అంటూ సాగే ఈ పెద్ద గేయం పిల్లీ ఎలుకల తత్త్వాలను, ఎత్తులు పై ఎత్తులను చక్కగా చూపిస్తుంది. అందులోనూ కవి ఇందులో వర్ణించిన తిండి పదార్థాలు, ఇతర విషయాలు పిల్లలకు చక్కని విజ్ఞానాన్ని అందిస్తాయి. దాశరథి దేశభక్తుడు. స్వయంగా దేశవిముక్తి ఉద్యమంలో పాల్గొన్నాడు. భారతదేశం అంతా ఒక్కటే అని, రంగు రూపులు, భాషలు మతాలు వేరైనా అందరూ ఒక్కటే అని అయన భావన. బాల గేయాల్లోనూ దానిని చూడొచ్చు. 'జేజేలు' గేయంలో 'భారతమాతకు జేజేలు' అంటూనే 'కాశ్యీరానికి, వంగ భూమికి, కర్ణాటులకు, గుజరాతీలకు, అస్సామీలకు, ఢిల్లీ జనులకు, బీహారీలకు' అంటూ అందరికి జేజేలు పలుకు తతాడు. 'అమృత భారతికి జేజేలు / అఖిల భారతికి జేజేలు' అంటూ పిల్లలకు మార్గ నిర్దేశనం చేస్తాడు. పిల్లలంటే కవికి అమితమైన ప్రేమ, ఆ ప్రేమతోనే 'కత్తి పారెయ్యండి/ కలము చేపట్టండి' అంటూనే 'యుద్దాలు వద్దండి/బుద్దితో మెలగండి' అంటారు.
జండా గురించి చెబుతూ 'ఈ జండా చేతబూని / పూజింతాం దేశాన్ని / ఈ జండా నీడలోన / విడిచేతాం దేశాన్ని' అంటూ ఉద్భోద చేస్తారు. 'చిలుకపెండ్లి', 'గులాబి', 'కోకిలమ్మ', 'వూరేది', 'చదువు', 'విమానం' వంటి గేయాలు పిల్లలను ఆకర్శించడమే కాక చక్కని జ్ఞానాన్ని అందించే గేయాలు. 1980 వరకు గ్రామాల్లో చదువుకున్న వారికి కాన్గీ బడులు, ఆ బడుల్లో దసరానాడు ఉపాధ్యాయునితో ఇంటింటికి తిరుగుతూ పాడే 'గడల పాటలు' పరిచయమే! దానిని జ్ఞాపకంచేస్తూ రాసిన గేయం 'దసరా'. మహాకవిగా, అస్థాన కవిగా విశేషగౌరవ సత్కారాలు పొందిన డా.దాశరథి పిల్లల కోసం నిబద్ధతతో రాయడం ఆయనకు వాళ్ళపట్ల ఉన్న ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనం. ఈ మహాకవి 1987 సెప్టెంబర్ 5న హైదరాబాద్లో అస్తమించారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548