Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణలను విద్యుక్త ధర్మంగా భావించి, తపించి పనిచేసిన వారిలో వెల్దుర్తి మాణిక్యరావు మొదటి వరుసలో ఉంటారు. డా. బాల శ్రీనివాసమూర్తి అన్నట్టు 'మాడపాటి వారి మార్గదర్శనంలో కార్యనిర్వహణా దక్షతను, ప్రతాపరెడ్డి సాన్నిహిత్యంలో పత్రికా సంపాదక ప్రతిభను, దాశరథి కవిత్వం ద్వారా లలితమైన అభివ్యక్తిని' అలవర్చుకున్న వెల్దుర్తి మాణిక్యరావు 1914లో మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో పుట్టారు. స్వగ్రామంలో, మెదక్, హైదరాబాద్‌లలో విద్యాబ్యాసం చేసిన మాణిక్యరావు ఇరవై యేండ్ల వయస్సులోనే మూడవ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. అణా గ్రంథమాల సంపాదకులుగా చేరిన మాణిక్యరావు తొలుత 'రైతు' పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. తరువాత గొల్కొండ పత్రికలో ఉప సంపాదకులుగా పనిచేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలియైన మాణిక్యరావు పాత్రికేయ ఉద్యోగం చేస్తూనే కథలు, కవిత్వం, ఇతర వచన రచనలు చేశారు. కేవలం సాహిత్య సృజనయేకాక చారిత్రక రచనలు చేశారు వీరు. వీరి 'హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర' ఆ కోవలో వచ్చిన ఎనమిది వందల పేజీల బృహత్ గ్రంథం. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యులైన వెల్దుర్తి మద్యపాన నిషేదోద్యమంలో భాగంగా వచ్చిన 'గ్రామ సుధార్' పత్రికను కూడా నిర్వహించారు. మెదక్ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. కథలు, కవితలు, బాల గేయాలు, ప్రభోద గేయాలు రాశారు. వీటిలో ఎప్పుడు కొన్ని మాత్రమే లభ్యం అవుతుఆన్నయి. 'మాడపాటి హనుమంతారావు జీవితం', 'ఖాదీ', 'దయానందుల చరిత్ర', 'ఎం.ఎన్.రారు', 'నెహ్రూ', 'వీర సావర్కర్', 'బొజ్జం నర్సింలు' జీవిత చరిత్రలు, 'మాణిక్య వీణ' కవితా సంపుటాలు ప్రచురించారు. మెదక్ యాసలో 'దయ్యాల పన్గడ' నాటకాన్ని తెలంగాణ భాషలో రాశారు. వీరి ముద్దు పేరు 'హసీనా చరణ చారణ చక్రవర్తి'.
'హసీనా' పేరుతో యాభైకి పైగా గేయాలు రాశారు. పిల్లల కోసం చక్కని బాల గేయాలు రాశారు వెల్దుర్తి, అయితే వీరి బాల గేయ సంపుటి వారు జీవించి ఉన్నప్పుడే ముద్రణకు సిద్ధం చేసినప్పటికీ వారు దీనిని అచ్చులో చూసుకోలేదు. పిల్లల కోసం మౌళిక రచనలే కాకా వెల్దుర్తి అనువాదాలు కూడా చేశారు. వీరి బాలల రచనలు, గేయాలు ఆనాటి బాల మొదలుకుని ప్రజామత, పల్లెటూరు, సుజాత వంటి అన్ని పత్రికల్లో అచ్చయ్యాయి.
'ఆకాశానికి నిచ్చెన గట్టి / తారకలతో తారంగాలాడుతాం / చంద్రప్పతో మబ్బుల్లో / దాగురింతలాడుతాం' అని రాసిన వెల్దుర్తి అప్పటిదాకా కవులందరు చంద్రున్ని మామ అంటే ఈయన 'చంద్రప్ప' అనడం విశేషం.
అటువంటిదే 1947, జనవరి, బాల పిల్లల పత్రికలో వచ్చిన రచన 'తెలుగు బొంగరాలు' బాల గేయం.
'బంగారు బొంగరము / వజ్రంపు ములికి / తెలుగు పేర్లను మెఱుగు / రవ్వలతొ జెక్కి /
వెండి జాలలు జట్టి / వొయ్యార మొలుక / అక్కయ్యని జూచి / ఆనంద మొంద /
చెల్లెలి పెదవిపై / నవ్వు మొలకెత్త / ఆటలాడర బాల / ఆంధ్ర వీధుల్లో' అని రాస్తారు. గేయాలే కాక పిల్లల కోసం అనేక కవితలు కూడా రాశారు వెల్దుర్తి వారు. పిల్లల్లో తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసను కలిగించడం వీరి కవితలు, గేయాలలోని ప్రధాన గుణం. ఈ శైలియే పిల్లలకు బాగా నచ్చుతుంది కూడా.
'చిన్న మా అమ్మాయి పాలకేడ్చింది / తెండోయి గంగావు మేన మామల్లు / పాలు పితుకుట కొరకు బంగారు ముంత / వెండి తీగల తట్ట పిండి పెట్టుటకూ / పట్టు పగ్గము నేడె పేనుకొని రండూ / మామ పితికిన పాలు అమ్మాయితాగు' అంటూ 'అమ్మాయి - ఆవు' గేయంలో రాస్తారు వెల్దుర్తి. ఇది 1946 సెప్టెంబర్ 'బాల'లో అచ్చయ్యింది. వెల్దుర్తి మాణిక్యరావు బాల గీతాలను 1930ల్లోనే బాల గీతాలు రాసిన వెల్దుర్తి రచనలో సరళ సుందరమైన శైలి, తీయతేనీయలొలికే తెలుగు తేట పదాలు వీరి ప్రతి బాలల రచనలో కనిపిస్తాయి. అందుకు ఈ కింది గేయ పాదాలు ఉదాహరణగా చూడొచ్చు. '...కాలి అందెలు మ్రోగ అమ్మాయి ఆడు / గంట గల్లున మ్రోగ చిరులేగ దుముకు / అమ్మాయి ఆటలకు తల్లి ముద్దాడు / ఆడు లేగను జీరి ఆవు మెయినాకు' అంటూ రాస్తారు వెల్దుర్తి. ఈ గేయం భాషా సౌందర్యాన్నే కాక బాల బాలికలకు ప్రకృతి పట్ల. ప్రకృతిలోని ప్రాణుల పట్ల ప్రేమను కలిగించేందుకు తోడ్పడతాయి. పరిశోధకులుగా, సంపాదకులుగా, అనువాదకులుగా అనేక పాత్రల్ని పోషించినప్పటకీ పిల్లల కోసం రాయడం వీరికి బాల్యం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. జూలై 28, 1994 న వెల్దుర్తి మాణిక్యరావు కన్ను మూశారు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548