Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వల్లంకి తాళం - ఇదొక పుస్తకం పేరు. ఔను ఇదో ప్రకతి కావ్యం. పల్లె సొగసులాంటి కావ్యం. వర్ణించనలవిగాని - మరొకరి ఊహకు అందని వర్ణనలు ఒదిగిన కావ్యం. అచ్చ తెనుగు పదాలను తన పేరుగా పెట్టుకున్న కావ్యం. హదయాహ్లాదానికిదో వైద్యం. సాహితీ జ్ఞానానికి ఈ కావ్యం ఓ నైవేద్యం.
''చూడ రంగులన్ని ఒకటిగ నుండు'' అంటూ ప్రకతిని ప్రేమించి - ప్రకతిలో పరవశించి తన్మయించే హదయం అతడిది. పల్లె భాషను పరిమళింపజేసిన కవనం అతడిది.
ఔను.. అతడు తన కవనం నిండా పల్లె అందాన్ని ప్రకతితో మనిషి బంధాన్ని, మంచి భావగంధాన్ని ఒంపినవాడు. అతడు పాట, చిందు తానైన వాడు. షెల్లీలా, కష్ణశాస్త్రిలా పిట్ట గొంతుని, పువ్వు నవ్వుని వెర్రిగా ప్రేమిస్తూ - ఆ ప్రేమించడం అనే గుణాన్ని మనలోను నింపే ..అతడే వెంకన్న- గోరటి వెంకన్న.
పాటేకదా అనుకుంటాం కానీ - జీవిత - జీవన ఆరాటాల్ని, పోరాటాల్ని, వేడుకల్ని, సర్వ సుఖ దుఃఖానుభూతులకు వేదికైందే పాట. సుతారంగా ప్రాణ ప్రపంచాన్ని సొంతం చేసుకొనే పాట. వెంకన్న కలంలో, గళంలో సందడి చేసే పాట.
నిజం. ఆయన అక్షరాలు, భావాలు ''వద్ది మద్దెల మీది వల్లంకి తాళాలు. గాలి పెదవులు తాకిన వెదురు గానాలు''. వెన్నెలలో పూసిన గునుగు పూల అందాలు. గుబాళించే మొగలి పూల గుత్తులు. వెంకన్న కవిత్వం వద్దకొస్తే - ప్రకతి తత్వాన్ని, అక్షరాల ఆత్మల్ని తనలోకి ఆవాహన చేసుకుని రంగురంగుల పాటల పిట్టలుగా లోకం పైకి ఎగురవేశాడు. భావాలేవైనా, సిద్ధాంతాలేవైనా అవన్నీ ఆయనలో మగమై ఓ సమగ్రమైన ఆనంద ప్రదమైన ,ఆమోద యోగ్యమైన, ఆవేశపూరితమైన, తాత్వికతామయమైన, ప్రేరణాత్మక మైన గేయాత్మకమైన, లయాత్మకమైన దేశీయ భాషా పరిమళాన్ని వ్యాపింపచేసే కవితా పాదాలుగా అభివ్యక్తీకరింపబడ్డాయి.
వాటిలో ప్రాచీన సాహితీ పదబంధాలు, దీర్ఘ సమాసాలు ఉండవు. ప్రౌఢ సమాసాలు కనిపించవు. పూత రేకులంటి, పాలకంకి గింజలాంటి దేశీయ పదాలతో ఆయన కవిత్వం తీపి తేనె వాకే. అంతేకాదు. కొత్త ఊహలు, సరికొత్త ఇమేజస్తో పలుకరించి పులకరింపచేస్తుంది. అంతేనా కవిత్వమంతా - పండుటాకుల వీణలు, పూలసందళ్ళు, పుప్పొడి మైకాల సవ్వళ్ళు, పాలకంకుల మెరుపులు, సింగిణి బాణాలు, మొదల్కెన ప్రకతి అందాలనెన్నో వడ్డించిన తీరు ''వల్లంకి తాళం'' కావ్యంలో ఓ కొత్తకళ. నవనవోన్మోషుక్తి వైచిత్రి తళతళ.
