Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గజల్ ప్రక్రియ అరబ్బీ, పారశీ భాషల నుండి ఆవిర్భవించింది. ఉర్దూలో విస్తరించింది. ప్రియురాలితో సంభాషణ 'గజల్' రూపంలో ముఖ్యాంశం... సామాజికాంశాల్ని గజల్స్ పలికించిన కవులూ వున్నారు. తెలుగులో ఈ ప్రక్రియ కవి దాశరథి, సినారె, పెన్నా శివరామకృష్ణ, రెంటాల వెంకటేశ్వరరావులు ప్రాణం పోసారు. గజల్లో రెండు పాదాలు గల షేర్లు, 5, 7, 9 ఇలా చేసి సంఖ్యలో ఉంటాయి. గజల్లో పల్లవిని ''మత్లా'' అంటారు. చరణాలను ''షేర్లు'' అంటారు. చివరి చరణాన్ని ''మక్తా'' అంటారు. మక్తాలో కవి పేరు ఉంటుంది. దీన్ని ''తఖల్లస్'' అంటారు. గజల్స్ సాధారణంగా త్రిశ / చతురస్ర / మిశ్ర / ఖండ గతులల్లో రాస్తారు. వీటి వల్ల గానయోగ్యత కల్గును. అంత్యానుప్రాసను రూపొందించే పదం ''కాఫియా''- అలాగే రదీఫ్. ఇది పల్లవిలో రెండు పాదాల చివర వస్తుంది. షేర్లలో రెండవ పాదాల్లో మాత్రమే వస్తుంది. గజల్లో కాసియా - రదీఫ్లు ముఖ్యం. ఈ గజల్ సంపుటికి గజల్ కవి - పెద్దలు ఇరువింటి వెంకటేశ్వర శర్మ చక్కటి ముందుమాట రాసారు. వెన్నెల సత్యం గతంలో పద్యాల్లో రెక్కల్లో మణిపూసల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. ఈ గజల్స్లో కూడా పాఠకుల్ని గజల్ ప్రేమికుల్ని అలరించే గజల్స్ వున్నాయి. మొత్తం 54 గజల్స్లో కొన్నింటిని చూద్దాం! వెన్నెలను సంబోధిస్తూ తకల్లూస్ - మక్తాలో సహజంగా ఒదిగిపోయిన ఈ గజల్ చూడండి.
గాయాలే కానుకగా ఇచ్చావుగ ''వెన్నెలా''
నీ పేరే గేయంగా పాడాలని ఉంది లే- (పేజీ : 25 - 15వ గజల్లో)
అలాగే పూర్తి విరహాన్ని గజల్ ప్రక్రియలో చొప్పించి రాసిన ఈ కింది గజల్స్ చూడండి!
''కనుల మాటు స్వప్నసీమ చేసుకున్న వెన్నెల -
కన్నీళ్ళతో నీ గుండెను నింపాలని ఉన్నది - (పేజీ : 33 - 23వ గజల్లో)
''విరహమనే కన్నీళ్ళను తాగుతున్నదే సత్యం
కలల పాన్పు మీద నువ్వు చేరినట్లు కలగన్నా''
స్వీయ చరిత్రను కవిత్వంలో అదీ గజల్ ప్రక్రియలో ఒలిపించి రంజింప చేయడం కష్టం. ఈ కింది గజల్.. ఓ మచ్చుతునక - మెచ్చు తునక.
'మధుమేహం దేహంలో చుట్టంలా తిష్టవేసె -
తీయనైన బాధను మరిపించేందుకు నీవు లేవు-
విషాదాల నిశీధిలో ఒంటరిగా నడుస్తున్న -
'వెన్నెల' వై దారిని వెలిగించేందుకు నీవు లేవు- అంటారు (పేజీ : 50 - 40వ గజల్లో)
ప్రేమ, ప్రేయసి, విరహం, అర్పణ, ఆరాధన, అంకితం, సమాధి, త్యాగం వంటి భావాలతో గజల్ మైదానంలో వెండి వెన్నెల కురిపించిన కవి 'సత్యం' మరిన్ని గజల్స్ రాయాలి. శుభాకాంక్షలు.
(వాసంతిక (గజల్స్), కవి : వెన్నెల సత్యం, పేజీలు : 64, వెల : 100/-, ప్రతులకు : వెన్నెల సత్యం, ఇ.నెం. 18-209/5/ఎం, తిరుమల మెగా టౌన్ షిప్, షాద్ నగర్ - 509216. సెల్ : 9440032210)
- టి.ప్రసన్నకుమారి