పంచభూతాలలో ఒకటైన నేలను - పూల గోపురాల మేళ - అంటూ ఓ ఆహ్లాదకరమైన ఊహాచిత్రాన్ని మన ముందుంచారు. ఇలాంటి వాక్యాలని చూచినపుడే కదా - వాక్యం రసాత్మకం కావ్యం - అన్న మాటలు స్ఫురణకొచ్చేది. సర్వ జీవరాశులకు ఆధారమై ఎన్నో ఆదరువులను ఇచ్చే అడవిని వర్ణిస్తూ అడవిని ''పూలవీణ'' అంటారు. నిజమే కదా స్నిగ్ధమౌ సహజత్వానికి, ఆహ్లాదపరిచే అందాలకి ఆదివారమేగా. - చెలమ నవ్వులాటి చెట్టకు పువ్వులు రాలే పుప్పొడి వాన అడివి పూలవీణ'' అంటూ నీటికీ, చెట్టుకు, పక్షులకు అడవికి ఉండే విడదీయరాని అందమైన బంధాన్ని చెప్పకనే చెప్పారు వెంకన్న.. అంతేకాదు - ''అందాల తనువెల్ల వంపుకున్న అడవి అలరించె, తలపించె ఆకుపచ్చని కడలి.'' అంటూ ఎటుచూచినా కనబడే పచ్చదనాన్ని ఆకు పచ్చని కడలిగా అభివర్ణించారు.
కవులంతా వెన్నెలలో ప్రకతి ఎలా ఉందనే విషయాన్ని వర్ణించారు. వెన్నెలను వెంకన్నగారిలా ఎవరు నిర్వచించ లేదు. ఆయన వెన్నెలను వర్ణించిన తీరు కూడా మహాద్భుతం. ఎంత ఊహా చమత్కారం- అని అనిపించకపోదు. కవిత్వానికి చమత్కారం ఎంత అవసరమో ఈ వెన్నెల కవిత చదివితే తెలుస్తుంది -
విభూది ఫలమోలె, తామర దళమోలె, నీరెండ పూతోలె, పూల ముక్కరోలె, గూటిలోన, పిట్ట గుడ్డోలె, తాటిరేకుల కల్లు నురగోలె, తలకిందులైన తాబేటి సిప్పోలె - అంటూ ఎన్ని పద చిత్రాలనో మనముందుంచారు. ఇంకా ఉప్పురాశిలా, తెల్లనువ్వుల పంటలా- అంటూ వెన్నెలను నవ్యాతినవ్యంగా వర్ణించారు. ఎవరి ఊహకు అందని విధంగా - పరహితము కోసమై సర్వంబు నొసగిన నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల - అంటూ ఎంతో వినూత్నంగా చెప్పారు. ఇలాంటి అభివ్యక్తి రూపమేగా అసల్కెన కవిత్వ లక్షణం. ఈ వెన్నెల కవిత ఒకటి చదివితే చాలు వెంకన్నగారెంత ప్రకతి ప్రేమికులో, ప్రకతిలో ఎంతగా మమేకమై పోతారో, ప్రకతినెంతగా పరిశీలిస్తారో అర్థమౌతుంది. ఇలా ప్రకతిలోని ప్రతి అంశాన్ని ఓ భావచిత్రంగా ప్రదర్శించటం వెంకన్నగారికే చెల్లింది.
''ఎత్తు పచ్చని గడ్డి
వెదురు బడిగె బుట్టి
చంది గంధపు దట్టి
తడిసె జిగురు పట్టి
జీల కల్లు లొట్టి
ఇప్ప పూల బట్టి
ఆదిదాసుల మట్టి,
అడివి సిరుల ఉట్టి'' - ఇలా పల్లె పద సాహిత్యాన్ని తెలిపే ఇలాంటి ఉదాహరణలెన్నో ఆయన కవనంలో. నీడల గొడుగులు, సిబ్బి గంజోలె, కాటుక రాశులు, విరిపాకం, పసరుగాలి, వెలుగు కళ్ళాపి నవ్వులలెంక, వేర్ల అరుగులు, నవ్వు పుప్పొడి, ఎండపొడ దువ్వెన - ఇలాంటి పదబంధాలెన్నో ఆయన కవితలలో...
కమ్మని విందయిన
కారపు మెతుకయిన
రుచిలోనె తేదనంట
ఆకలి ఒకటె నంట - అనే వెంకన్న.
మనసెరిగి మెసలితె అది ప్రేమలా - అనే వెంకన్న
దీపం ఆరితే / చీకటి గూడే
ఎవరైతేనేమి / ఏకాకులే
అంటూ ఎంతో తాత్వికతను వ్యక్తపరిచే వెంకన్న-
''మతి చెడగొట్టే క్రతువులకన్న
గతి తప్పని మతి హితమేరన్న'' - అనే సత్యాన్ని తెలుపుతూ
''గాలి పొద్దుకు గింజకు
లేని అంటు రాని అంటు
తోటి మనిషి అంటుకున్న
తోవకెందు కుంటుంది'' - అంటూ అంటరానితనం గురించి తీవ్రంగా ప్రశ్నిస్తారు.
''గాలి, నింగి, నేల, నీరు ఆదిలో అందరిది'' అనే సత్యాన్ని ఎత్తి చూపుతూ
''కొండగట్టు నేల సెట్టు
సందె పొద్దు నీటి బొట్టు
మంచినే పంచిపెట్టు
చెడునే విసరి కొట్టు'' - అంటూ సర్వదాప్రకతి జీవులకు చేసే హితం గురించి స్పష్టం చేశారు.. కవిత్వ ప్రయోజనం అదే కదా.
''ఎల కోయిల గొంతెత్తాలె
వేకువ పూతలు చిగురించాలె
సీకటి భూతం వణకాలె'' - అని ఆశించే వెంకన్న
''పూసిన పూలకు దోసిలొగ్గితె
వాసిన పరిమళ మెంపునురా
కోసి మెడలో వేసుక తిరిగితె వాడి తాడై మిగులునురా - అంటూ నిస్వార్థ, స్వార్థ భేదాలను తాత్వికతా దష్టితో వివరించారు.
బాట, తోట అన్నిటా పూట పూట అందాలను, తాత్వికతా సుగంధాలను ఆస్వాదించే, పరవశించే వెంకన్న.
బాట మట్టి అణువణువులో పాటకి దరువెయ్యాలని అనుకునే వెంకన్న -
''పండి ఎండిన కాయ గింజ గజ్జలాడ
పరుగున పిట్టలు పరవశాన వాల
రాలే ఆకుల గాలి ఈలల వీణ
కిల కిల అలరింత పక్షిరాశుల సంత
మాయమయినంక సోయగా లేదింక - అంటూ పతనమై పోతున్న అడవి పచ్చదనాన్ని, మాయమై పోతున్న ప్రకతి సొగసుని చూసి ఆవేదనై -
''పల్లె కన్నీరు పెడుతోంది
కనిపించని కుట్రల - అని వ్యథా భరితమౌతారు.
''తరమెళ్ళి పోతున్నదో
త్యాగాల స్వరమాగిపోతున్నదో - అంటూ నేటి సమాజమెంత స్వార్థ పూరితము, లోభభూయిష్టమైందో ఎత్తి చూపుతారు. పగలు సెగలు లేని సహనం వెలగాలని కోరుకుంటారు.
ప్రజల భాషకు - జాను తెనుగుకు పట్టం కట్టి తన కవితా పదాలకు పథాలకు ఆ బాను తెనుగునే ఎంచుకొన్న ప్రపంచంలో ఏ జానపద వాగ్గేయకారులకి తీసిపోని మేటి తెలుగు జానపద వాగ్గేయకారులు వెంకన్న. ఆయన సమకాలీనులుగా మనమున్నందుకు ఆనందిద్దాం.
- రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, 9866583907